రోడ్డు ప్రమాదమా.. హత్యాయత్నమా? | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదమా.. హత్యాయత్నమా?

Published Mon, Jun 9 2014 1:42 AM

Attempted murder of accidents ..?

  • గాయపడ్డ ముగ్గురు ‘ఎర్ర’ దొంగలు
  • వీరిలో ఇద్దరి పరిస్థితి విషమం
  • అనంతపురం క్రైం, న్యూస్‌లైన్ : అనంతపురం శివారులో ఆదివారం వేకువజామున జరిగిన ఎర్రచందనం దొంగల ముఠా సభ్యుల రోడ్డు ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరు రోడ్డు ప్రమాదానికి గురయ్యారా.. లేక ఎర్రచందనం దుంగలను రహస్యంగా తరలించి సొమ్ము చేసుకుంటుంటే పసిగట్టి ముఠా నేతలే వాహనంలో వెంబడించి ఏమైనా హత్య చేయడానికి ప్రయత్నించారా అన్నది అంతుచిక్కడం లేదు.

    ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా.. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకెళితే.. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన నారాయణ అలియాస్ అగస్టీన్, ఇదే మండలం దొరికొట్టాలకు చెందిన రాజు, కర్ణాటకవాసి సోహైల్ శనివారం రాత్రి శ్రీశైలం అడవుల నుంచి తొమ్మిది ఎర్రచందనం దుంగలతో కేఏ05 ఎంపీ 2855 నంబరుగల క్వాలీస్ వాహనంలో బెంగళూరుకు బయల్దేరారు.

    ఆదివారం తెల్లవారుజామున నాలుగున్నర గంటల సమయంలో అనంతపురం నగర శివారులోని సోములదొడ్డి సమీపాన 44వ నంబరు జాతీయరహదారి వంతెనపై రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురూ లేవలేని స్థితిలో ఉన్నా పోలీసుల కంటపడకూడదని తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయితే స్థానికులు అక్కడకు చేరుకుని మానవతా దృక్పథంతో వారిని సర్వజనాస్పత్రికి చేర్చారు.

    అగస్టిన్, రాజు అపస్మారకస్థితికి చేరుకున్నారు. సోహైల్ మాత్రం స్పృహలో ఉన్నాడు. రోడ్డు ప్రమాదంపై అవుట్‌పోస్ట్ పోలీసుల నుంచి సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఉదయం పదిన్నర గంటల సమయంలో సంఘటన స్థలానికెళ్లారు. నుజ్జునుజ్జయిన క్వాలీస్ వాహనాన్ని తనిఖీ చేయగా.. సీటు కింద 9 ఎర్రచందనం దుంగలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే సర్వజనాస్పత్రిలో ఆ ముగ్గురు ఎర్రచందనం దొంగల ముఠా సభ్యులకు ఎస్కార్‌‌టను నియమించారు. ఈ ముఠా వివరాలను తెలుసుకునేందుకు.. ఇంకా ఎక్కడెక్కడ దుంగలను నిల్వ చేశారో తెలుసుకునేందుకు విచారణ చేస్తున్నారు.
     
    ఆ దుంగలు.. అటవీశాఖ కార్యాలయంలోనివంటూ పుకార్లు

    అనంతపురం ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో నిల్వ ఉంచిన ఎర్ర చందనం దుంగలను ఆధివారం తెల్లవారు జామున గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకెళ్లారు. ఈ విషయంపై అటవీశాఖాధికారులు తర్జన భర్జనలో ఉండగానే...రోడ్డు ప్రమాదంలో ఎర్ర చందనం దొంగలు గాయపడి పోలీసులకు చిక్కారు.
     
    వీరి వాహనంలో లభించిన దుంగలు అటవీశాఖ కార్యాలయంలో అపహరణకు గురైనవీ ఒక్కటేనేమోనని పుకార్లు షికార్లు చేశాయి. చివరకు ఆ దుంగలు అటవీశాఖవి కాదని నిర్ధారణైంది. దీంతో రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement
Advertisement