విధానసభ అభ్యర్థుల ఎంపికలో పార్టీలు పోటాపోటీ | Sakshi
Sakshi News home page

విధానసభ అభ్యర్థుల ఎంపికలో పార్టీలు పోటాపోటీ

Published Mon, Dec 15 2014 11:58 PM

Delhi  Assembly elections all Parties Competitive

సాక్షి, న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగాముందుకు సాగుతున్న ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక  విషయంలో పరుగులు తీస్తున్నాయి. ఒకదానికి మరొకటి పోటీపడుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే మూడు జాబితాలను విడుదల చేసింది. ఇక బీజేపీ విషయానికొస్తే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సర్వే చేయిస్తోంది. ఇప్పటిదాకా ఎన్నికల సన్నాహాల్లో వెనుకబడినట్లుగా కనిపించిన కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సన్నద్ధమవుతోంది. క్రిస్మస్ కంటే ముందే తొలి జాబితా వెలువడుతుందని  ఆ పార్టీ ఢిల్లీ శాఖ ఇంచార్జి పీసీ చాకో చెబుతున్నారు. అభ్యర్థుల పేర్ల పరిశీలనకోసం ఢిల్లీ ఎన్నికల కమిటీ మంగళవారం సమావేశం కానుంది.  డిసెంబర్ 20 నాటికి ఈ కమిటీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తుందని,  పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదముద్ర వేసిన తర్వాతజాబితా విడుదల వుతుందని చాకో చెప్పారు.
 
 కాంగ్రెస్ టికెట్ కోసం 1,100లకు పైగా దరఖాస్తులొచ్చాయి. దరఖాస్తుల సమర్పణకు ఆఖరి తేదీ ఆదివారంతో ముగిసింది.  తొలుత ఈ నెల 20వ తేదీని తుది గడువుగా ప్రకటించినప్పటికీ 14కు కుదించారు. గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఈసారి తగ్గింది. గత ఎన్నికల సమయంలో ఈ పార్టీ టికెట్ల కోసం 1,700 దరఖాస్తులు వచ్చాయి.  ఈ పరిణామం ఎన్నికల పట్ల కార్యకర్తలలో ఉత్సాహలేమిని సూచిస్తోందని రాజకీయ పండితులు  అంటున్నారు. టికెట్ కోసం దరఖాసు ్తచేసుకున్నవారిలో ప్రముఖఱ నేతలు కూడా ఉన్నారని చెబుతున్నారు. గత విధానసభ ఎన్నికలలో గెలిచిన పార్టీ అభ్యర్థులదరికీ ఈ ఎన్నికల్లో టికెట్ లభిస్తుందని వారు చెప్పారు. అయితే పరాజయం పాలైన ముఖేష్ శర్మ, డా. ఎ.కె.వాలియా, ముఖేష్ శర్మ వంటి సీనియర్ నేతలకు కూడా టికెట్ ఇచ్చే అవకాశముంది. ఎన్నికల్లో రెండు, మూడు స్థానాల్లో నిలిచినవారి పేర్లను పరిశీలిస్తారని అంటున్నారు. మాజీ ఎంపీలలో మహాబల్ మిశ్రా ద్వారకా నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు. కృష్ణతీరథ్ లేదా ఆమె కుమార్తెను పటేల్‌నగర్ నుంచి నిలబెట్టొచ్చని తెలుస్తోంది.
 
 నియామకం
 నగర పరిధిలోని 14 జిల్లాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకులను నియమించింది. పరిశీలకుల జాబితాకు కాంగ్రెస్ అధిష్టానం ఆమోదముంద్ర వేసిందని అంటున్నారు. హర్యానా, రాజస్థాన్ తదితర పొరుగు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలను పరిశీలకులుగా నియమించారు. బూత్‌స్థాయి వరకు పార్టీని పటిష్టం చేయడం కోసం పార్టీ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక  పరిశీలకుడిని నియమించొచ్చని చెబుతున్నారు.
 
 పోటీకి బహుదూరం ?
 ఇదిలా ఉండగా తానుగానీ తన కుటుంబసభ్యులు, బంధువులు గానీ విధానసభ ఎన్నికల బరిలో దిగేందుకు సుముఖంగా లేమని మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ అధిష్టానానికి తెలిపినట్లు సమాచారం. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి షీలాదీక్షిత్ కుమార్తెను ఎన్నికల బరిలోకి దింపవచ్చని, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయొచ్చనే ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే ఎన్నికలలో పోటీ చేయడానికి తాము సిద్ధంగా లేమని షీలాదీక్షిత్ తెలిపినట్లు వార్తలొస్తున్నాయి. ఎన్నికలలో పోటీ చేయకపోయినప్పటికీ పార్టీ తరపున ప్రచారానికి సిద్ధంగా ఉన్నట్లు షీలాదీక్షిత్ అధిష్టానానికి తెలిపారని అంటున్నారు.
 
 గెలుపు, ఓటములపై జోరుగా పందాలు
 ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా వెలువడకపోయినప్పటికీ పందాలు మాత్రం జోరందుకున్నాయి. విధానసభ ఎన్నికల్లో పార్టీల గెలుపు ఓటములపై సంపన్న కాలనీల నుంచి అనధికారకాలనీలు, పునరావాసకాలనీలు, జుగ్గీ జోపిడీల వరకు విస్తరించిన సట్టా బజార్‌లో వివిధ వర్గాలకు చెందిన ్రజ్రలు జోరుగా పందాలు కాస్తున్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో ఇటువంటి వారి సంఖ్య వేలల్లోనే ఉంటోందని అంటున్నారు. తమ స్థితిని మెరుగుపరచుకోవడం కోసం  కొందరు నేతలు ఇలాంటి పోటీలకు  పరోక్షంగా మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
 

Advertisement
Advertisement