నిఘా నీడలో నగరం | Sakshi
Sakshi News home page

నిఘా నీడలో నగరం

Published Sat, Jan 25 2014 10:57 PM

Delhi: Tight security for Republic Day celebrations

 సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశరాజధానివ్యాప్తంగా ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఉగ్రమూకల దాడులకు ఏమాత్రం అవకాశం లేకుండా సాయుధ బలగాలు డేగకళ్లతో పహారా కాస్తున్నారు ఢిల్లీ లోని అన్ని ప్రాంతాల్లో మొత్తం పదిహేను వేల మంది సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నారు. పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్న ప్రకారం.. రాజధానిలోకి ప్రవేశించే వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రైలేృ స్టేషన్లు, మెట్రోస్టేషన్లు, బస్ అడ్డాలు, ప్రముఖ మార్కెట్లలో ఢిల్లీ పోలీసులతోపాటు సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్‌తోపాటు ఇతర పారామిలిటరీ దళాల బలగాలను మోహరించారు. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలతోపాటు ఢిల్లీలోనికి ప్రవేశించే, బయటికి వెళ్లే వాహనాల వివరాలు ఇతర రాష్ట్రాల పోలీసులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. 
 
 న్యూఢిల్లీ ఏసీపీ ముకేశ్‌మీనా తెలిపిన ప్రకారం పరేడ్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ పూర్తి చే శారు. అన్ని మార్గాలను అదుపులోకి తీసుకోవడంతోపాటు బారికేడ్లు ఏర్పాటు చేసి రెండు రోజులుగా తనిఖీలు చేస్తున్నారు. శనివారం రాత్రి నుంచి నిషేధాజ్ఞలు అమలులోకి వస్తాయన్నారు. పరేడ్‌కి వెళ్లేందుకు పాస్‌లు ఉన్నవారిని మాత్రమే ఆయా మార్గాల్లో అనుమతిస్తామని మీనా అన్నారు. పరేడ్‌కు చేరుకునేందుకు ఆయా ఎన్ క్లోజర్స్ వారీగా ఇప్పటికే రూట్‌బోర్డులను ఢిల్లీ పోలీసులు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ మళ్లింపులకు సంబంధించి ఇప్పటికే వార్తాపత్రికలు, ఎఫ్‌ఎం రే డియోల్లో సమాచారం అందించామన్నారు. శనివారం అర్థరాత్రి నుంచే ముందస్తుగా తెలిపిన అన్ని ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారని మీనా వివరించారు.
 

Advertisement
Advertisement