కొలువుదీరిన కొత్త మంత్రులు | Sakshi
Sakshi News home page

కొలువుదీరిన కొత్త మంత్రులు

Published Sat, Dec 28 2013 11:24 PM

Delhi, know your 'Aam Aadmi' cabinet

 సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ఏడో ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తోసహా కేబినెట్ మంత్రులుగా ఆరుగురు ఎమ్మెల్యేలతో శనివారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్  ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిలో ఇద్దరు మాజీ జర్నలిస్టులు, ఒక చట్టపరమైన ప్రచారకర్త, ఒక ఆర్కిటెక్ట్, ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఇద్దరు సా మాజిక సేవకులు ఉన్నారు. శనివారం మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వీరి శాఖలు గతంలో వీరి వృత్తికి దగ్గర సంబంధం ఉండడం గమనార్హం. వీరి వ్యక్తిగత వివరాలుపరిశీలిస్తే..
 
 అరవింద్ కేజ్రీవాల్
 ముఖ్యమంత్రి, హోం, ఆర్థిక, విజిలెన్స్, సర్వీసెస్, ప్లానింగ్, విద్యుత్తు, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు ఢిల్లీ ఏడో ముఖ్యమంత్రిగా శనివారం ప్రమాణ స్వీకారం చేసిన అరవింద్ కేజ్రీవాల్(45)అతి పిన్న వయస్సులో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడైన కేజ్రీవాల్ కొంతకాలం టాటాస్టీల్‌లో ఉద్యోగం చేశారు. అనంతరం సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించి ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్‌లో చేరారు. అటు నుంచి సమాజ సేవకోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేశారు. సమాచార హక్కుచట్టం తీసుకువచ్చేలా ప్రభుత్వంపై తన ఉద్యమాలతో ఒత్తిడి తెచ్చారు. ఇందుకుగాను రామన్ మెగసేసే అవార్డు పొందారు. అన్నాహజారే నిర్వహించిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కీలకంగా వ్యహరించారు. ఏడాది క్రితం ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. హర్యానాలోని భివని జిల్లా, సివానీ గ్రామానికి చెందిన కేజ్రీవాల్ ఢిల్లీలో 15 ఏళ్లు సీఎంగా పనిచేసిన షీలాదీక్షిత్‌ను 26 వేల ఓట్ల తేడాతో ఓడించి ఢిల్లీ ముఖ్యమంత్రిగా శనివారం బాధ్యతలు స్వీకరించారు.
 
 మనీష్ సిసోడియా
 విద్య, ఉన్నత విద్య, ిపీడబ్ల్యూడీ, పట్టణాభివృద్ధి, స్థానిక సంస్థలు, భూమి-భవనాలు, రెవెన్యూ శాఖలు
 మాజీ జర్నలిస్టు అయిన మనీష్ సిసోడియా అరవింద్ కేజ్రీవాల్‌కి కుడి భుజంగా పనిచేస్తున్నారు. పత్‌పర్‌గంజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి నకుల్ భరద్వాజ్‌పై 11,478 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. జర్నలిజంలో డిప్లొమా చేసిన సిసోడియా జీ టీవీలో జర్నలిస్టుగా పనిచేశారు. అనంతరం సామాజిక ఉద్యమాల్లోకి వచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీలోని కీలక నేతల్లో సిసోడియా ఒకరు. ఉత్తరప్రదేశ్‌లోని హపుర్ జిల్లాలో రాజ్‌పుత్ కుటుంబంలో జన్మించారు. అరవింద్ కేజ్రీవాల్ మంత్రివర్గంలో ప్రజాపనులు, పట్టణాభివృద్ధి, ఉన్నత విద్యాశాఖల మంత్రిగా కొనసాగనున్నారు.
 
 సౌరభ్ భరద్వాజ్, 
 రవాణా, ఆహారం-పౌరసరఫరాలు, పర్యావర
 ణం, ఎన్నికలు
 వృత్తిపరంగా కంప్యూటర్ ఇంజనీర్ అయిన సౌరభ్ భరద్వాజ్ బీజేపీ సీనియర్ నాయకుడు విజయ్‌కుమార్ మల్హోత్రా కుమారుడు అజయ్‌కుమార్ మల్హోత్రపై గ్రేటర్‌కైలాశ్ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన సౌరభ్.. కే జ్రీవాల్ మంత్రివర్గంలో ట్రాన్స్‌పోర్టు, ఫుడ్ సఫ్లై మినిస్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇంద్రప్రస్థ యూనివర్సిటీ నుంచి బీటెక్, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలోనూ పట్టభద్రుడయ్యాడు. ఢిల్లీలోనే పుట్టిపెరిగిన భరద్వాజ్ అన్నాహజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు.
 
