ఢిల్లీలో బాబు ఇంటి రిపేర్లకు 5.82 కోట్లు | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో బాబు ఇంటి రిపేర్లకు 5.82 కోట్లు

Published Thu, Oct 27 2016 7:48 PM

ఢిల్లీలో బాబు ఇంటి రిపేర్లకు 5.82 కోట్లు - Sakshi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడికెళ్లినా, ఎక్కడ ఉన్నా హంగులు ఆర్బాటాలు తప్పవు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడు వారుండటానికి కేంద్ర ప్రభుత్వం వసతి కోసం భవనాలను కేటాయిస్తుంది. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లినప్పుడు ఉండటానికి 1 జనపథ్ లో ఒక భవనాన్ని కేటాయించింది.

ఢిల్లీలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఈ భవనం కేటాయించగా, తన స్థాయికి తగినట్టుగా ఆ భవనంలో హంగులు లేవని భావించినట్టున్నారు. ఇంకెందుకు ఆలస్యమన్నట్టు ఆ భవనంలో సర్వ హంగులు ఏర్పాటు చేయడానికి రిపేర్ల పేరుతో ఒకటి కాదు రెండు కాదు... ప్రభుత్వం ఏకంగా 5.82 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం (జీవో 2209) ఉత్తర్వులు జారీ చేసింది. 5.82 కోట్ల రూపాయలంటే... అతి పెద్ద కొత్త భవనమే నిర్మించొచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం రిపేర్ల కోసం భారీ మొత్తం విడుదల చేయడం విస్మయపరుస్తోంది.

 ఇదొక్కటే కాదు.. గతంలో కూడా లేక్వ్యూ కోసం సుమారు రూ.5కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబు మదీనా గూడలో కనీసం నెల రోజులు కూడా ఉండని ఓ ప్రైవేటు నివాసం కోసం రూ.1.32కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారు. అలాగే, హైదరాబాద్లోని పార్క్ హయత్ లో నివాసానికి ప్రజాధనం ఉపయోగించారు. ప్రతి నెల లక్షలాది రూపాయల అద్దెను చెల్లించారు. ఇక విజయవాడలోని లింగమనేని అక్రమనివాసానికి భారీగా నిధులు వెచ్చించడమే కాకుండా ఇక్కడ రోడ్లు, భద్రతా ఏర్పాట్లకోసం రూ.30కోట్లు ఖర్చు చేశారు.

విజయవాడలో తాత్కాలిక క్యాంపు కార్యాలయానికి రూ.40కోట్లు వెచ్చించారు. ప్రత్యేక విమానం కోసం ప్రతి నెలా రూ.2కోట్లు ఖర్చు చేశారు. ఇప్పటికే విమాన ప్రయాణాలకోసం సుమారు రూ.60కోట్లు ఖర్చు చేశారు. ఇలా ఓపక్క ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ తో ఉందంటూనే అన్ని రకాలుగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement
Advertisement