బీజేపీ ధర్నా | Sakshi
Sakshi News home page

బీజేపీ ధర్నా

Published Sat, Feb 1 2014 10:57 PM

BJP Darna in new Delhi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపును అడ్డుకోలేకపోయినందుకు నిరసనగా ఢిల్లీ బీజేపీ శనివారం ప్రదర్శన నిర్వహించింది. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వం ప్రభుత్వాన్ని నడపడంలో విఫలమైందని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో దేనినీ అధికారంలోకి వచ్చాక నెరవేర్చలేకపోయిందని విమర్శించింది. ఈ నిరసన ప్రదర్శనకు నేతృత్వం వహించిన ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు విజయ్ గోయల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తరువాత ధరల పెరుగుదలను నియంత్రిస్తామని ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) ప్రకటించిందని, కరెంటు చార్జీలు తగ్గడానికి బదులు ఎనమిది శాతం పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటిచార్జీలు సైతం పది శాతం పెరిగాయని విజయ్‌గోయల్ అన్నారు.
 
 విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) విద్యుత్ చార్జీలను తగ్గించకపోగా, పది గంటలు విద్యుత్ కోతలు విధిస్తామని హెచ్చరించాయని ఆయన చెప్పారు. ఆప్ సర్కారు విద్యుత్ చార్జీలను తగ్గించకపోగా, విద్యుత్ కోతలను కూడా ఆపలేకపోయిందని ఈ సీనియర్ నేత మండిపడ్డారు. డిస్కమ్‌ల ఆడిటింగ్‌ను కొనసాగిస్తూనే, సరఫరా సంబంధిత సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం డిస్కమ్‌లతో చర్చలు జరపాలని విజయ్ గోయల్ అన్నారు. నీరు, విద్యుత్ ప్రజలకు అందించడంలో విఫలమైన సర్కారు తక్షణం గద్దెదిగాలని బీజేపీ నేత హర్షవర్ధన్ అన్నారు.
 

Advertisement
Advertisement