గొడుగే అతని ఆయుధం: కిల్లర్ గుట్టురట్టు | Sakshi
Sakshi News home page

గొడుగే అతని ఆయుధం: కిల్లర్ గుట్టురట్టు

Published Thu, Apr 28 2016 4:49 PM

గొడుగే అతని ఆయుధం: కిల్లర్ గుట్టురట్టు

వేరువేరు ప్రాంతాల్లో మూడు దారుణ హత్యలు. ముగ్గురినీ ఎవరో పొడిచి చంపారు. దేనితో పొడిచారో పోలీసులు కూడా తేల్చలేకపోయారు. ఆ పోట్లు కత్తి, తల్వార్, బాకు, చాకు.. వీటితో పొడిచినట్లులేవు. హంతకుడు ఏదో ప్రత్యేకమైన ఆయుధం ఉపయోగించాడు. ఎంతకీ తేలకపోవడంతో రెండేళ్లుగా ఆ మూడు హత్యకేసులు అపరిష్కృతంగా మిగిలిపోయాయి. అయితే బుధవారం చోటుచేసుకున్న మరో నేరంతో ఆ ఉదంతాలు, వాటి వెనకున్న అనూహ్యకారణాలు బయలుపడ్డాయి. హత్యలు ఎలా చెయ్యొచ్చో ఆన్ లైన్ లో తెలుసుకున్న ఆన్ లైన్ ట్రేడర్ రహస్యాలు వెలుగులోకి వచ్చాయి.

చెన్నై శివారులోని ఇజంబాకంలో బుధవారం స్టీఫెన్ అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. ఫిర్యాదుమేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఆ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దొంగను పట్టుకున్నారు. ఇంతటితో కేసు ముగిసిపోలేదు. సీసీటీవీ ఫుటేజిలో.. మరో ముగ్గురు వ్యక్తులు అప్పుడప్పుడూ అక్కడికి వచ్చివెళుతుండటాన్ని పోలీసులు గుర్తించారు. వాళ్ల కదలికలు అనుమానాస్పదంగా అనిపించడంతో పోలీసులు ఆ ముగ్గురినీ వేటాడి పట్టుకున్నారు. ట్యాక్సీ డ్రైవర్లుగా పనిచేస్తోన్న ఆ ముగ్గురూ మొదట తాము అమాయకులమని బుకాయించినా, పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం కక్కేశారు. సిటీలో సంచలనం రేపిన నాటి మూడు హత్యల్లో తామూ భాగస్వాములమని ఒప్పకున్నారు. అసలు సూత్రధారి స్టీఫెనే అని చెప్పారు. దీంతో పోలీసులు స్టీఫెన్ ను అరెస్ట్ చేశారు. 'ఇంతకీ ఆ ముగ్గురిని దేనితో పొడిచి చంపావ్?..' పోలీసుల కరకు ప్రశ్నలకు స్టీఫెన్ సమాధానాలు చెప్పడం మొదలుపెట్టాడు..

'నేనొక ఆన్లైన్ ట్రేడర్ని. రియల్టర్ని కూడా. చాలా ఏళ్ల కిందటే నా భార్య విడాకులిచ్చేసి వెళ్లిపోయింది. అలా పోయింది ఊరుకోకుండా.. వాళ్లన్నయ్య జాన్ సాయంతో నాపై భరణం కేసు వేసింది. నిజానికి ఆమెకు కేసులు వేసేంత తెలివిలేదు. కానీ వాళ్ల అన్నయ్య జాన్ ఉన్నాడే.. వెనకుండి అంతా నడిపించేది వాడే. ఎలాగైనాసరే జాన్ ను అంతం చేయాలనుకున్నా. పోలీసులకు దొరకకుండా మర్డర్ చేసే విధానాల కోసం ఇంటర్నెట్లో సర్చ్ చేశా.

గొడుగుతో హత్య చేయడం ఎలానో నెట్ లో చూసే నేర్చుకున్నా. గొడుగు చివరికొన మొనదేలి ఉంటుందికదా.. దాన్ని ఇంకాస్త సాన పెట్టి, విషంపూసి జాన్ ఒంట్లోకి దించా. మిగిలిన ఇద్దరూ నా పాత స్నేహితులు. వాళ్ల భార్యలతో నేను చనువుగా ఉండటం వాళ్లకి ఇష్టంలేదు. అందుకే ఆ ఇద్దరినీ లేపేశా' అంటూ నేరాలను అంగీకరించాడు 'గొడుగు హంతకుడు' స్టీస్టీఫెన్.

2015 ఏప్రిల్, మే, అక్టోబర్ నెల్లో ఆ మూడు హత్యలు జరిగాయి. హత్యలకు సహకరించిన ట్యాక్సీ డ్రైవర్లు బాలాజీ, ఆనందన్, సతీశ్ కుమార్ లకు స్టీఫెన్ డబ్బులిచ్చి నోరు మూయించాడు. అరెస్ట్ సమయంలో స్టీఫెన్ ఇంటినుంచి పోలీసులు రెండు మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు స్టీఫెన్, అతనికి సహకరించిన ముగ్గురు ట్యాక్సీ డ్రైవర్లను పోలీసులు గురువారం కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు. త్వరలోనే కేసును తీర్పు దశకు వెళ్లేలా కృషిచేస్తామని పోలీసుల తరఫు న్యాయవాది చెప్పారు.

Advertisement
Advertisement