కాంగ్రెస్ టికెట్టా.. మాకొద్దు బాబోయ్ | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ టికెట్టా.. మాకొద్దు బాబోయ్

Published Fri, Feb 21 2014 1:31 AM

కాంగ్రెస్ టికెట్టా.. మాకొద్దు బాబోయ్

  • 15 నియోజకవర్గాల్లో ముందుకు రాని అభ్యర్థులు
  •  అధిష్టానం ఆదేశిస్తే ఏం చేయాలంటూ ఆందోళన
  • ‘శివమొగ్గ’పై ప్రత్యేక దృష్టి.. యడ్డిని ఓడించేలా వ్యూహాలు
  • సమర్థ అభ్యర్థి కోసం అన్వేషణ
  • పోటీ చేయబోనని తేల్చిచెప్పిన కాగోడు తిమ్మప్ప
  • కృష్ణ బైరేగౌడను బరిలో దింపే యోచన
  •   సాక్షి ప్రతినిధి, బెంగళూరు :లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్‌కు ఘోర పరాజయం తప్పదని సర్వేలు ఘోషిస్తుండడంతో..  రాష్ర్టంలోని దాదాపు 15 నియోజక వర్గాల్లో ఆ పార్టీ టికెట్లను తీసుకోడానికి ఎవరూ సాహసించడం లేదు. మొత్తం 28 నియోజక వర్గాలకు గాను ఇప్పటికే 13 నియోజక వర్గాలకు అభ్య ర్థుల ఎంపిక దాదాపుగా పూర్తయింది. మిగిలిన అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. కొన్ని నియోజక వర్గాల్లో మంత్రులను పోటీకి దింపాలని అనుకుంటున్నా.. వారి నుంచి సానుకూల స్పందన కనిపించడం లేదు.
     
     కాంగ్రెస్‌కు ఘోర పరాజయం అయితే ఆమాత్య పదవులు వదులుకుని, ఢిల్లీలో అనామకుల్లా ప్రతిపక్షంలో ఎందుకు కూర్చోవాలని పలువురు మంత్రులు భావిస్తున్నట్లు తెలిసింది. అయితే అధిష్టానం కరాఖండిగా ఆదేశిస్తే, ఏంచేయాలనే గుబులు కూడా వారిని వెంటాడుతోంది. తమను పోటీకి దింపాలనుకుంటున్న నియోజక వర్గాల్లో ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేసినా, గెలుపు పూచీ తమదేనంటూ కొత్త పల్లవిని అందుకోవడం ద్వారా మంత్రులు ‘గండం’ నుంచి బయట పడడానికి ప్రయత్నిస్తున్నారు.
     
     యడ్డికి సమ ఉజ్జీ ఎవరు?

     పాలక కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న శివమొగ్గ నియోజక వర్గంలో అభ్యర్థిగా ఎవరిని నిలపాలనే విషయమై తర్జన భర్జన పడుతోంది. బీజేపీ అభ్యర్థిగా యడ్యూరప్ప అక్కడి నుంచి పోటీ చేయడం దాదాపుగా ఖాయం. ఆయనను దీటుగా ఎదుర్కొనే అభ్యర్థి కోసం కాంగ్రెస్ అన్వేషణలో పడింది. శాసన సభ స్పీకర్ కాగోడు తిమ్మప్పను బరిలోకి దింపాలనుకుంటున్నా, ఆయన ససేమిరా అంటున్నారు. ముక్కుసూటి మనస్తత్వం కలిగిన 82 ఏళ్ల కాగోడు తిమ్మప్ప తొలుత స్పీకర్ పదవే వద్దన్నారు.

    ఈ వయసులో తాను ఆ బాధ్యతలను చేపట్టలేనని, మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తే చాలని అప్పటో మొత్తుకున్నప్పటికీ, ముఖ్యమంత్రి ఆయనను అనునయించి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. ఇప్పుడు మళ్లీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరినప్పుడు, తన వల్ల కాదని ఆయన తేల్చి చెప్పడంతో పార్టీ ఇబ్బందుల్లో పడింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప తనయుడు కుమార బంగారప్ప సహా ముగ్గురు ఆ స్థానం అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నప్పటికీ, యడ్యూరప్పకు వారెవరూ సరితూగలేరనేది అధిష్టానం అంచనా.

    వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణ బైరేగౌడను బెంగళూరు (ఉత్తర) నియోజక వర్గం నుంచి బరిలోకి దింపాలని పార్టీ యోచిస్తోంది. ఆయన విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఆయన పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి సన్నిహితుడు. పోటీ చేయాల్సిందేనని ఆయన ఆదేశిస్తే ఏం చేయాలని గౌడ ఆలోచనలో పడ్డారు. చిత్రదుర్గలో కూడా మరో మంత్రి హెచ్. ఆంజనేయను పోటీ చేయించాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఆయన కూడా పోటీకి సిద్ధంగా లేరు.
     

Advertisement
Advertisement