హెల్మెట్ ధరించని మహిళలకు చలాన్లు | Sakshi
Sakshi News home page

హెల్మెట్ ధరించని మహిళలకు చలాన్లు

Published Wed, Sep 10 2014 10:31 PM

5,000 women challaned for not wearing helmets

సాక్షి, న్యూఢిల్లీ: హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం వెనుక సీటుపై కూర్చుని ప్రయాణిస్తోన్న మహిళలు బుధవారం చలాన్లు చెల్లించవలసివచ్చింది. ద్విచక్రవాహనం వెనుక సీటుపై కూర్చుని ప్రయాణించే మహిళలు కూడా హెల్మెట్లు ధరించాలన్న నియమం బుధవారం నుంచి అమల్లోకి వచ్చిన విషయం తమకు తెలియదని వారిలో పలువురు చెప్పారు. మొదటి రోజు ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యంతో వ్యవహరించినట్లు కొందరు మహిళలు చెప్పారు. ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఈ నిబంధనను కఠినంగా అమలుచేయాలనే ఉద్దేశంతోనే ఉన్నటు లకనిపించారు. ఇందుకోసం ట్రాఫిక్ పోలీసులు నగర రోడ్లపై 100 పోలీసు టీములను మోహరించారు . వారు వెనుక సీటుపై హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాలను రోడ్లపై ఆపి చలాన్లు విధించారు. సిక్కు మతస్తులమని చెప్పి తప్పించుకోచూసినవారిని అందుకు రుజువు చూపించవలసిందిగా ట్రాఫిక్ పోలీసులు కోరారు.
 
 ద్విచక్ర వాహనం నడిపే మహిళలే కాక వెనుక సీటుపై ప్రయాణించే మహిళలు కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని రవాణా విభాగం నియమం రూపొందించింది. ఇందుకోసం మోటారు వాహన చట్టంలో ఆగస్టు 28న  సవరణ చేసింది. సిక్కు  మహిళలకు మాత్రం ఈ నియమం నుంచి మినహాయింపు ఇచ్చారు. కాగా, బుధవారం నుంచి ఈ నియమాన్ని కఠినంగా అమలుచేసేందుకు పోలీసులు నిర్ణయించారు.
 
 మూడు వేల మందికి పైగానే..
 పోలీసులు బుధవారం నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో సుమారు 3,236 మంది మహిళలకు చలాన్లు రాశారు. నగరంలో ద్విచక్రవాహనాలపై వెనుక కూర్చుని వెళ్లే మహిళలు సైతం హెల్మెట్ ధరించాలనే నియమాన్ని బుధవారం నుంచి అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఈ నియమాన్ని కఠినంగా అమలు చేయనున్నట్లు ఇంతకుముందే పోలీసులు హెచ్చరించారు. సిక్కు మతస్తులు తప్ప మిగతా ఎవరైనా మహిళలు ద్విచక్రవాహనం వెనుక కూర్చుని ప్రయాణించే సమయంలో తప్పకుండా హెల్మెట్ ధరించాలని, లేకుంటే జరిమానాలు తప్పవని పేర్కొంది.
 
 దీనికోసం బుధవారం తెల్లవారుజామునుంచి సాయంత్రం 5 గంటల వరకు సుమారు 100 టీంలు విధులు నిర్వర్తించాయి. నగరవ్యాప్తంగా సుమారు 3,236 చలాన్లు రాశామని, అంతేకాక వారికి హెల్మెట్ ధరించాల్సిన అవసరం గురించి అవగాహన కల్పించామని పోలీసులు తెలిపారు. కాగా, వీరిలో అత్యధికంగా దక్షిణ పరిధిలో 928 చలాన్లు విధించినట్లు వారు తెలిపారు. అలాగే సెంట్రల్ నుంచి 785, తూర్పున 528, ఉత్తరాన 569 చలాన్లు రాశామని పోలీసులు పేర్కొన్నారు. ఈ డ్రైవ్ నిరంతరం కొనసాగుతుందని వారు వివరించారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement