వేలంలో ‘అన్నా’ కారు | Sakshi
Sakshi News home page

వేలంలో ‘అన్నా’ కారు

Published Thu, May 14 2015 11:30 PM

Anna Hazare to auction old Scorpio to raise money for new vehicle

- ఆదివారం రోజున వేలం వచ్చిన డబ్బుతో కొత్త వాహనం కొనుగోలు
సాక్షి, ముంబై:
ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే అనేక ఆందోళన కార్యక్రమాల్లో వినియోగించిన స్కార్పియో వాహనాన్ని ఆదివారం వేలం వేయనున్నారు. వేలంలో వచ్చిన డబ్బుతో మరో నూతన వాహనాన్ని అన్నా కొనుగోలు చేయనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం అన్నా వెన్నునొప్పి కారణంగా స్కార్పియోలో వెల్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. దీంతో అన్నా హజారే అభిమానులు కొత్త వాహనాన్ని తీసుకోమని ఆయనకు విన్నవించారు.

అయితే మొదట అన్నా దీన్ని తిరస్కరించినా చివరికి కొత్త వాహనాన్ని తీసుకోడానికి అంగీకరించారని తెలిసింది. దీంతో తొలిసారి అన్నా వాహనాన్ని వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించారు. అవినీతితోపాటు వివిధ అంశాలపై ఆందోళన చేపట్టిన అన్నా హజారే 2007లో స్కార్పియో వాహనాన్ని కొనుగోలు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న సమయంలో ఔండా నాగ్‌నాథ్‌లోని ప్రభుత్వ విశ్రాంతి గృహంలో ఉండగా ఆయన వాహనాన్ని గుర్తుతెలియని దుండగులు దొంగిలించారు. ఈ ఘటన ఆసమయంలో తీవ్ర కలకలం రేపింది. స్వయానా అప్పటి హోంశాఖ మంత్రి ఆర్ ఆర్ పాటిల్  దొంగను పట్టుకునే విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించినా ఫలితం దక్కలేదు. అయితే ఆయన వాహనానికి బీమా ఉండడంతో మహీంద్ర కంపెనీ ఆయనకు మఎంహెచ్ 16 ఏబీ 969 నెంబరుగల కొత్త వాహనాన్ని ఇచ్చింది. వాహనంపై ఇప్పటి వరకు సుమారు 1.75 లక్షల కిలోమీటర్లు ఆయన ప్రయాణించారు. 2007 - 2009 మద్యకాలంలో అవినీతికి పాల్పడిన మంత్రులకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలతోపాటు 2011 నుంచి 2013 మద్య కాలంలో జన్‌లోక్‌పాల్ బిల్లు ఆందోళన లకు ఇదే వాహనాన్ని వినియోగించారు.

Advertisement
Advertisement