కలెక్టర్‌ను ఆశ్రయించిన వాట్సాప్ ప్రేమజంట | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ను ఆశ్రయించిన వాట్సాప్ ప్రేమజంట

Published Wed, Jul 6 2016 2:00 AM

Collector to shelters Whatsapp Love Couples!

కేకే.నగర్: నాగపట్టణం జిల్లా సమీపంలో ఓ ప్రేమజంట తమకు రక్షణ కల్పించాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. వారు వాట్సాప్ ద్వారా ప్రేమించుకున్నట్టు సమాచారం. నాగపట్టణం జిల్లా వేలాంకన్ని పూంపుహార్ వీధి సునామి నివాస గృహాలకు చెందిన తంగవేల్ కుమారుడు వీరమణి(26). వేలాంకన్నికు వచ్చే పర్యాటకుల ఫొటోలు తీసిచ్చే పనిచేస్తున్నాడు. మూడు నెలల క్రితం తంజావూరు నాంజికోట ఈబీ. కాలనీకి చెందిన విక్టర్ సుందరరాజన్ పెంపుడు కూతురు మోనిక(21) స్నేహితులతో కలిసి వేలాంకన్నికు విహారయాత్రకు వచ్చింది. ఆ సమయంలో స్నేహితులతో పాటు ఫొటోలు దిగింది.

ఆ ఫోటోలను మోనికకు వాట్సాప్‌లో పంపడానికి వీరమణి ఆమె సెల్‌ఫోన్ నంబర్ తీసుకున్నాడు. తర్వాత వీరమణి మోనికతో తరచూ ఫోన్‌లో మాట్లాడేవాడని తెలుస్తోంది. దీంతో వారి మధ్య ప్రేమ చిగురించింది. వీరి ప్రేమ విషయం మోనిక ఇంట్లో తెలియడంతో సుందరరాజన్ ఆమెను మందలించాడు. దీంతో గత 30న మోనిక ఇంటి నుంచి పారిపోయి వేలాంకన్నికు వచ్చింది. అక్కడున్న ఒక ఆలయంలో వీరమణి మోనికను పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో కుమార్తె కనిపించకపోవడంతో సుందరరాజన్ తంజావూరు తమిళ వర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దర్యాప్తు  చేపట్టిన పోలీసులు దంపతులకు ఫోన్ చేసి పోలీస్‌స్టేషన్‌కు రావాలని సూచించారు. వారి వివాహానికి పెద్దల నుంచి అనుమతి ఇప్పిస్తామని చెప్పారు. దీంతో వారు సోమవారం నాగపట్టణం కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వినతిపత్రం సమర్పించారు. అందులో తమను వేరు చేయాలని మోనిక తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారని, తమకు పోలీసు భద్రత కల్పించాలని కోరారు. వారికి కలెక్టర్ హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement