Sakshi News home page

పంచాయతీలపై ‘పచ్చ’పవర్‌

Published Fri, Dec 23 2016 1:57 AM

పంచాయతీలపై ‘పచ్చ’పవర్‌ - Sakshi

జన్మభూమి కమిటీల ఆధ్వర్యంలో గ్రామసభలు.. సర్పంచుల ఆఖరి అధికారంపై వేటు

కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఆదేశాలు
భూసేకరణకు అడ్డంకులు లేకుండా సర్కారు పెద్దల ఎత్తులు
సర్పంచులు ఇక డమ్మీలే.. పెత్తనం అధికార పార్టీ కార్యకర్తలదే
పంచాయతీరాజ్‌ చట్టం అపహాస్యం..స్థానిక సంస్థలు నిర్వీర్యం
పంచాయతీలకు కేంద్రం ఇచ్చే నిధులు పచ్చచొక్కాల జేబుల్లోకే


సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ గ్రామ సర్పంచుల అధికారాలను ఒక్కొక్కటిగా కత్తిరించేసిన రాష్ట్ర ప్రభుత్వం వారి ఆఖరి అధికారంపై కూడా వేటు వేసేందుకు సన్నద్ధమవుతోంది. రాజ్యాంగ స్ఫూర్తిని అపహాస్యం చేస్తూ.. గ్రామ సర్పంచులను డమ్మీలుగా మార్చేసి, వారికి ఉండే కీలక అధికారాన్ని జన్మభూమి కమిటీలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించేందుకు జరగాల్సిన గ్రామసభల నిర్వహణ అధికారాన్ని ఇకపై జన్మభూమి కమిటీలకు అప్పగించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం కలెక్టర్ల సమావేశంలో అధికారులను ఆదేశించారు. 1994 పంచాయతీరాజ్‌ చట్టం సెక్షన్‌ 6 ప్రకారం.. గ్రామసభలకు స్థానిక సర్పంచి అధ్యక్షత వహించాలి. సర్పంచి లేకపోతే  ఉపసర్పంచి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించాలి. గ్రామ సర్పంచే గ్రామసభ నిర్వహణకు అనుమతి తెలపాలని పంచాయతీరాజ్‌ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం జన్మభూమి కమిటీ సభ్యుల నేతృత్వంలో గ్రామసభలను నిర్వహించాలని ఆదేశించడం గమనార్హం.

భూసేకరణకు అడ్డు తొలగించుకోవడానికే!
రాష్ట్రంలో విలువైన భూములను ప్రైవేట్‌ కంపెనీలకు అప్పనంగా కట్టబెట్టాలనుకుంటున్న ప్రభుత్వ పెద్దల కుట్రలకు గ్రామసభలు అడుగడుగునా అడ్డు తగులుతున్నాయి. ఏ గ్రామంలోనైనా భూసేకరణ చేపట్టాలంటే అక్కడి గ్రామసభ ఆమోదం తప్పనిసరి. నిబంధనల ప్రకారం.. గ్రామంలో అందరూ అంగీకరించి, తీర్మానం చేస్తే తప్ప భూములను సేకరించడానికి వీల్లేదు. ఇదే నిబంధన ప్రభుత్వ పెద్దలకు పెద్ద ఆటంకంగా మారింది. అందుకే గ్రామసభ నిర్వహణ అధికారాన్ని సర్పంచుల నుంచి లాగేసి, సొంత పార్టీ కార్యకర్తలతో నిండి ఉండే జన్మభూమి కమిటీలకు అప్పగిస్తే ఇక తమకు అడ్డే ఉండదని నిర్ణయానికొచ్చారు. మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్య భావనను సమాధి చేస్తూ గ్రామాల్లో పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పల్లెల్లో పింఛన్లు, ఇళ్ల మంజూరు వంటి సంక్షేమ కార్యక్రమాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా జన్మభూమి కమిటీల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ కమిటీల చలవతో నకిలీ లబ్ధిదారులు ప్రభుత్వ సొమ్మును మింగేస్తున్నారు. అసలైన లబ్ధిదారులు మాత్రం నష్టపోతున్నారు. భూసేకరణకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకోవడంతోపాటు గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో ‘పచ్చ’ చొక్కాల జేబులు నింపడానికే గ్రామసభల అధికారాన్ని జన్మభూమి కమిటీలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ఆ కమిటీల నిండా టీడీపీ మనుషులే
ఇప్పటికే వృద్ధాప్య, వితంతు పింఛన్లు వంటి సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో గ్రామ సర్పంచులకు ఉండే అధికారాలను ప్రభుత్వం తెగ్గొట్టి, జన్మభూమి కమిటీ సభ్యులకు విశేషాధికారాలు కల్పించిన విషయం తెలిసిందే. జన్మభూమి కమిటీ సభ్యులుగా దాదాపు అన్నిచోట్లా అధికార పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులే నియమితులయ్యారు. రాజకీయ కారణాలతో పలువురు అర్హులకు పింఛన్లు నిలిపి వేసినట్లు లక్షల్లో ఫిర్యాదులు వచ్చాయి. వందలాది మంది హైకోర్టును ఆశ్రయించి తిరిగి పింఛన్లు పొందారు. ఇప్పడు గ్రామసభ నిర్వహణ అధికారాన్ని జన్మభూమి కమిటీ సభ్యులకు అప్పగించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

