యువీ వచ్చేశాడు | Sakshi
Sakshi News home page

యువీ వచ్చేశాడు

Published Tue, Oct 1 2013 1:13 AM

యువీ వచ్చేశాడు - Sakshi

చెన్నై: కఠోర శ్రమతో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన సీనియర్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ మళ్లీ భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. భారత్ ‘ఎ’, చాలెంజర్ సిరీస్‌లో దాదాపు ప్రతీ మ్యాచ్‌లోనూ తన బ్యాట్ పవర్ చూపించిన యువీని జాతీయ సెలక్టర్లు కరుణించారు. ఆస్ట్రేలియాతో జరిగే ఏకైక టి20, తొలి మూడు వన్డేల కోసం 15 మందితో కూడిన జట్టును సోమవారం ప్రకటించారు.
 
 గత జనవరిలో ఇంగ్లండ్‌పై ధర్మశాలలో జరిగిన వన్డేలో యువీ చివరిసారిగా భారత్ తరఫున ఆడాడు. ఆ తర్వాత ఐపీఎల్-6లో పేలవ ఫామ్ చూపించడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే ఆ తర్వాత ఫ్రాన్స్‌లో కఠినమైన శిక్షణ తీసుకుని పూర్తి ఫిట్‌నెస్ సాధించుకున్నాడు. విండీస్ ‘ఎ’తో పాటు ఇండియా బ్లూ తరఫున సూపర్ ఆటతీరును ప్రదర్శించాడు. అలాగే లెఫ్టార్మ్ స్పిన్‌తో జట్టుకు ఉపయోగపడే అవకాశం ఉండడం కూడా కలిసొచ్చింది. ఇక సీనియర్ ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్‌ల గురించి సమావేశంలో అసలు చర్చే జరుగలేదు.
 
 రాయుడువైపే మొగ్గు
 ఇంగ్లండ్‌లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన భారత జట్టులో నాలుగు మార్పులు జరిగాయి. ఓపెనర్ మురళీ విజయ్ స్థానంలో యువరాజ్ సింగ్ రాగా, దినేశ్ కార్తీక్ స్థానంలో అంబటి రాయుడును తీసుకున్నారు. అలాగే గాయపడిన ఇర్ఫాన్ పఠాన్ స్థానంలో మహ్మద్ షమీకి స్థానం దక్కింది. ఇటీవల ముగిసిన ఎన్‌కేపీ సాల్వే చాలెంజర్స్ ట్రోఫీలో పేసర్ ఉమేశ్ యాదవ్ బౌలింగ్ తీరు గతి తప్పడంతో జయదేవ్ ఉనాద్కట్‌కు అవకాశం చిక్కింది.
 
 జింబాబ్వే పర్యటనకు వెళ్లిన బెంగాల్ స్పీడ్‌స్టర్ మహ్మద్ షమీ, వినయ్, ఉనాద్కట్ తమ స్థానాలను నిలబెట్టుకున్నట్టయ్యింది. ఆ పర్యటన నుంచి విశ్రాంతి తీసుకున్న ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్‌తో పాటు జింబాబ్వేలో విశేషంగా రాణించిన అమిత్ మిశ్రా జట్టులో కొచ్చారు. మోహిత్ శర్మ, కాశ్మీర్ ఆల్‌రౌండర్ పర్వేజ్ రసూల్‌కు చోటు దక్కలేదు. రిజర్వ్ బ్యాట్స్‌మెన్ కోసం రాయుడు, రహానే మధ్య  తీవ్ర పోటీ జరిగినా హైదరాబాదీ వైపే మొగ్గు చూపారు.
 
 ఆసీస్‌తో సిరీస్ షెడ్యూల్
 అక్టోబర్ 10    ఏకైక టి20    రాజ్‌కోట్
 అక్టోబర్ 13    తొలి వన్డే    పుణే
 అక్టోబర్ 16    రెండో వన్డే    జైపూర్
 అక్టోబర్ 19    మూడో వన్డే    చండీగఢ్
 అక్టోబర్ 23    నాలుగో వన్డే    రాంచీ
 అక్టోబర్ 26    ఐదో వన్డే    కటక్
 అక్టోబర్ 30    ఆరో వన్డే    నాగ్‌పూర్
 నవంబర్ 2    ఏడో వన్డే    బెంగళూరు
 
 భారత జట్టు: ధోని (కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, వినయ్ కుమార్, అమిత్ మిశ్రా, అంబటి తిరుపతి రాయుడు, షమీ, ఉనాద్కట్.
 

Advertisement
Advertisement