ప్రాణం పోసిన మియట్ | Sakshi
Sakshi News home page

ప్రాణం పోసిన మియట్

Published Thu, Mar 24 2016 1:50 AM

Brain Tumor Treatment

 చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రాణాపాయకరమైన మెదడు ఉబ్బే వ్యాధికి శస్త్రచికిత్స చేయడం ద్వారా చెన్నైలోని మియట్ ఆసుపత్రి వైద్యులు ఓ వృద్ధురాలికి ప్రాణం పోశారు. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆసుపత్రి చైర్‌పర్సన్ మల్లికా మోహన్‌దాస్, వైద్యులు విశ్వనాథ్, మురళీ మాట్లాడారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన సలియమ్మ(60) పదేళ్లుగా సాధారణ తలనొప్పికి తరచూ గురయ్యేది. ఈ ఏడాది ఫిబ్రవరి 26వ తేదీన అకస్మాత్తుగా తట్టుకోలేని తలనొప్పికి గురైంది. వెంటనే బంధువులు సమీపంలోని ఆసుపత్రికి  తరలించి పరీక్షలు   నిర్వహించగా మెదడు భాగంలో రక్తం స్రావం జరుగుతున్నట్లు గుర్తించారు. అయితే అతి సున్నితమైన భాగంలో సమస్య ఉన్నందున శస్త్రచికిత్స చేయలేమని చేతులెత్తేశారు.
 
 అలా నెల్లూరులోని అనేక ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. దీంతో కొందరి సలహామేరకు ఈనెల 3వ తేదీన చెన్నై మియట్ ఆ సుపత్రిలో రోగి పరీక్షలు నిర్వహించగా బ్రెయిన్ యన్యూర్సమ్ అనే మెదడు ఉబ్బే వ్యాధి బైటపడింది. ఈ వ్యాధి కారణంగా రోగి మెదడులోని రక్తనాళాలు పగిలి రక్తస్రావం సంభవిస్తున్నట్లు తెలుసుకున్నారు. అత్యంత సున్నితమైన ప్రదేశం కావడంతో డాక్టర్లు మురళీ, విశ్వనాద్‌లు ఒక సవాల్‌గా స్వీకరించారు. ఈనెల 8వ తేదీన య న్యూర్సమ్ క్లిప్పింగ్‌అనేశస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేశారు.
 
 రిస్క్ చేసి ప్రాణం పోశాం: చైర్‌పర్సన్ మల్లికా మోహన్‌దాస్
 మెదడు వ్యాధి పైగా రక్తనాళాల నుంచి రక్తస్రావం కావడంతో శస్త్రచికిత్స చేయడంలో ఎంతో సాహసం చేశామని మియట్ ఆసుపత్రి చైర్‌పర్సన్ మల్లికా మోహన్‌దాస్ చెప్పారు. ఈరోగానికి గురైన ముగ్గురిలో ఒకరు చికిత్స చేసేలోగానే మృతి చెందుతారని ఆమె చెప్పారు. చికిత్స లభించినా, లభించకున్నా 25 శాతం రోగులు 24 గంటల్లోగా మరణిస్తారని ఆమె తెలిపారు. అయితే సలియమ్మకు శస్త్రచికిత్స చేసి నేటికి 16 రోజులు పూర్తికాగా ఆమె కోలుకున్నారని చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన న్యూరో రేడియాలజిస్టులు, న్యూరో సర్జన్ల బృందం ఆరుగంటల పాటు శ్రమించి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారని తెలిపారు.
 
 భగవంతుడు సరైన ఆసుపత్రికి చేర్చాడు: సలియమ్మ  నెల్లూరులోని అనేక ఆసుపత్రుల చుట్టూ తిరిగి ప్రాణాలు వదులు కోక తప్పదని భావిస్తున్న తరుణంలో భగవంతుడు తనను సరైన ఆసుపత్రికి చేర్చాడని సలియమ్మ తెలిపారు. తీవ్రమైన తలనొప్పికి గురై క్రమేణా కళ్లు కనిపించకుండా పోయాయని,  ఆ తరువాత కోమాలోకి వెళ్లిపోతున్నట్లు గుర్తించి బంధువులను కేకలు వేసి పిలిపించుకున్నానని తెలిపారు. స్పృహ కోల్పోయిన స్థితిలోనే మియట్‌లో చేర్చారని అన్నారు. ప్రస్తుతం తాను పూర్తిగా కోలుకున్నానని, ప్రాణం పోసిన మియట్ ఆసుపత్రికి రుణపడి ఉన్నానని ఆమె చెప్పారు.
 

Advertisement
Advertisement