పొత్తుల తిప్పలు | Sakshi
Sakshi News home page

పొత్తుల తిప్పలు

Published Sat, Jan 11 2014 2:00 AM

పొత్తుల తిప్పలు - Sakshi

 కరుణతో ఆజాద్ మంతనాలు
 స్టాలిన్ ససేమిరా..
 కనిమొళి ఓకే
  డీఎండీకేపై ఆశలు
 
 చెన్నై, సాక్షి ప్రతినిధి:
 ఒంటరిగా పోటీచేస్తే రాష్ట్రంలో ఒక్కసీటు కూడా దక్కదనే భయం పట్టుకున్న కాంగ్రెస్ పొత్తుల కోసం పడరాని పాట్లు పడుతోంది. డీఎంకే ఛీదరించుకుంటున్నా కాళ్లావేళ్లా పడుతోంది. ఈ క్రమంలో డీఎండీకేపై ఆశలు పెట్టుకంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఏనాడో కాలం చెల్లిపోయింది. పొత్తులతో సరిపెట్టుకుని ఉనికిని కాపాడుకోవడం మినహా గత్యంతరం లేదు. అన్నాడీఎంకే ఏనాడో తలుపులు మూసేసింది. ఇక మిగిలిన ప్రధాన పార్టీ డీఎంకే. వ్యక్తిగత, రాజకీయ కారణాలతో యూపీఏతో కరుణ గత ఏడాదే కటీఫ్ చెప్పేశారు. కేంద్ర మం త్రి వర్గం నుంచి తమ వారిని తప్పిం చారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తులేదని కరుణానిధి, స్టాలిన్ ముక్తకంఠంతో ప్రకటించారు.
 
  కాంగ్రెస్ ఓట్లతో రాజ్యసభ సీటును దక్కించుకున్న కనిమొళి, నాలుగేళ్లపాటు కేంద్ర మంత్రి పదవిని అనుభవించిన అళగిరి కాంగ్రెస్‌కు దూరం కావడాన్ని అంగీకరించడం లేదు. డీఎంకేను ఎప్పటికైనా చేరదీసుకోవచ్చనే నమ్మకంతోనే కనిమొళికి కాంగ్రెస్ ఐదు ఓట్ల సాయం చేసింది. ఇందుకు కృతజ్ఞతగానే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని తండ్రి కరుణపై కనిమొళి ఒత్తిడి తెస్తోంది. రాజ్యసభ ఎన్నికల్లో కనిమొళి గెలుపు కోసం, ఏర్కాడు ఉప ఎన్నికల్లో అభ్యర్థి గెలుపుకోసం కాంగ్రెస్ సాయాన్ని కోరి పొందిన కరుణ లోక్‌సభ ఎన్నికల్లో ముఖం చాటేశారు. శ్రీలంకలో ఈలం తమిళుల ఊచకోత, తమిళ జాలర్లు అరెస్టు, దాడులు తదితర సమస్యలపై కేంద్రంలోని కాంగ్రెస్ సర్కారు తగిన చొరవ చూపలేదని తమిళులు మండి పడుతున్నారు. ఈ కారణంగా ఒంటరిగా పోటీ చేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఒక్కసీటు కూడా రాదని అధిష్టానం నమ్ముతోంది. ఈ పరిస్థితుల్లో డీఎంకేతో పొత్తు మినహా దిక్కులేని పరిస్థితుల్లో పడిపోయింది. కరుణను ప్రసన్నం చేసుకునేందుకు స్టాలిన్‌తో చర్చలు జరపాలని రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జ్ గులాంనబీ ఆజాద్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యూరుు.
 
  డీఎంకే పార్లమెంటరీ పార్టీ నాయకుడు టీఆర్ బాలు, కనిమొళి ద్వారా చేసిన ప్రయత్నాలు సఫలం కావడంతో గురువారం రాత్రి కరుణతో ఆజాద్ సమావేశమయ్యూరు. సహజంగా ఇతర పార్టీలతో చర్చలను కరుణ గోపాలఫురంలోని ఇంటిలోనే నిర్వహిస్తారు. స్టాలిన్, అళగిరి, కనిమొళి తదితర పార్టీ పెద్దలు పాల్గొనడం ఆనవాయితీ. ఆశ్చర్యకరంగా ఆజాద్‌తో సమావేశాన్ని సీఐటీ కాలనీలోని ఇంటిలో జరిపారు. కనిమొళి మాత్రమే వీరితో కలిసి చర్చల్లో పాల్గొన్నట్లు సమాచారం. డీఎంకేతోపాటు డీఎండీకేను సైతం కాంగ్రెస్ కూటమిలో కలుపుకునేందుకు ఆజాద్ ప్రయత్నాలు చేస్తున్నారు. కరుణతో సమావేశం ముగిసిన తర్వాత ఆజాద్ కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. సఖ్యత కుదిరిందా? అని అడిగిన ప్రశ్నకు ఁతాము ఏనాటి నుంచో స్నేహితులమని, ఎప్పుడూ స్నేహితులంగానే ఉంటాం* అని బదులిచ్చారు. ఆజాద్ వైఖరిని బట్టి కాంగ్రెస్, డీఎంకే చెట్టపట్టాల్ ఖాయమైందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కాంగ్రెస్ తరఫున పోటీచేసే అభ్యర్థుల ఎంపిక బాధ్యతను అధిష్టానం ఆజాద్ నాయకత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీకి అప్పగించింది. ఈ కమిటీలో టీఎన్‌సీసీ అధ్యక్షులు జ్ఞానదేశికన్, హొసూరు ఎమ్మెల్యే గోపీనాథ్, ముకుల్‌వాస్నిక్, శుభాకర్ సర్కార్ సభ్యులుగా ఉన్నారు.

Advertisement
Advertisement