తుపాన్ గండం | Sakshi
Sakshi News home page

తుపాన్ గండం

Published Thu, Nov 14 2013 3:35 AM

Cyclones Danger

సాక్షి, చెన్నై: నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని అంతంత మాత్రమే కరుణించినా, ఈశాన్య రుతుపవనాల రాకతో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. ఈ పవనాలు గత నెల రెండో వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించడంతో దక్షిణాదిలోని పలు జిల్లాల్లో అడపాదడపా కుండపోత వాన కురుస్తోంది. తిరునల్వేలి, కన్యాకుమారి జిల్లాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. బుధవారం సాయంత్రానికి తిరునల్వేలిలోని పాపనాశం డ్యామ్ నీటి మట్టం 91 అడుగులు, మణిముత్తారు డ్యామ్ నీటి మట్టం 67 అడుగులు, సెర్వలార్ డ్యామ్ నీటి మట్టం 101 అడుగులకు చేరాయి. కన్యాకుమారిలోని పేచ్చిపారై డ్యామ్ నీటి మట్టం 24 అడుగులకు చేరింది. అలాగే వాగులు వంకలు పొంగి పొర్లుతున్నా యి.
 
 కుట్రాలం జలపాతం పరవళ్లు తొక్కుతుండడంతో స్నానానికి నిషేధం విధించారు. ఈ పరిస్థితుల్లో చెన్నైకి దక్షిణాన బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఇది బుధవారం ఉదయం వాయుగుండం గా మారింది. ఇది సాయంత్రానికి చెన్నైకి 650 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. శుక్ర, శనివారాల్లో చెన్నై - నాగపట్నం మధ్య తీరం దాటనుంది. ఈ కారణంగా ఉత్తర తమిళనాడులోని చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, విల్లుపురం, కడలూరు, నాగపట్నం తదిత ర సముద్ర తీర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ నష్టం కలుగవచ్చని   వాతావారణ కేంద్రం డెరైక్టర్ రమణన్ హెచ్చరించారు. 
 
 ప్రమాద హెచ్చరిక జారీ 
 గత ఏడాది థానే తుపాన్ ప్రభావంతో కడలూరు అతలాకుతలమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం నెలకొన్న వాయుగుండం చె న్నై- నాగపట్నం మధ్య అంటే కడలూరు మీదుగానే తీరం దాటే అవకాశం ఉంది. దీంతో కడలూరు హార్బర్‌లో ఒకటో ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. ఆ జిల్లా తీరవాసుల్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. జాలర్లు తమ పడవల్ని భద్రపరచుకునే పనిలో పడ్డారు. 
 ఎగసి పడుతున్న కెరటాలువాయుగుండం ప్రభావంతో సముద్ర తీరాల్లో కెరటాలు ఎగసి పడుతున్నాయి. 60 నుంచి 75 కిలోమీటర్ల మేరకు గాలులు వీస్తున్నాయి.
 
 ఈ ప్రభావంతో ఉత్తర తమిళనాడులో భారీ వర్షాలు, డెల్టా జిల్లాల్లో మోస్తారుగా, దక్షిణ తమిళనాడులో కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావారణ కేంద్రం డెరైక్టర్ రమణన్ వివరించారు. అలల తాకిడి క్రమంగా పెరుగుతుండడంతో సముద్రంలోకి వెళ్ల వద్దని జాలర్లను హెచ్చరించారు. సముద్రంలోకి వేట నిమిత్తం వెళ్లిన వారు గురువారం మధ్యాహ్నానికల్లా ఒడ్డుకు చేరుకోవడం మంచిదని సూచించారు. వాతావరణ కేంద్రం హెచ్చరికతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆ కేంద్రం ఇచ్చే సూచనల మేరకు సముద్ర తీర వాసుల్ని అప్రమత్తం చేసే పనిలో పడ్డారు. వాయుగుండం రూపంలో తుపాన్ గండం పొంచి ఉన్నా, ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతున్నారు. 
 
 

Advertisement
Advertisement