తీహార్ జైలులో కార్ల విడిభాగాల యూనిట్ | Sakshi
Sakshi News home page

తీహార్ జైలులో కార్ల విడిభాగాల యూనిట్

Published Sun, Sep 7 2014 10:25 PM

Automotive Manufacturing Unit in Tihar Jail to be Run by Inmates

 తీహార్: దేశంలోనే మొట్ట మొదటిసారిగా తీహార్ జైలులో ఖైదీలకు ఉపాధి అవకాశాలు కల్పించేం దుకు అధికారులు చర్యలు తీసుకొంటున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో కార్ల విడిభాగాల తయారీ యూనిట్‌ను శుక్రవారం ఢిల్లీ జైళ్ల విభాగం డెరైక్టర్ జనరల్ అలోక్ వర్మ తీహార్ జైలు నంబర్-2లో ప్రారంభించారు. జైలులోని ఖైదీలకు శిక్షణతోపాటు, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఇది దోహదపడుతుంది. దీర్ఘకాలిక లేదా స్వల్పకాలికంగా ఇందులో ఖైదీలు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. పనిచేసే కాలంలో వేతనాలను కూడా చెల్లిస్తారు. ఇక్కడ పనిచేసిన అనుభవం జైలు శిక్షాకాలం పూర్తయిన తర్వాత స్వయం ఉపాధి పొందడానికి దోహదపడుతోందని జైళ్ల విభాగం డీఐజీ, పీఆర్‌వో ముఖేశ్ ప్రసాద్ తెలిపారు.
 
 అ కార్ల విడిభాగాల తయారీ యూనిట్ మిందా ఫరుక్వా ఎలక్ట్రిక్ ప్రైవేట్ లిమిటెడ్(ఎంఈఈ) నిర్వహిస్తోంది. స్పార్క్ ఇండియా, అశోక్ మిందా గ్రూప్ ఆఫ్ ఇండియా, జపాన్‌కు చెందిన ఫరుక్వా జాయింట్ వెంచర్‌తో ఈ యూనిట్ నడుస్తుంది. ఇందులో వైర్ హార్‌నెస్ ఉత్పత్తులు, ముఖ్యమైన విడిభాగాలను తయారీతో పాటు మార్కెటింగ్ సౌకర్యం కూడా ఉంది. ఈ మేరకు మార్చి 30న తీహార్ జైలు అధికారులు, ఎంఎఫ్‌ఈ అధికారులు మారుతీ సుజీకి ఇండియా లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకొన్నారు. ఈ కార్ల తయారీ యూనిట్‌లో ఎంఎఫ్‌ఈ సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో ఖైదీలు పనిచేస్తారు. అత్యధికంగా వేతనాలు కూడా అందజేస్తారు.
 
 జైలు శిక్ష పూర్తయిన తర్వాత ఖైదీలు జీవితంలో స్థిరపడడానికి ఈ పని అనుభవం తోడ్పడుతుందని, బయట కూడా మంచి అవకాశాలు లభిస్తాయని జైలు అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఖైదీలకు ఉపాధి కల్పించడం ద్వారా సమాజానికి సానుకూల సందేశాన్ని పంపిస్తున్నామని పీఆర్‌వో ప్రసాద్ అన్నారు. స్పార్క్ మిందా గ్రూప్ చీఫ్ మార్కెటింగ్ అధికారి ఎన్ కే తనేజా మాట్లాడుతూ ఈ కార్ల తయారీ యూనిట్‌ను తీహార్ జైలులో సేవాదృక్పథంలో స్థాపించామని, ఎలాంటి లాభాపేక్ష లేదని అన్నారు.
 
 శిక్షపూర్తి అయిన ఖైదీలతోపాటు వారి కుటుంబాలు, బాధితులకు కూడా మేలు చేకూర్చాలనే ఉద్దేశంతో యూనిటను చేపట్టామని అన్నారు. పలు జైళ్లలో ఇలాంటి కార్యక్రమాలను విస్తరించడానికి చర్యలు తీసుకొంటున్నామని అన్నారు. ఎంఎఫ్‌ఈ పర్యవేక్షణలో ఖైదీలు పనిచేస్తారని చెప్పారు. మిషనరీ, ముడిసరుకు, నాణ్యత ప్రమాణాలను ఎంఎఫ్‌ఈ పర్యవేక్షిస్తుందన్నారు. ప్రస్తుతం ఈ యూనిట్‌లో 30 నుంచి 35 మంది ఖైదీలకు అవకాశం కల్పిస్తున్నామని, భవిష్యత్‌లో ఈ సంఖ్యను పెంచుతామని జైళ్ల డీఐజీ చెప్పారు. కార్యక్రమంలో స్పార్క్  ముండా చైర్‌పర్సన్, ఎంఎఫ్‌ఈ అధ్యక్షుడు మెయిన్షీ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement