ఘోరం.. | Sakshi
Sakshi News home page

ఘోరం..

Published Sat, Feb 14 2015 1:38 AM

ఘోరం..

పట్టాలు తప్పిన బెంగళూరు - ఎర్నాకుళం ఇంటర్ సిటీ
హొసూరుకు దగ్గరలోని కర్పూరు వద్ద ప్రమాదం
9 మంది మృతి,10 మందికి తీవ్రగాయాలు

 
బెంగళూరు:ప్రయాణం ప్రారంభించిన దాదాపు గంటలోపే వారు ఊహించని ప్రమాదం ఎదురైంది. పట్టాలు తప్పిన రైలు అనేక మంది జీవితాలను కుదిపేసింది. బెంగళూరు సిటీ రైల్వేస్టేషన్ నుంచి ఉదయం 6.25గంటలకు బయలుదేరిన బెంగళూరు-ఎర్నాకుళం ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ కర్ణాటక-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలోని హొసూరుకు సమీపంలో కర్పూరు వద్ద పట్టాలు తప్పింది. బెంగళూరు నుంచి బయలుదేరిన గంట వ్యవధిలోనే ఉదయం 7.30గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 9మంది ప్రయాణికులు మరణించారు. ఇందులో ఒక బాలుడు,ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. 10 మందికి తీవ్రగాయాలు కాగా మరో పదిమందికి స్వల్పంగా గాయాలయ్యాయని రైల్వే అధికారులు ప్రకటించారు.  మృతదేహాలకు పోస్ట్‌మార్టమ్ నిర్వహించిన అనంతరం బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. కాగా,  ఏడుగురికి స్పర్శ్ ఆస్పత్రిలో, ఒకరికి సంజయ్ గాంధీ ఆస్పత్రిలో మిగిలిన వారికి నారాయణ ఆస్పత్రిలో చికిత్సను అందజేస్తున్నారు. కాగా ప్రమాదంలో చిన్నపాటి గాయాలైన  వారికి స్థానికంగా ప్రథమ చికిత్స అందించి వారి వారి గమ్యస్థానాలకు చేర్చినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

ఎలా జరిగిందంటే....

బెంగళూరు నుండి బయలుదేరిన  బెంగళూరు-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మొత్తం 22 బోగీలున్నాయి. ఇందులో ఎక్కువగా కేరళాకు చెందిన ప్రయాణికులు ఉన్నారు. హొసూరుకు దగ్గర్లోని కర్పూర్ (కర్ణాటక) వద్ద పట్టాలకు అడ్డంగా పడి ఉన్న పెద్ద కొండరాయిని గమనించిన డ్రైవర్ అకస్మికంగా బ్రేక్ వేయడంతో రైలులోని డీ8 బోగి మొదట పట్టాలు తప్పింది. కళ్లుమూసి తెరిసేలోపు డీ9 బోగి... డీ8 బోగిలోకి చొచ్చుకుపోవడంతో అందులో ఉన్న ప్రయాణికుల్లో తొమ్మిది మంది విగత జీవులు కాగా, పది మంది తీవ్రంగా గాయపడ్డారు.  అటు పై డీ10, డీ11లు కూడా పట్టాలు తప్పాయి. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే వెలువడిన పెద్ద శబ్దాన్ని గుర్తించిన గ్రామస్థులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని రక్షణ చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా ప్రమాదం గురించిన సమాచారాన్ని తెలుసుకున్న రైల్వే, వైద్య తదితర శాఖలకు చెందిన అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు.   ఈ సంఘటనా స్థలాన్ని కేంద్ర మంత్రి సదానందగౌడ, రాష్ట్ర మంత్రులు రామలింగారెడ్డి, కె.జె.జార్జ్, యూటీ ఖాదర్‌లు సందర్శించారు.

మృతుల్లో ఎక్కువ మంది కేరళావాసులే....

ప్రమాద బాధితుల్లో చాలా మంది కేరళాకుచెందిన వారే. వారాంతం కావడంతో బెంగళూరులోని వివిధ రంగాల్లో ఉద్యోగాల్లో ఉన్నవారు స్వస్థలానికి వెలుతూ ప్రమాదానికి గురయ్యారు. కాగా మొత్తం 9 మంది చనిపోగా వారిని అమన్(9), ఇథిరాఆంటోని(57),పుణీతావతి(61), సి.ఆర్.వేణుగోపాల్(53), వి.వి.విపిన్(23), నజీమ్‌ఖాన్(67), జార్జ్(70), అయేషాఖాన్(24), ఇర్షామునాఫ్(24),  గా గుర్తించారు.  సంఘటనకు సంబంధించి రైల్వే అధికారులు వివిధ ప్రాంతాల్లో హెల్ప్‌లైన్‌న్లు ఏర్పాటు చేశారు.  
 
రెండు లక్షలు పరిహారం.....

రైలు ప్రమాద ఘటనలో మృతి చెందిన వారికి ప్రధాని నరేంద్రమోదీ తన సంతాపాన్ని ప్రకటించారు. ఇక రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు శుక్రవారం సాయంత్రం ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదంలో మరణించిన వారి కుంటుంబాలకు కేంద్ర  సురేష్‌ప్రభు రూ.2 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. అదేవిధంగా ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చికిత్సకు రూ.50వేలు, సాధారణంగా గాయపడిన వారికి రూ.20 వేలను పరిహారం అందించనున్నామని తెలిపారు. ఇక చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ఆయన తెలిపారు. ఇక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ఘటనపై మాట్లాడుతూ.....మృతులు, క్షతగాత్రులకు సంబంధించిన పూర్తి వివరాలు తమకు అందిన అనంతరం పరిహారానికి సంబంధించిన ప్రకటన చేస్తామని శుక్రవారమిక్కడ వెల్లడించారు.
 
హెల్ప్‌లైన్‌న్లు
 
బెంగళూరు: 080-22371166,080-22156553,080-22156554
 731666751,9448090599
 త్రివేండ్రం-04712321205,2321237,0974679960  
 ఎర్నాకులం  - 04842100317, 0813699773,04842398200
 త్రిచూర్-048772424148,2430060
 ఆల్వే-04842624143
 
 

Advertisement
Advertisement