Sakshi News home page

బ్యాంకులపై సైబర్ దొంగల కన్ను

Published Fri, Aug 16 2013 3:54 AM

Cyber thieves hacked Indian banks

న్యూఢిల్లీ: ఆధునిక కాలం అందించిన సాంకేతిక పరిజ్ఞానంతో వెలుగుతున్న సైబర్ విజ్ఞానం విశ్వమానవుడి అవతరణకే కాదు అంతర్జాతీయ సరిహద్దులు చేరిపే సైబర్ నేరసామ్రాజ్యానికి ఊపిరి పోసింది. సైబర్‌దాడుల్లో సాయుధ ముఠాల కాల్పులు, మానవహననం, నెత్తురు చిందడం ఏదీ కన్పించదు. ఎక్కడో ప్రపంచంలో ఓ చివరన కంప్యూటర్ ముందు కూర్చున్న వ్యక్తి లేదా పలువురు వ్యక్తులు మరో చివరన ఉన్న బ్యాంక్‌ను నిలువు దోపిడీ చేయగలరు. ఈ ఆధునిక దోపిడీ ముఠాలు విద్యావంతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడంలో నిష్ణాతులు. కోట్లు కొల్లగొట్టేస్తున్న ఓ సైబర్ దోపిడీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా నాయకుడిని అరెస్టు చేసిన పోలీసులు ఇతర సభ్యులను పట్టుకోవడానికి పలు రాష్ట్రాల్లో గాలింపులు చేస్తున్నారు. 
 
 సైబర్ దోపిడీ ముఠాకు నాయకుడిగా గుర్తించి పోలీసులు అరెస్టు చేసిన అరుణ్‌కుమార్ (30) బ్యాంక్ లావాదేవిల్లో, అకౌంటెన్సీలో ప్రత్యేక నిపుణుడని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. విదేశీ ఖాతాదారులను లక్ష్యంగా చేసుకున్న ఈ సైబర్ ముఠా ఇప్పటికే కోట్లాది రూపాయలను కొల్లగొట్టిందని తెలిసింది. ఉత్తరప్రదేశ్ కనౌజ్‌కు చెందిన అరుణ్‌కుమార్ మయూర్ విహార్‌లో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. కాన్పూర్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడయిన ఇతని వద్ద వివిధ బ్యాంక్‌లు జారీ చేసిన ఏడు స్వీపింగ్ మెషిన్లు, 26 చెక్‌బుక్‌లు, 10 పాన్‌కార్డులు, నాలుగు డెబిట్‌కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అరుణ్‌కుమార్‌తోపాటు యాసిన్, జితేందర్, వికాస్, సంజీవ్‌లు ఈ ముఠాలో సభ్యులని ఆగ్నేయ ఢిల్లీలో డీసీపీ పి. కరుణాకరణ్ వెల్లడించారు. ఈ ముఠాకు బ్యాంక్ ఉద్యోగుల సహకారం కూడా ఉండిఉంటుందని, లేని పక్షంలో విచారణ జరపకుండా పలు బ్యాంక్‌ల స్వీపింగ్ మిషన్లు సంపాదించడం సాధ్యంకాదని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. 
 
 ‘‘అరుణ్ నాయకత్వంలోని సైబర్ దోపిడీ ముఠాకు యాసిక్ హ్యకింగ్ నిపుణుడు. ఓ టెలికామ్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు అరుణ్‌కుమార్‌కు యాసిన్ పరిచయమయ్యాడు. ఈ ఇద్దరు కలిసి త్వరితంగా డబ్బు సంపాదించడానికి క్రెడిట్, డెబిట్ కార్డులను క్లోనింగ్ చేయాలని నిర్ణయానికి వచ్చారు. అకౌంటెన్సీలో నిపుణుడయిన అరుణ్ ఇందుకోసం పలు నకిలీ ఈ-కంపెనీలను స్థాపించాడు. వీటి ద్వారా బ్యాంక్‌ల ద్వారా స్వీపింగ్ మిషన్లను పొందిన వీరు నకిలీ దస్తావేజుల ద్వారా పలు బ్యాంక్ ఖాతాలను తెరిచారు. యాసిన్ బ్యాంక్ వెబ్‌సైట్లలోకి చొరబడి ఖాతాదారులకు సంబంధించిన సమాచారాన్ని డాటా రీడర్లలోకి ఎక్కించేవాడు. ఈ మిషన్లకు క్లోనింగ్ మిషన్లను అనుసంధానం చేసి బ్యాంక్ కార్డుల మీదకు సమాచారం ఎక్కించేవాడు. కార్డులు తయారయిన తరువాత వీరి వద్ద ఉన్న స్వీ పింగ్ మిషన్ల ద్వారా వారి నకిలీ ఖాతాల్లోకి నగదు బదిలీ చేసుకొనేవారు. నగదు బదిలీ అయిన వెంట నే ఏటీఏంలు, చెక్‌ల ద్వారా నగదు ఉపసంహరిం చుకొనేవారు’’ అని డీసీపీ కరుణాకర్ వివరించారు. 
 
 ఆగస్టు ఐదున నెహ్రూ ప్లేస్‌లోని ఓ బ్యాంక్ ప్రధాన మేనేజర్ పోలీసులకు ఇచ్చిన  ఫిర్యాదుతో దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు తీగలాగితే డొంక కదిలింది. బ్లూవేవ్స్ టెక్నాలజీ అనే కంపెనీ మోసానికి పాల్పడిందని బ్యాంక్ అధికారి చేసిన ఫిర్యాదుతో విచారణలోకి దిగిన పోలీసులకు ఢిల్లీలోని పలు ప్రాంతాలతో పాటు, జాతీయ రాజధాని ప్రాదేశిక ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు మరిన్ని జరిగాయని గుర్తించారు. దీంతో డీసీపీ కరుణాకర్ కల్కాజీ ఎసీపీతో పాటు ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాడు. ఈ బృందం విచారణలో అరుణ్‌కుమార్ బ్లూవేవ్స్ కంపెనీ యజమాని అని వెల్లడయింది. దీంతో బ్యాంక్ అధికారుల సహకారంతో వలపన్నిన పోలీసులు ఆగస్టు 7వ తేదీన అరుణ్‌కుమార్‌ను అరెస్టు చేసినట్లు డీసీపీ వివరించారు. 
 

Advertisement
Advertisement