రాజధానిలో కాషాయ హవా! | Sakshi
Sakshi News home page

రాజధానిలో కాషాయ హవా!

Published Fri, Apr 4 2014 12:12 AM

BJP may win 5-7 seats in Delhi: Opinion poll

  సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వేగంగా మారుతోన్న రాజకీయ సమీకరణాలతో ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వెలువడే అవకాశం ఉందని ఇండియా టుడే తాజా ఎన్నికల సర్వే తేల్చింది. నరేంద్ర మోడీ ప్రభజంనం గట్టిగా వీస్తోందని అభిప్రాయపడింది. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య సంఖ్యలో సీట్లను సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై నగర ఓటర్లకు మోజు తగ్గిందని సర్వే ఫలితాలు వెల్లడించాయి. బీజేపీకి ఏడింటిలో ఐదు స్థానాలు దక్కవచ్చని ఆమ్ ఆద్మీ పార్టీ గరిష్టంగా రెండు సీట్లను, కాంగ్రెస్ గరిష్టంగా ఒక సీటును గెలవవచ్చని తెలిపింది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అన్ని స్థానాలనూ సాధించడం తెలిసిందే.ఢిల్లీవాసుల్లో 44 శాతం మంది నరేంద్ర మోడీ, 24  శాతం మంది  కేజ్రీవాల్, 19 శాతం మంది రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారని సర్వే తెలిపింది.
 
 హర్షవర్ధన్ ముఖ్యమంత్రి కావాలని 29 శాతం మంది, కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కావాలని 19 శాతం మంది కోరుతున్నారని సర్వే తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 33 శాతమున్న బీజేపీ ఓటర్ల వాటా లోక్‌సభ ఎన్నికల్లో 41 శాతానికి చేరవచ్చని సర్వే తెలిపింది. కాంగ్రెస్ ఓటు శాతం 23 శాతానికి పడిపోతుందని ఇది పేర్కొంది.  న్యూఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ, వెస్ట్ డిల్లీలో బీజేపీకి విజయావశాశాలు అధికంగా ఉన్నాయని, చాందినీ చౌక్‌లో బీజేపీ అభ్యర్థి డాక్టర్ హర్షవర్ధన్‌కు కాంగ్రెస్ అభ్యర్థి కపిల్ సిబల్, ఆప్ అభ్యర్థి ఆశుతోష్ నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని సర్వే తెలిపింది. నార్త్ ఈస్ట్ ఢిల్లీలో కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ జైప్రకాశ్ అగర్వాల్  స్వల్ప ఆధిక్యతతో ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ ఆయనకు కూడా బీజేపీ అభ్యర్థి, భోజ్‌పురి నటుడు మనోజ్ తివారీ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. సౌత్ ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీల్లో ఆప్‌కు ఆవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. 
 
 సర్వేలో పాల్గొన్న 25-55 సంవత్సరాలలోపు వారిలో 41 శాతం మంది బీజేపీకి ఓటు వేస్తామని చెప్పారు. యువతలో 38 శాతం బీజేపీవైపు మొగ్గు చూపగా, 25 ఏళ్లలోపు వారిలో 31 శాతం మంది ఆప్‌కు, 25 శాతం మంది కాంగ్రెస్‌కు ఓటు వేస్తామని చెప్పారు.  సంప్రదాయంగా బీజేపీకి మద్దతు ఇచ్చే ఉన్నత కులాలతోపాటు జాట్లు, ఇతర ఓబీసీలు ఆ పార్టీవైపు ఆకర్షితులవుతున్నారని సర్వే తెలిపింది. దళితులు, పంజాబీ ఖత్రీలు ఆప్‌కు మద్దతు ఇస్తున్నారని వివరించింది. కాంగ్రెస్ ముస్లిం ఓటుబ్యాంకు బీటలు వారిందని వీరిలో అత్యధికులు ఆప్‌వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపింది. గత ఎన్నికలతో పోలిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం ఢిల్లీలో కాస్త తగ్గిందని ఈ సర్వే విశ్లేషించింది. కేవలం 49 రోజులకే ప్రభుత్వం నుంచి వైదొలగడంతో ఆప్‌పై  విశ్వాసం తగ్గిందని చెబుతున్నారు. 
 
 ఇక భారీ అవినీతి, కుంభకోణాలు, ప్రభుత్వ వ్యతిరేకత, సమర్థ నాయకత్వ లేమి కాంగ్రెస్ ప్రతిబంధకాలుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పదిలోపు ఎమ్మెల్యే సీట్లతో సరిపెట్టుకోవడం తెలిసిందే. సాక్షాత్తూ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌నే ఆప్ ఆగ్ర నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ భారీ ఓట్ల తేడాతో ఓడించారు.  ఉన్నత, ఎగువ మధ్యతరగతిపాటు దిగువ వర్గాల ఓటర్లు బీజేపీకి ఓటు వేస్తామంటున్నారని సర్వే ఫలితాలు విశ్లేషించాయి. సిసిరో అనే సంస్థ ద్వారా ఈ ఒపీనియన్ పోల్ నిర్వహించామని  ఇండియా టుడే సంస్థ ప్రకటించింది.
 

 

Advertisement
Advertisement