 సోమ్‌నాథ్ భారతి
 పాలనా సంస్కరణలు, పర్యాటక, న్యాయ, ఆర్ట్ అండ్ కల్చర్ శాఖలు
 బీహార్‌కి చెందిన సోమ్‌నాథ్ భారతి అరవింద్ కేజ్రీవాల్ మాదిరిగానే ఐఐటీ ఖరగ్‌పూర్‌లో విద్యనభ్యసించారు. అనంతరం ఢిల్లీలో స్థిరపడ్డారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీని సైతం పొందారు. ఐఐటీ ఢిల్లీ అల్యుమినీ అసోసియేషన్‌కి అధ్యక్షునిగా పనిచేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాలవీయ్‌నగర్ నుంచి పోటీ చేసి మంత్రి కిరణ్ వాలియాను ఓడించారు. కేజ్రీవాల్ కేబినెట్‌లో లా, టూరిజం, ఆర్ట్‌అండ్ కల్చర్, పాలనా సంస్కరణల మంత్రిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. 
 
 రాఖీ బిర్లా
 మహిళా శిశు అభివృద్ధి, సామాజిక సంక్షేమం, మహిళా భద్రత, భాషలు
 మాజీ జర్నలిస్టు అయిన రాఖీ బిర్లా కేజ్రీవాల్ బృందంలో అత్యంత పిన్న వయస్కురాలు. నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్ అకాడమీ నుంచి జర్నలిజంలో మాస్టర్ డిగ్రీ చేశారు. దళితురాలైన రాఖీ తల్లి ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్‌గా పనిచేస్తున్నారు. బిర్లా 12వ తరగతి వరకు చదివారు. జర్నలిస్టుగా ఉద్యోగాన్ని వదిలేసిన రాఖీ హజారే ఉద్యమంలో ప్రారంభం నుంచి ఉన్నారు. కేజ్రీవాల్ చేపట్టిన కార్యక్రమాలను ముందుండి నడిపించారు. ప్రస్తుతం ఆమె మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రిగా, ఢిల్లీలో మహిళల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు.
 
 సత్యేంద్ర జైన్
  ఆరోగ్యం, పరిశ్రమలు, గురుద్వార ఎన్నికలు
 అర్కిటె క్ట్‌గా జీవితాన్ని ప్రారంభించిన సత్యేంద్రజైన్ తర్వాత సామాజిక కార్యకర్తగా అటు నుంచి రాజకీయవేత్తగా మారారు. ఆర్కిటెక్ట్‌గా ఉన్నప్పుడు ఎక్కువగా కేంద్ర ప్రజాపనుల శాఖలో పనులు చేసేవారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు అన్నా హజారే ఉద్యమంలో పాలు పంచుకున్నారు. కేజ్రీవాల్ చేపట్టే కార్యక్రమాలు నచ్చి ఆయనతో చేయికలిపారు. షాకూర్ బస్తీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి శ్యామ్‌లాల్ గార్గ్‌పై 7వేల ఓట్ల తేడాతో గెలిచారు. కేజ్రీవాల్ మంత్రివర్గంలో ఆరోగ్యం, పరిశ్రమలు, గురుద్వార ఎన్నికల మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
 గిరీష్ సోనీ
 ఎస్సీ, ఎస్టీ, ఉపాధి, కార్మికశాఖలు
 వ్యాపారవేత్త అయిన గిరీష్ సోనీ తర్వాత మాదీపూర్‌లో తోలు ఉత్పత్తుల దుకాణాన్ని నిర్వహించారు. మాదీపూర్‌లో 12వ తరగతి వరకు విద్యనభ్యసించారు. ఆ తర్వాత పూసారోడ్డులోని ఐటీఐలో ఏసీ, రిఫ్రిజిరేటర్లను బాగు చేయడంలో డిప్లొమా చేశారు. ఉద్యమంలో కే జ్రీవాల్‌తో కలిసి పనిచేస్తున్నారు.  బీజేపీ అభ్యర్థి కైలాస్ సంక్లాపై 1,103 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఎస్సీ, ఎస్టీ, ఎంప్లాయిమెంట్ డెవలప్‌మెంట్, లేబర్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
 

 

Advertisement
Advertisement