బీజేపీలో సెప్టెంబర్ 15నాటికి తొలి జాబితా | Sakshi
Sakshi News home page

బీజేపీలో సెప్టెంబర్ 15నాటికి తొలి జాబితా

Published Sat, Aug 31 2013 1:03 AM

BJP release candidates first list before september 15th

సాక్షి, న్యూఢిల్లీ: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి బరిలోకి దిగే అభ్యర్థులను ఎంపికచేసే ప్రక్రియను ప్రారంభించినట్లు బీజేపీ ప్రకటించడంతో ఆశావహులు అప్రమత్తమయ్యారు. తమ  బయోడేటాలతో ఢిల్లీ పార్టీ కార్యాలయం, ఢిల్లీ ఎన్నికల ప్రచార సారథి నితిన్ గడ్కరీ నివాసం చుట్టూ ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టారు. ఓ పక్క సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ సీటు కాపాడుకునే ప్రయత్నం చేస్తుండగా, కొందరు కౌన్సిలర్లు ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.  అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను సెప్టెంబర్ 15లోపు విడుదల చేయనున్నట్లు బీజేపీ ప్రకటించింది. 
 
ఇందులో 30 మంది అభ్యర్థుల పేర్లు ఉండొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం బీజేపీ ప్రాతిని ధ్యం వహిస్తున్న నియోజకవర్గాలతోపాటు ఎలాంటి వివాదమూ లేని చోట్ల నుంచి పోటీచేసే అభ్యర్థుల పేర్లను మొదటి జాబితాలో చేరుస్తారని ఆశిస్తున్నా రు. ఢిల్లీలో ప్రస్తుతం బీజేపీకి 24 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ముగ్గురు నలుగురికి పార్టీ టికెట్ లభించే అవకాశం లేదని అంటున్నారు. కాంగ్రెస్ ప్రస్తుత ఎమ్మెల్యేల్లో చాలా మందికి గట్టి ప్రత్యామ్నా యం లేదని, అలాంటి వారికి మరోసారి అవకాశం తప్పక లభిస్తుందని చెబుతున్నారు. వారితో తలపడగల సామర్థ్యమున్న మరికొందరు నేతల పేర్లను మొదటి జాబితాలో చేర్చవచ్చని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌కు పోటీగా నిలబెట్టే అభ్యర్థి పేరుపై సస్పెన్స్‌ను బీజేపీ ఆఖరి వరకు కొనసాగిస్తుందని అంటున్నా రు.
 
ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు విజయ్ గోయల్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారని ఆయన మోడల్‌టౌన్, రోహిణి లేదా షాలిమార్‌బాగ్ నుంచి పో టీ చేయవచ్చని అంటున్నారు. అయితే రోహిణి, షా లిమార్‌బాగ్‌కు బీజేపీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి సాహిబ్‌సింగ్ వర్మ కుమారుడు ప్రవేశ్‌వర్మ కూడా షాలిమార్‌బాగ్ లేదా మటియాలా నుంచి పోటీచేయాలని భావిస్తున్నా రు. గ్రేటర్‌కైలాష్ నుంచి తన తనయుడు అజయ్ మల్హోత్రాను ఎన్నికల బరిలోకి దింపాలని వీకే మల్హోత్రా ఆశిస్తుండగా, విజయ్ జోలీ కూడా ఇదే సీటుపై కన్నేశారు. విశ్వాస్‌నగర్ టికెట్ కోసం ముగ్గురు ముఖ్యనేతలు పోటీపడుతున్నారు. ఓపీ శర్మ, కుల్జీత్ చహల్, దీపక్ గాబా ఈ సీటును కోరుతున్నారు. 
 
అరుణ్ జైట్లీకి శర్మ సన్నిహితుడన్న పేరుంది. మోతీనగర్ మాజీ ముఖ్యమంత్రి మదన్‌లాల్ ఖురానా నియోజకవర్గమని అంటారు. ఇప్పుడు ఈ నియోజకవర్గం నుంచి సుభాష్ సచ్‌దేవ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఈ నియోజకవర్గం నుంచే మదన్‌లాల్ కుమారుడు హరీష్ ఖరానా కూడా పోటీ చేయాలనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీలోని 30 లక్షల మంది పూర్వాంచల్ వాసుల ఓట్లను రాబట్టుకోవడానికి రాష్ట్ర బీజేపీ ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టింది. పూర్వాంచలీయులు సంప్రదాయ పండుగ ఛత్‌పూజకు సెలవు ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తాము అధికారంలోకి వస్తే ఛత్‌పూజ నాడు సెలవు ఇస్తామని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు విజయ్ గోయల్ వాగ్దానం చేశా రు.  ఉచిత ఇళ్లు, ఆధార్, రేషన్‌కార్డుల వంటి సదుపాయాలు కూడా కల్పిస్తామని తెలిపారు. ఈ పార్టీ పూర్వాంచల్ విభాగం మావలంకర్ స్టేడియంలో ఇటీవలే ‘పూర్వాంచల్ సమ్మేళన్’ పేరుతో భారీ కార్యక్రమం నిర్వహించింది. నితిన్ గడ్కరీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 
 
రేపు బీజేవైఎం ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ
నగరంలో కళ్లనీళ్లు పెట్టిస్తున్న ఉల్లిధరల నియంత్రణకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీఎం షీలాదీక్షిత్ నివాసానికి సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నట్టు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ్ ఖారీ తెలిపారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయడానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలనే ఉద్దేశ్యంతో ర్యాలీ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. నిరసన, ఆందోళన చేపట్టనిదే ఢిల్లీ ప్రభుత్వ ఏమీ చేయలేని స్థితిలో ఉంటుందని ఎద్దేవా చేశారు. ఉల్లి సహా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో ఢిల్లీ సర్కారు పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. 
 
ఉల్లి సంకటంలో ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. ఉల్లిధర నియంత్రణకు ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. నూనె ధరలు పెరగడం, పతనమవుతున్న రూపాయి విలువతో మంచి నూనె ధరను కూడా కృత్రిమ కొరతతో భారీగా పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం మందస్తు చర్యలు చేపట్టి నూనె ధరలు పెరగకుండా కార్యచరణ సిద్ధం చేయాలని ఖారీ డిమాండ్ చేశారు. తక్కువ ధరకు ఉల్లిపాయలను విక్రయించడానికి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన  కేంద్రాల్లో అక్రమాలు జరుగుతున్నాయన్నారు. నాసిరకం ఉల్లిని విక్రయిస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదులపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఈసారి ప్రజలు బీజేపీ పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఖారీ స్పష్టం చేశారు.
 

Advertisement
Advertisement