హస్తినాధీశులెవరు..? | Sakshi
Sakshi News home page

హస్తినాధీశులెవరు..?

Published Sat, Dec 7 2013 10:21 PM

Assembly poll verdict: Fate of four state govts will be known tomorrow

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ విధానసభ స్థానాల ఓట్ల లెక్కింపు ఘడియలు సమీపిస్తుండడంతో అధికారం ఎవరికి  దక్కుతుందోనన్న ఉత్కంఠ మూడు రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలతోపాటు సామాన్య ప్రజానీకంలో పెరుగుతోంది. నగరంలో ఏ నలుగురు ఒకచోట చేరినా ఇదే విషయమై చర్చిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ  నగర రాజకీయ సమీకరణాలను మార్చేసిందని అంగీకరిస్తోన్న రాజకీయ పండితులు   ఆ పార్టీ ప్రభావం ఎన్నికలపై ఎంతమేర ఉంటుందనేది అంచనా వేయలేకపోతున్నారు. ఎన్నికలకు ముందు ఆప్ ప్రభావాన్ని తేలికగా కొట్టిపారేసిన కాంగ్రెస్, బీజేపీలు ఇప్పుడా అభిప్రాయాన్ని గట్టిగా వ్యక్తం చేయలేకపోతున్నాయి.  గెలుపు తమదే అని ధీమాగా చెపుతోన్న పార్టీ నేతలు కూడా తమకు ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. మొత్తంమీద ఢిల్లీలో అధికారం కోసం పోరాడిన మూడు పార్టీలు ఇప్పుడు సీట్ల లెక్కలలో పడ్డాయి. హంగ్ అసెంబ్లీ ఏర్పడినట్లయితే  అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఏం చేయాలనేదానిపై  బీజేపీ, కాంగ్రెస్‌లు మంతనాలు సాగిస్తున్నాయి.
 
 ‘చే’జారుతుందన్న బెంగలో కాంగ్రెస్..
 15 సంవత్సరాలుగా తమ చేతుల్లో ఉన్న అధికారం చేజారుతుందేమోనన్న బెంగ కాంగ్రెస్‌ను వేధిస్తోంది. ఢిల్లీలో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటన్నది తాను చెప్పలేనని దిగ్విజయ్ సింగ్ ఇటీవల తన మనసులోని మాటను బయటపెట్టారు. కాంగ్రెస్‌కు 27 స్థానాలు రావచ్చని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ పార్టీ నేతలతో చెప్పినట్లు సమాచారం. త్రిశంకు సభ ఏర్పడిన పక్షంలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి పొత్తులు, చీలికలపై ఆ పార్టీ దృష్టిసారిస్తోంది. 2008 ఎన్నికలలో  కూడా తమకు ఓటమి తప్పదని అన్నారని, అయితే ఫలితాలు అందుకు భిన్నంగా వెలువడ్డాయని కొందరు కాంగ్రెస్ నేతలు గుర్తుచేస్తున్నారు. తమకు  కంచుకోటగా పరిగణించే ఈశాన్య ఢిల్లీలో అత్యధిక శాతం ఓటింగ్ నమోదు కావడం కూడా కాంగ్రెస్‌ను కలవరపరుస్తోంది.
 
 హంగ్ ఊహాగానాలపై కమలంలో కలవరం
 ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీజేపీలో ఆశను నింపినప్పటికీ హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందనే అభిప్రాయాలు ఆ పార్టీ నేతలను కలవరపరుస్తున్నాయి. పదిహేనేళ్ల తర్వాత అధికారం దక్కించుకుంటామన్న ఆనందం తో ఉన్నప్పటికీ 2008 ఎన్నికల అనుభవం నేపథ్యంలో ఆచితూచి స్పందిస్తున్నారు. స్పష్టమైన మెజారిటీపై కూడా పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి మెజారిటీ స్ధాధిస్తామని సీఎం అభ్య ర్థి హర్షవర్ధన్ ధీమాతో ఉండగా, మెజారిటీ రానట్లయి తే అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు గోయల్ పేర్కొన్నారు. బీజేపీకి 35 సీట్లు రావచ్చచని ఆయన అంచనా వేస్తున్నారు. సంపూర్ణ మెజారిటీ రానట్లయితే బీఎస్పీ, ఇండిపెండెంట్ల సహాయంతో ప్రభుత్వం ఏర్పాటుచేసే విషయాన్ని బీజేపీ దిగ్గజాలు పరిశీలిస్తున్నాయి.
 
