పరువు నష్టం కేసు అరవింద్‌పై అభియోగాలు | Sakshi
Sakshi News home page

పరువు నష్టం కేసు అరవింద్‌పై అభియోగాలు

Published Sat, Sep 20 2014 11:18 PM

Arvind Kejriwal, three others put on trial in defamation case

న్యూఢిల్లీ: కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు కపిల్‌సిబల్ కుమారుడు అమిత్ దాఖలుచేసిన పరువునష్టం కేసుకు సంబంధించి స్థానిక న్యాయస్థానం ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ పై శనివారం అభియోగాలు నమోదు చేసింది. ఈ మేరకు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి సునీల్‌కుమార్ శర్మ... అర వింద్‌తోపాటు అదే పార్టీకి చెందిన ప్రశాంత్ భూషణ్, షాజియా ఇల్మీలపై కూడా అభియోగాలను నమోదు చేశారు. కాగా కపిల్ సిబల్ ....కేంద్ర  సమాచార శాఖ మంత్రిగా పనిచేస్తున్న సమయంలో ఆయన కుమారుడైన అమిత్ సిబల్ ... వోడా ఫోన్ సంస్థ తరఫున కోర్టుకు హాజరయ్యారు. తన వాదనలను వినిపించాడు.  ఈ విషయాన్ని2013లో జరిగిన మీడియా సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో సమావేశంలో ప్రస్తావించారు.
 
 దీంతో అమిత్ సిబల్... అరవింద్ కేజ్రీవాల్‌పై పరువునష్టం కేసు దాఖలు చేశారు. అమిత్ పిటిషన్‌ను పరిశీలించడంతోపాటు అతని తరఫు లాయర్ వాదనలను ఆలకించిన కోర్టు... ఈ మేరకు అభియోగాలను నమోదుచేసింది. ఈ కేసుకు సంబంధించి వచ్చే సంవత్సరం జనవరి 17వ తేదీన సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయనుంది. మరోవైపు అరవింద్‌పై బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకూడా కొన్నాళ్లక్రితం  పరువునష్టం కేసును దాఖలు చేసిన సంగతి విదితమే. మ్ ఆద్మీ పార్టీ గతంలో విడుదల చేసిన అత్యంత అవినీతిపరుల జాబితాలో తన పేరును చేర్చడంపై తీవ్ర ఆగ్రహానికిలోనైన గడ్కరీ.. తనపై మోపిన అభియోగాలను ఉపసంహరించుకుంటూ ఓ ప్రకటన విడుదల చేయాలని కేజ్రీవాల్‌ను నితిన్ కోరారు. అలా అయితే ఈ కేసును ఉపసంహరించుకునేందుకు సిద్ధమేనని ప్రకటించారు.
 
 అయితే ఇందుకు కేజ్రీవాల్ అంగీకరించలేదు. దీంతో గడ్కరీ...ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై పరువునష్టం దాఖలుచేశారు. సదరు పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం ఈ ఏడాది ఆగస్టు రెండో తేదీన అరవింద్‌పై అభియోగాలు నమోదు చేసింది. ఇద్దరూ ఒకచోట కూర్చుని ఈ వివాదాన్ని పరిష్కరించాలని అంతకుముందు కోర్టు సూచించింది. ఇద్దరూ రాజీకి రాలేదు. దీంతో ఈ కేసుకు సంబంధించి కూడా కోర్టు అప్పట్లో అరవింద్‌పై అభియోగాలను నమోదుచేసింది. ఈ కేసు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి తనను మినహాయించాలంటూ కేజ్రీవాల్ చేసిన విన్నపానికి కోర్టు అంగీకారం తెలిపిన సంగతి విదితమే.  
 

Advertisement

తప్పక చదవండి

Advertisement