బుకీ రిటన్స్! | Sakshi
Sakshi News home page

బుకీ రిటన్స్!

Published Mon, Nov 25 2013 2:14 AM

Delhi bookies bet on BJP, find AAP too 'risky'

న్యూఢిల్లీ: ఐపీఎల్ మ్యాచ్‌లేవీ జరగడంలేదు... అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు కూడా అంతగా పోటీ ఉన్న జట్ల మధ్య జరగడంలేదు... అయినప్పటికీ బెట్టింగ్ రాయుళ్లకు చేతినిండా పనే. అందుకు కారణం త్వరలో ఢిల్లీ విధానసభకు జరగనున్న ఎన్నికలే. గతంలో కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులుగా బరిలోకి దిగేవి. దీంతో గెలుపోటములు నిర్ణయించడం పెద్దగా కష్టమయ్యేది కాదు. అప్పుడు బుకీలకు కూడా పెద్దగా పని ఉండేది కాదు. కానీ ఈసారి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ రంగప్రవేశంతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఈ ఎన్నికల్లో ముక్కోణపు  పోటీ తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న నేపథ్యంలో ఎక్కడ.. ఏ పార్టీ గెలుస్తుందనేది చెప్పడం కష్టంగా మారింది. ఇది నగరంలోని బెట్టింగ్‌రాయుళ్లకు వరంగా మారింది. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ మెజార్టీ సాధించి అధికారంలోకి వస్తుందనే విషయంపై
 
 కొందరు బెట్టింగ్‌కు పాల్పడుతుంటే మరికొందరు స్థానిక అభ్యర్థుల్లో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? అనే విషయంపై బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. మరికొన్నిచోట్ల మెజార్టీల మీద కూడా బెట్టింగ్ జరుగుతోందని సమాచారం. అభ్యర్థులు, మెజార్టీలమీద కాసే పందేలా రేట్లు ప్రాంతానికోరకంగా ఉన్నాయని చెబుతున్నారు. బెట్టింగ్‌కు పాల్పడుతున్న వారిలో అభ్యర్థుల మద్దతుదారులే ఎక్కువగా ఉంటున్నారు. నియోజకవర్గాల వారీగా జరుగుతున్న బెట్టింగ్ సమాచారం ప్రకారం.. అత్యధికంగా న్యూఢిల్లీపై బెట్టింగ్ జరుగుతోంది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి షీలాదీక్షిత్, బీజేపీ నుంచి విజేంద్ర గుప్తా, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ బరిలో ఉన్నారు. అందరూ మహామహులే బరిలో నిలవడంతో ఇక్కడ గెలుపెవరిదో చెప్పడం కష్టంగా మారింది. దీంతో ఈ నియోజవర్గంలోని అభ్యర్థులపై జోరుగా బెట్టింగ్ జరుగుతోంది.  ఇక వచ్చే ఎన్నికల్లో సరిపడా మెజార్టీ సాధించి, గద్దెనెక్కే పార్టీల విషయమై జరుగుతున్న బెట్టింగ్ వివరాల్లోకెళ్తే...
 
 బీజేపీపై తక్కువగా... ఆప్‌పై ఎక్కువగా...
 బుకీలు మిగతా పార్టీలకంటే తక్కువగా భారతీయ జనతా పార్టీ రేటును రూ. 2.25గా నిర్ణయించారు. రెండో స్థానాన్ని కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టారు. ఈ పార్టీ రేటును రూ.2.40గా నిర్ణయించారు. ఇక అన్ని పార్టీలకంటే ఎక్కువగా ఆమ్ ఆద్మీ పార్టీ రేటును రూ.3.40గా నిర్ణయించారు.  బీజేపీపై బెట్టింగ్ కంటే ఆమ్ ఆద్మీపై బెట్టింగ్ కాయడాన్ని  ‘మోస్ట్ రిస్కీ’గా బుకీలు అభివర్ణిస్తున్నారు. నగరానికి చెందిన బుకీ ఒకరు ఈ విషయమై మాట్లాడుతూ... ‘ ఓ పార్టీ రేటును అతి తక్కువగా నిర్ణయించామంటే ఆ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఉదాహరణకు బీజేపీ మీద లక్ష రూపాయల పందెం కట్టారనుకుందాం. ఎన్నికల్లో ఆ పార్టీ గెలిస్తే మీకు రూ. 2.25 లక్షలొస్తాయి. 
 
 అదే కాంగ్రెస్ మీద కడితే రూ. 2.40 లక్షలు, ఆప్ మీద కడితే రూ. 3.40 లక్షలు వస్తాయి. అయితే చాలా మంది రెండు పార్టీల మీద పందెం కాస్తున్నారు. ఒకదాంట్లో నష్టం వస్తే మరోదాని ద్వారా భర్తీ చేసుకోవచ్చనే అభిప్రాయంతో ఇలా చేస్తారు. అయితే రంగంలో మూడు పార్టీలుండడం, పందెం కాసిన రెండు పార్టీలూ ఓడిపోతే పందెం కాసినవారి పరిస్థితి మరింత ఘోరంగా మారుతుంది. ప్రస్తుతం రేట్లు ఇలా ఉన్నా నవంబర్ నెలాఖరునాటికి పరిస్థితి మారే అవకాశముంది. అప్పటి పరిస్థితుల ప్రకారం ఎవరు ఏ పార్టీపై ఎక్కువగా బెట్టింగ్‌కు పాల్పడతారో చూసి దాని ప్రకారం రేట్లు నిర్ణయిస్తారు.
 

Advertisement
Advertisement