తరలిన అభిమానం | Sakshi
Sakshi News home page

తరలిన అభిమానం

Published Mon, Dec 19 2016 1:47 AM

affection on jayalalitha

► జన సందోహంలో మెరీనా
► జయ సమాధి వద్ద బారులు
►బుల్లి తెర నటుల మౌన ర్యాలీతో నివాళి


సాక్షి, చెన్నై : దివంగత సీఎం, అమ్మ జయలలిత సమాధిని  దర్శించుకునేందుకు జన సందోహం పెద్ద ఎత్తున తరలి వస్తోంది. ఆదివారం అభిమాన లోకం తరలిరావడంతో మెరీనా పరిసరాలు కిక్కిరిశాయి. అభిమానులందరూ అమ్మ సమాధిని దర్శించుకున్నారు. కొందర యితే,  కన్నీటి పర్యంతంతో తమ ఆవేదన వ్యక్తం చేయగా, మరి కొందరు అమ్మను తలచుకుంటూ మౌనంగా రోదించారు.

తమిళుల ఆరాధ్య అమ్మ, దివంగత సీఎం జయలలిత భౌతికంగా అందర్నీ వీడి రెండు వారాలు అవుతోంది. దశాబ్దాల పాటు ప్రజసేవలో నిమగ్నమై, ఇక సెలవంటూ మెరీనా తీరంలో శాశ్వత నిద్రలో ఉక్కు మహిళ, విప్లవనాయకి జయలలిత ఉన్నారు. అమ్మ సమాధిని దర్శించుకునేందుకు నిత్యం జనం తరలి వస్తూనే ఉన్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో మరింతగా జనం తరలి రావడంతో మెరీనా పరిసరాలు కిటకిటలాడాయి. ఉదయం ఆరేడు గంటల నుంచే జనం రాక పెరిగింది. అన్నాడీఎంకే వర్గాలు, సామాన్య ప్రజలు, పర్యాటకులు ఇలా మెరీనాతీరానికి వచ్చిన ప్రతి ఒక్కరూ అమ్మ సమాధిని దర్శించుకుని మరీ వెళ్లారు.

అమ్మ సమాధిని పలు రకాల పుష్పాలతో అలంకరించారు. పార్టీ ముఖ్యులను మాత్రమే సమాధి వద్దకు అనుమతించగా, మిగిలిన వాళ్లందరూ బారికేడ్ల వద్ద నుంచి సమాధిని దర్శిం చుకుని వెళ్లారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన అభిమానులు, పార్టీ వర్గాలు అమ్మ జయలలిత సమాధిని దర్శించుకున్న అనంతరం పోయెస్‌ గార్డెన్ బాట పట్టడం గమనార్హం. పలువురు శిరోముండనం చెయించు కొని అమ్మ సమాధి వద్ద పువ్వుల్ని చల్లి అంజలి ఘటించారు. ఇక, చెన్నై పరిసర వాసులు సైతం తరలి రావడంతో మెరీనా పోటెత్తింది. ఇక, అమ్మ అభిమానలోకం, జనానికి అన్నాడీఎంకే వర్గాలు వాటర్‌ ప్యాకెట్లు, అల్పాహారం అందించారు. ఇక, బుల్లి తెర నటీ నటులు గాంధీ విగ్రహం నుంచి మౌన ప్రదర్శనతో ర్యాలీ నిర్వహించారు. జయలలిత సమాధి వద్ద నివాళులర్పించారు. జనం అత్యధికంగా తరలి రావడంతో మహిళల కోసం ప్రత్యేక క్యూ ఏర్పాటు చేశారు.

పోయెస్‌ గార్డెన్ వద్ద : అన్నాడీఎంకే వర్గాలు అమ్మ సమాధిని దర్శించుకున్న అనంతరం నేరుగా పోయెస్‌ గార్డెన్ కు చేరుకుని చిన్నమ్మ శశికళను పరామర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన అమ్మ జయలలిత చిత్ర పటం వద్ద నివాళులర్పించినానంతరం చిన్నమ్మ ముందు క్యూ కట్టారు. తిరుప్పూర్, పెరంబలూరు, కరూర్, మధురై జిల్లాల నుంచి అత్యధికంగా కేడర్, నాయకులు తరలి వచ్చారు. ఇక, కొంగు ఇలంజర్‌ పేరవై నేత, ఎమ్మెల్యే తనియరసు జయలలిత సమాధి వద్ద నివాళులర్పించినానంతరం పోయెస్‌ గార్డెన్ లో చిన్నమ్మతో భేటీ అయ్యారు.

జయలలిత పేరు: ఆ శిశువుకు జయలలిత అన్న నామకరణం చేశారు. అమ్మ మరణం తదుపరి తొలి నామకరణం ఇదే కావచ్చు. ఆ పేరును స్వయంగా జయలలిత నెచ్చెలి శశికళ పెట్టడం విశేషం. తేని నుంచి పోయెస్‌ గార్డెన్ కు వచ్చిన ఆటో డ్రైవర్‌ సెంథిల్‌కుమార్, గాయత్రి దంపతులు చిన్నమ్మను కలిశారు. తమ బిడ్డకు పేరు పెట్టాలని విన్నవించారు. ఆ బిడ్డను తన చేతుల్లోకి తీసుకున్న శశికళ  జయలలిత అని నామకరణం చేశారు.

Advertisement
Advertisement