 వస్తే కొండ.. పోతే వెంట్రుక ధోరణిలో ఆప్
 ఎన్నికల బరిలో తొలిసారిగా దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ ఉరకలెత్తుతున్న ఉత్సాహంతో ఉంది. ఆశించిన ఫలి తాలు వస్తే ముఖ్యమంత్రి గద్దెపై కూర్చుంటామని, లేదంటే ప్రతిపక్షంలో కూర్చుంటామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వస్తే కొండ.. పోతే వెంట్రుక అనే ఆప్ నేతలు వ్యవహరిస్తున్నారు. తాము ఏ పార్టీకి మద్దతు పలికేది లేదని ఆ పార్టీ నేతలు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే బీజేపీ తమ అభ్యర్థులను సంప్రదిస్తోందని ఆప్ నేత మనీష్ సిసోడియా ఆరోపించారు. త్రిశంకు సభ ఏర్పడినట్లయితే తాము  కాంగ్రెస్‌కుగానీ, బీజేపీకిగానీ మద్ద తు ఇచ్చేందుకు సుముఖంగా లేమన్నారు.  తమకు అధికారాన్ని కట్టబెట్టనట్లయితే ప్రతిపక్షంలో కూర్చుంటామని సిసోడియా తెలిపారు. పార్టీకి సానుకూలంగా సంకేతా లు వెలువడినా ఎన్ని స్థానాలు గెలుస్తామన్నది ఆ పార్టీ నేతలు చెప్పలేకపోతున్నారు.
 
 సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఢిల్లీవిధానసభ ఎన్నికల ఫలితాలకు ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. నగరంలోని 9 జిల్లాల్లో ఏర్పాటు చేసిన 14 ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. కేవలం 70 అసెంబ్లీ స్థానాలే కావడంతో మిగిలిన రాష్ట్రాల ఫలితాలతో పోలిస్తే ఢిల్లీ పీఠం ఎవరిదో కొన్ని గంటల్లోనే తేలిపోనుంది. త్రిముఖ పోరులో గెలిచి నిలుస్తామన్న ధీమా అన్ని పార్టీల్లోనూ వ్యక్తం అవుతోంది. ఇప్పటి వరకు వెల్లడైన ఎగ్జిట్‌పోల్స్ అన్నీ పదిహేనే ళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ‘చేతు’ల్లోంచి ఢిల్లీపీఠం జారిపోనుందని పేర్కొన్నాయి. ఇక ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కమల వికాసం ఈసారి ఖాయమని కొన్ని సర్వేలు వెల్లడించాయి. మొదటిసారిగా ఎన్నికల బరిలో నిలిచిన ఆమ్‌ఆద్మీపార్టీ అనూహ్య ఫలితాలు సాధిస్తే హంగ్ ఖాయమని మరికొన్ని సర్వేలు తెలిపాయి.
 
 ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీకి ధీటుగా నిలిచిన తొమ్మిది నెలల ఆమ్ ఆద్మీ పార్టీ రాక హస్తిన పోరుపై ఆసక్తిని రెట్టింపు చేసింది. డిసెంబర్ 4న జరిగిన ఓటింగ్‌లో రికార్డు స్థాయిలో ఢిల్లీవాసుల ఇచ్చిన తీర్పు ఈవీఎంల్లోంచి మరికొన్ని గంటల్లో వెలువడనుంది. మొత్తం అన్ని పార్టీల నుంచి 810 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలవగా వీరిలో 70 మంది విజేతలెవరో కొద్ది సేపట్లో తేలనుంది. ఓటింగ్‌శాతం పెరగడంతో గెలుపు అవకాశాలు తారుమారు అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు మొత్తం 70 నియోజవర్గాల నుంచి తమ అభ్యర్థులను బరిలోకి దింపగా, బీజేపీ 66 స్థానాలకే పరిమితమైంది. బీఎస్పీ 69 మందిని, ఎన్‌సీపీ 9 మందిని, సీపీఎం ముగ్గురిని, శిరోమణి అకాళీదళ్ ఇద్దరిని బరిలోకి దించింది. వీరు కాకుండా స్వతంత్రులతో కలిపి మొత్తం 810 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement