నాలుగుకు చేరిన డెంగీ మృతుల సంఖ్య | Sakshi
Sakshi News home page

నాలుగుకు చేరిన డెంగీ మృతుల సంఖ్య

Published Tue, Oct 8 2013 2:01 AM

Four to reach the break-bone death toll

న్యూఢిల్లీ: నగరాన్ని డెంగీ గడగడలాడిస్తోంది. ఈ వ్యాధితో మృతి చెందిన వారి సంఖ్య సోమవారానికి నాలుగుకి చేరుకుంది. 2,916 మంది రోగులను గుర్తించామని, వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య శాఖ అధికారులు సోమవారం తెలిపారు.  మృతులను కిసాన్‌గార్గ్‌కు చెందిన గౌతమ్ ప్రియాంక (35), పశ్చిమ ఢిల్లీలోని ఆశోక్‌నగరానికి చెందిన పూల్ సింగ్(47), ఉత్తర ఢిల్లీ ప్రతాప్ నగరానికి చెందిన ప్రియాంక శంకర్ (21), దక్షిణ ఢిల్లీ ఓక్లాకు చెందిన ప్రియా జా (6)లుగా గుర్తించామని వెల్లడించారు.
 
 గురువారం వరకు 2,557 ఉన్న డెంగీ రోగుల సంఖ్య సోమవారానికి 2,916కు చేరుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. 2012లో 2,093 కేసులు నమోదుకాగా ఈసారి అక్టోబర్ ఏడు వరకు 2,916 కేసులను గుర్తించామని చెప్పారు. వీటిలో ఢిల్లీలో 2,881 కేసులు ఉండగా, మిగతావి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయని వివరించారు.  వాతావరణంలో మార్పులు, తరచూ కురిసిన వర్షాలు, భవన నిర్మాణాల వద్ద పెరిగిన దోమల వల్ల ఈ డెంగీ ప్రభావం పెరిగిందని పేరొన్నారు. ఈ నెలలో సాధారంగా డెంగీ రోగుల సంఖ్య పెరుగుతుందని,  తరచూ కురిసే వర్షాలు తెరిపినివ్వడంతో దోమలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని  ఉత్తర, తూర్పు ఢిల్లీ ప్రజా సంబంధాల అధికారి యోగేంద్ర సింగ్ మాన్ విలేకరులకు తెలిపారు.
 
 25 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉష్ణోగ్రత నిలకడగా ఉండటం, దోమలు పెరగడం వల్ల రోగుల సంఖ్య పెరుగుతోందన్నారు. ఇప్పటి నుంచి ఈ నెలాఖరు వరకు ఈ వ్యాధి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ వ్యాధులను నియంత్రించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టామని తెలిపారు. దోమలు ఎక్కువగా ఉన్న ఆయా ప్రాంత భవనవాసులకు లీగల్ నోటీసులు జారీ చేశామన్నారు. పరిశుభ్రతను పాటించాలని కోరామన్నారు. ఈ వ్యాధుల బారిన ప్రజలు పడకుండా ఉండేందుకు ఇంటి ఇంటికి వెళ్లి తీసుకోవాల్సిన నివారణ చర్యల గురించి వివరిస్తున్నామన్నారు. ప్రతి జోన్‌లో దోమలను చంపేందుకు ఫాగింగ్ చేస్తున్నామని తెలిపారు. ‘యమూనా నదీ తీర ప్రాంతాల్లో ఫాగింగ్ చేస్తున్నాం.
 
 కొన్ని ప్రాంతాల్లో చేపలను కూడా వదిలాం. అవి దోమలను తింటాయి. రోజువారీ తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు, వైద్య శిబిరాలను కూడా నిర్వహిస్తున్నాం. వ్యాధుల గురించి ప్రజల్లో జాగృతిని కల్పిస్తున్నాం. వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నామ’ని చెప్పారు. వాతావరణంలో మార్పుల వల్ల దోమల సంఖ్య పెరుగుతుందన్నారు. నీరు నిలుచుని ఉండే ప్రాంతాలతో పాటు రైళ్ల ట్రాక్‌ల వెంబడి పొగను చల్లుతున్నామని ఆయన వివరించారు.
 

Advertisement
Advertisement