అధికారంలోకి వస్తే పెట్రోల్ రూ.45 డీజిల్ రూ.35 | Sakshi
Sakshi News home page

అధికారంలోకి వస్తే పెట్రోల్ రూ.45 డీజిల్ రూ.35

Published Wed, Feb 24 2016 1:45 AM

అధికారంలోకి వస్తే పెట్రోల్ రూ.45 డీజిల్ రూ.35

లీటరు పెట్రోల్ రూ.45
 డీజిల్ రూ.35
 కలాం పేరుతో గ్రామాభివృద్ధి
 డీఎండీకే మేనిఫెస్టోలో కొత్త అంశాలు
 నేతృత్వానికి సన్నాహాలు

 సాక్షి, చెన్నై : తన చుట్టూ తిరుగుతున్న పార్టీల్ని, తన గొడుగు నీడన చేర్చుకునే రీతిలోడీఎండీకే అధినేత విజయకాంత్ వ్యూహ రచన చేశారు. తనతో కలసి వస్తే సరి, లేకుంటే ఒంటరికి సైతం సిద్ధం అన్న నిర్ణయానికి వచ్చి ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. నేతృత్వం వహించేందుకు తాను సిద్ధం అని చాటే రీతిలో  ఎన్నికల మేనిఫెస్టోలో కొంత భాగాన్ని డీఎండీకే ప్రకటించింది. ఇందులో ప్రజా సేవకుల పేరిట పథకాలను రచించడమే కాకుండా, లీటరు పెట్రోల్ రూ. 45, లీటరు డీజిల్ రూ.35కు విక్రయించడం జరుగుతుందని ప్రకటించడం గమనార్హం.  డీఎండీకేను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రజా కూటమి, బీజేపీ, డీఎంకే కూటమిలు తీవ్రంగా కుస్తీలు పడుతూ వస్తున్న విషయం తెలిసిందే.
 
  అయితే, విజయకాంత్ ఎక్కడా చిక్కకుండా ఆచీతూచీ అడుగులు వేస్తూ వస్తున్నారు. మౌనంతో నాన్చుడు ధోరణి అనుసరిస్తున్నారు. అయితే, విజయకాంత్ సతీమణి ప్రేమలత మాత్రం దూకుడుతో ముందుకు సాగుతున్నారు.  డీఎంకేతో పొత్తు ప్రసక్తే లేదని చాటే విధంగా ఆమె వ్యాఖ్యలు సాగుతూ వస్తున్నాయి. దీంతో విజయకాంత్ తమతో అంటే తమతో చేతులు కలుపుతారన్న ఆశాభావంలో బీజేపీ, ప్రజా కూటములు మునిగి ఉన్నాయి. అయితే, ఒకరి గొడుగు నీడన తాను చేరడం కన్నా, తన గొడుగు నీడలోకి రండి అన్న ఆహ్వానాన్ని తన కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు పలికే వ్యూహ రచన చేసి ఉన్నారు.
 
 బీజేపీ కూటమిలోకి తాను చేరడం కన్నా, తన నీడలోకి  రావడమే కాకుండా, కొన్ని ఆంక్షల్ని సైతం ఆ పార్టీకి విజయకాంత్ విధించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అదే సమయంలో మరో వ్యూహంతో  ప్రజా కూటమిలోని పార్టీలతో పాటుగా తన మిత్రుడు జీకే వాసన్ నేతృత్వంలోని  తమిళ మానిల కాంగ్రెస్‌ను సైతం ఆహ్వానించడం, ఇతర సామాజిక వర్గాల పార్టీలతో  మెగా కూటమికి అడుగులు వేస్తున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందులో భాగంగా డీఎండీకే  చేపట్టబోయే పథకాలను పరోక్షంగా ఎత్తిచూపే విధంగా మేనిఫెస్టోలోని కొంత భాగాన్ని విడుదల చేసి ఉండటం గమనార్హం. ఈ పథకాలన్నీ ఆకర్షణీయంగా రూపొందించి ఉండడంతో, మిగిలిన అంశాలు ఎలా ఉండబోతాయో అన్న ఎదురు చూపుల్లో పార్టీలు పడే విధంగా ఈ భాగాన్ని విడుదల చేసి ఉన్నారు. అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూ కసరత్తుల్లో ఉన్న విజయకాంత్, తాజాగా వేస్తున్న అడుగుల మీద సర్వత్రా దృష్టి పడి ఉన్నది.
 
 మేనిఫెస్టో :  డీఎండీకే ఎన్నిల మేనిఫెస్టోలో కొంత భాగం విడుదల కావడంతో చర్చ బయలు దేరి ఉన్నది. ఇందులో రాష్ర్టంలోని 12620 గ్రామాల్లోని ప్రజల్ని ఆర్థికంగా బలోపేతం చేయడం లక్ష్యంగా భారత రత్న దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరుతో ప్రత్యేక పథకాన్ని ప్రకటించి ఉన్నారు. అలాగే, ఇంటి వద్దకే రేషన్ వస్తువులు దరిచేర్చేందుకు ప్రత్యేక ప్రకటన చేశారు. నమ్మాళ్వార్ పేరిట వ్యవసాయ పథకం అమలు చేస్తామంటూ, ఈ పథకం మేరకు వ్యవసాయ సంబంధింత అన్ని రకాల విత్తనాలు, పరికరాలు, యూరియా తదితర వస్తువులు రాయితీతో ఇవ్వడం జరుగుతుందని వివరించారు.
 
 65 ఏళ్లకు పై బడ్డ 30 లక్షల మంది అన్నదాతల్ని ఆదుకునే విధంగా నెలకు తలా రూ. 2500 పింఛన్ సదుపాయం కల్పిస్తామన్న హామీ ఇచ్చి ఉన్నారు.  సిం గార వేలర్ పేరిట 65  ఏళ్లకు పైబడ్డ 10 లక్షల మంది  జాలర్లకు తలా రూ. 2500 చొప్పున ఫించన్, కక్కన్ పేరిట 65 ఏళ్లు పైబడ్డ పది లక్షల మంది చేనేత కార్మికులకు తలా రూ. 2500 చొప్పున నెలకు పించన్ అందిస్తామని సూచించి ఉన్నారు. ప్రత్యేక ప్రతిభావంతుల కోసం ప్ర త్యేకంగా స్కూళ్లు, హిజ్రాల కోసం ప్రత్యేకంగా శిక్షణా కేంద్రాలు, కళాశాలలు ఏర్పాటు నినాదాల్ని పొందు పరిచి ఉన్నారు. ఇక, ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు తగ్గుతుందో తెలియని పరిస్థితిలో ఉన్న చమురు ధరకు కల్లెం వేస్తూ మేనిఫెస్టోలో పొందు పరిచారు. అధికారంలోకి వస్తే లీటరు పెట్రోల్ రూ. 45కు, లీటరు డీజిల్ రూ. 35కు రాష్ట్రంలో విక్రయించడం జరుగుతుందంటూ పొందు పరిచి ఉండడం విశేషం.

Advertisement
Advertisement