బిగుస్తున్న పిడికిలి | Sakshi
Sakshi News home page

బిగుస్తున్న పిడికిలి

Published Tue, Feb 24 2015 1:41 AM

'Dalit CM' slogan

‘దళిత సీఎం’ నినాదంపై పట్టువీడని ఆ వర్గ నేతలు
నేటి నుంచి దశలవారిగా జనజాగృతి కార్యక్రమాలు
తొలుత బళ్లారిలో  ప్రారంభం
 

బెంగళూరు/బళ్లారి:    ‘కర్ణాటకకు దళిత ముఖ్యమంత్రి’ విషయమై ఆ వర్గానికి చెందిన నాయకులు పట్టువీడటం లేదు. ఈ విషయమై ఎవరూ బహిరంగంగా మాట్లాడకూడదని సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ కర్ణాటక శాఖ రాజకీయ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఆదేశాలు జారీ చేసినా ‘దళిత వర్గ నాయకులు’ మాత్రం వెనక్కు తగ్గక పోవడం గమనార్హం.  దళిత వర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కర్ణాటక ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలన్న నినాదం వినిపిస్తోంది. దళిత వర్గానికి చెందిన కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పరమేశ్వర్ కూడా అడపాదడపా ‘నాకు ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు అన్నీ ఉన్నాయి.’ అంటూ మీడియా ప్రకటనలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా కొద్ది రోజుల ముందు ఆ వర్గానికి చెందిన నాయకులు బెంగళూరులోని ఓ హోటల్‌లో సమావేశమై ఈనెల 23 లోపు దళిత సీఎం విషయమై ‘హై కమాండ్’ నిర్ణయం తీసుకోకుంటే జిల్లా స్థాయిలో జానజాగృతి కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇది  అటు విపక్షంలోనే కాక స్వపక్షంలోనూ విమర్శలకు దారి తీసింది. 

ఈ నేపధ్యంలో దళిత సీఎం పై ఎవరూ బహిరంగ వాఖ్యలు చేయకూడదని నిన్నటి రోజే (ఆదివారం) దిగ్విజయ్ సింగ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. అయినా దిగ్విజయ్ సింగ్ హెచ్చరికలను ఏమాత్రం లెక్క చేయని దళిత వర్గానికి చెందిన నాయకులు బెంగళూరులోని ఓ హోటల్‌లో సోమవారం సమావేశమై జిల్లా స్థాయిలో నిర్వహించాల్సిన జనజాగృతి కార్యక్రమాల రూపురేఖల పై చర్చించారు. దశలవారిగా జిల్లా కేంద్రాల్లో ‘దళితసీఎం’ విషయమై జనజాగృతి కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా మొదటగా మంగళవారం బళ్లారిలో జనజాగృతి కార్యక్రమం నిర్వహించాలని దళిత నాయకులు భావిస్తున్నారు. బెంగళూరులో దళిత నాయకులు నిర్వహించిన సమీక్ష సమావేశం తర్వాత రాష్ట్ర దళిత సంఘర్షణ సమితి నాయకుడు ఎన్.మూర్తి మీడియాతో మాట్లాడుతూ... ‘కర్ణాటకలో దళిత కాంగ్రెస్ నాయకుడు సీఎం పీఠం మీద కుర్చొనే సమయం వచ్చింది. ఇందుకు హై కమాండ్ సహకరించకపోతే ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఢిల్లీలో కాంగ్రెస్‌కు పట్టిన గతే కర్ణాటకలో రాబోయే  ఎలెక్షన్లలో సైతం ఎదురవుతుంది’ అని పేర్కొన్నారు. దీంతో ‘దళిత ముఖ్యమంత్రి’ డిమాండ్ ఎలాంటి మలుపులు తీసుకుంటుందోననే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.  
 బళ్లారి నగరంలోని దళిత నేతలతో రాష్ట్ర దళిత సంఘానికి చెందిన ప్రముఖ నేతలు మంగళవారం బళ్లారిలో  ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. దళిత ముఖ్యమంత్రిని చేయాలని ఏర్పాటు చేసిన ఫోరంకు కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివరాం నేతృత్వంలో బళ్లారిలో నగరంలోని బీడీఏఏ మైదానంలో నేడు( మంగళవారం) పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేసి తన గళం విప్పనున్నారు.

విలేకరుల సమావేశంలో పాల్గొన్న అనంతరం దళిత ముఖ్యమంత్రిని చేయాలని సమావేశంలో నేతలు ప్రసంగించనున్నారు. ఈ సమావేశానికి పలువురు దళిత కులానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. రాష్ట్ర దళిత సంఘం నేతలు శ్రీరాములు, వెంకటస్వామీలు తదితరులు పాల్గొంటున్నట్లు సమాచారం.  ఏది ఏమైనా దళిత ముఖ్యమంత్రిని చేయాలని బళ్లారి నుంచి దళిత సంఘం నేతలు తీవ్ర పోరాటానికి తెరలేపే అవకాశం ఉందని చెప్పవచ్చు.
 
 
 

Advertisement
Advertisement