బిజీలెస్ బిజినెస్! | Sakshi
Sakshi News home page

బిజీలెస్ బిజినెస్!

Published Sun, Mar 30 2014 10:48 PM

బిజీలెస్ బిజినెస్! - Sakshi

న్యూఢిల్లీ: ఎన్నికలొస్తున్నాయంటే అందరికంటే ముందు బిజీగా మారేది కళాకారులే. పార్టీల జెండాలు తయారు చేయడం, పార్టీ అధినేతల కట్‌ఔట్‌లు రూపొందించడం, బిల్ బోర్డులు రాయడం వంటి పనుల్లో కళాకారులు తలమునకలవుతారు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి మొదలైనా ఆర్టిస్టులు మాత్రం ఈగలు తోలుతున్నారు. అందుకు కారణం... రాజకీయ పార్టీలేవీ సంప్రదాయ ప్రచారంపై పెద్దగా ఆసక్తి చూపకపోవడమే. ఢిల్లీలో మరో 12 రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నా ఇక్కడి కళాకారులకు ఇంకా పనిదొరకడం లేదు. అందుకు కారణం అభ్యర్థులు తమ ప్రచారానికి ఫేస్‌బుక్, ట్విటర్, వాయిస్ మెసేజ్, ఫోన్ కాల్స్ వంటివాటిపై ఆధార పడడమే. 
 
 సోషల్ మీడియా ప్రభావం ఇటీవల రోజుల్లో భాగా పెరిగిపోవడంతో ఆయ పార్టీలు ఆ దిశగా ప్రచారం చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇక ఎలక్ట్రానిక్ మీడియాను మేనేజ్ చేసి మరికొందరు ప్రచారం చేసుకుంటున్నారు. ప్రత్యక్షంగా ప్రకటనలు ఇవ్వడం, పరోక్షంగా తమకు లబ్ది చేకూరేలా కథనాలు ప్రసారం చేయించడం వంటివి చేస్తున్నారు. అదీగాక అభ్యర్థుల ప్రచారంపై ఎన్నికల సంఘం సవాలక్ష ఆంక్షలు విధించడంతో కూడా సంప్రదాయ ప్రచారంవైపు అభ్యర్థులు దృష్టిసారించడంలేదు. దీంతో గోడలపై అభ్యర్థుల పేర్లు, ఫలానా పార్టీని గెలిపించండి అంటూ రాతలు రాసే కళాకారులకు పనిలేకుండా పోయింది. ఇక కట్‌ఔట్‌లు, బిల్లుబోర్డులు తయారు చేసే కళాకారులకు కూడా ఆదరణ బాగా తగ్గింది. పార్టీల జె ండాలు రూపొందించేవారి వ్యాపారాలు కూడా సన్నగిల్లాయి. 
 
 ఈ విషయమై సదర్‌బజార్‌కు చెందిన అనీస్‌భాయ్ అనే కాళాకారులు మాట్లాడుతూ... ‘1989 సార్వత్రిక ఎన్నికల నుంచి ఈ వ్యాపారంలో ఉన్నాను. అన్ని రాజకీయ పార్టీలకు జెండాలు, కట్‌ఔట్‌లు, బిల్‌బోర్డులు సరఫరా చేస్తుంటాను. ఎన్నికలు వస్తున్నాయంటే ఎంతో ఆశతో సామగ్రిని సిద్ధం చేసుకుంటాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న మా వ్యాపారం మాత్రం ఇంకా ఊపందుకోలేదు. గతంలో మున్సిపల్ ఎన్నికలు జరిగిన ఒక్కో పార్టీ కనీసం 5,000 జెండాలకు ఆర్డురు ఇచ్చేవి. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నా అభ్యర్థులు కనీసం వంద జెండాలకు కూడా ఆర్డరు ఇవ్వడంలేదు. ఇక కట్‌ఔట్‌ల ఊసే ఎత్తడంలేదు. ఇందుకు కారణం అభ్యర్థులు ఆన్‌లైన్ ప్రచారంపై ఎక్కువగా ఆధారపడడమే. అదీగాక ఎన్నికల సంఘం విధిస్తున్న ఆంక్షలు కూడా మా వ్యాపారం తగ్గడానికి కారణం. దీంతో ఇక మా పిల్లలను ఈ వృత్తిలోకి దించాలంటేనే భయమేస్తోంది. ప్రత్యామ్నాయం చూసుకోవాలంటూ చెబుతున్నాన’న్నారు.
 
 ఇలా అనీస్‌భాయ్ వ్యాపారం మాత్రమేకాదు ర్యాలీకు కార్లు, ఓపెన్‌టాప్ జీపులు అద్దెకిచ్చేవారి వ్యాపారం కూడా బాగా తగ్గింది. ఓ పార్టీ నగరంలో ర్యాలీ నిర్వహిస్తుందంటే కనీసం 25 కార్లకు తగ్గకుండా అద్దెకు తీసుకునేవారని, అలాంటిది ఇప్పుడు ఐదు కార్లు అద్దెకు తీసుకోవడానికి కూడా జంకుతున్నారని సంబంధిత వ్యాపారులు అంటున్నారు. ‘ఎన్నికలు ఎప్పుడూ ఉండవు. రెండుమూడేళ్లకోసారి మాత్రమే మాకు చేతినిండా పని ఉంటుంది. అలాంటిది ఇప్పుడు మా వ్యాపారం సగానికిపైగా తగ్గింది. అటువంటప్పుడు 13 మందితో ఉన్న మా కుటుంబం ఎలా బతకగలగుతుందో నాకు అర్థం కావడంలేద’ని మరో వ్యాపారి తన గోడు వెల్లబోసుకున్నాడు. 
 
 సదర్‌బజార్‌లో కనిపించని సందడి..
 గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ రంగప్రవేశంతో ఢిల్లీలో ఎన్నికల ప్రచారం తీరు పూర్తిగా మారిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తమ ప్రచారానికి ఎక్కువగా సోషల్ మీడియా మీద ఆధారపడడం, ఆ పార్టీ అనూహ్య విజయాలు సాధించడంతో ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో కూడా మిగతా పార్టీలు అదే విధానంపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. దీంతో సదర్ బజార్‌లోని పార్టీ జెండాలు అమ్మే దుకాణాలు వ్యాపారం లేక వెలవెలబోతున్నాయి. ఈ మార్కెట్‌లో దాదాపు 8 నుంచి 10 దుకాణాలు ప్రత్యేకించి ఎన్నికల సామగ్రిని మాత్రమే విక్రయిస్తుంటాయి. వీరంతా తమ వ్యాపారం ఇప్పుడు బాగా తగ్గిందని చెబుతున్నారు. ఇక నగరవ్యాప్తంగా సుమారు 2,000 మంది ఆర్టిస్టులు ఎన్నికలకు సంబంధించిన రాతలు, చిత్రాలను గీస్తుం టారు. ఎన్నికలొచ్చాయంటే రేయింబవళ్లు పనిచేసే వీరికి ఇప్పుడు కనీసం పగలంతా చేసేందుకు కూడా పని దొరకడం లేదు.
 

Advertisement
Advertisement