పంచాయతీల అధికారాలకు తూట్లు
గత మూడేళ్లుగా దేశవ్యాప్తంగా పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా వచ్చే నిధులు పెరిగాయి. 14వ ఆర్థిక సంఘ సిఫార్సులతో గ్రామ పంచాయతీకి కేంద్రం నేరుగా ఇచ్చే నిధులతోపాటు ఉపాధి హామీ పథకంలో  గ్రామాలవారీగా కేటాయించిన నిధులను గ్రామ పంచాయతీలు అభివృద్ధి పనుల కోసం స్వతంత్రంగా ఖర్చు పెట్టుకోవచ్చు. రాష్ట్రంలో దాదాపు 13,000 గ్రామ పంచాయతీలు ఉండగా, రెండు పథకాల అమలుకు మూడేళ్లుగా ఏటా రూ.5,000 కోట్ల చొప్పున కేంద్రం నుంచి నిధులొచ్చాయి. జనాభాపరంగా పంచాయతీని బట్టి ఏడాదికి రూ.7 లక్షల నుంచి రూ.25 లక్షలు ఆర్థిక సంఘం రూపేణ నిధులు అందగా, ఉపాధి హామీ పథకంలో అదనంగా ప్రతి పంచాయతీకి రూ.10 కోట్ల చొప్పున నిధులు కేటాయించారు. పంచాయతీల వారీగా కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన పథకాలకు మళ్లిస్తున్నారు. గ్రామాల్లో అధికార పార్టీ నేతలకు నామినేషన్‌పై పనులు అప్పగించేందుకు ప్రభుత్వం సర్పంచుల అధికారాలపై ఆంక్షలు విధించడం ప్రారంభించింది. పంచాయతీ నిధుల ఖర్చు విషయంలో అధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే పెత్తనం చెలాయిస్తోంది. సర్పంచుల అధికారాల విషయంలోనూ జన్మభూమి కమిటీ సభ్యుల జోక్యం పెరుగుతోంది.

గ్రామసభ అంటే?
గ్రామంలోని ఓటర్లు ప్రతి ఏటా విధిగా నాలుగు సార్లు సమావేశం కావాలి. దీన్నే గ్రామసభ అంటారు. సమావేశమై రాష్ట్ర ప్రభత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించాలి. గ్రామ సభకు పూర్తి ప్రచారం కల్పించాలి. గ్రామం లో ఓటర్లందరికీ అందుబాటులో ఉండే ప్రాంతంలో పగటి పూటే ఈ సభ నిర్వహిం చాలి. గ్రామ పంచాయతీలో చేపట్టాల్సిన పనుల గురించి సమీక్షించాలి. అనంతరం తీర్మానం చేయాలి. గ్రామ సర్పంచి గ్రామ సభకు అధ్యక్షత వహించాలని పంచాయ తీరాజ్‌ చట్టం సెక్షన్‌ 6 రూల్‌ నంబరు 5లో స్పష్టంగా పేర్కొన్నారు. 1997 ఏప్రిల్‌లో పంచాయతీరాజ్‌ శాఖ జారీ చేసిన జీవో 162లోనూ ఇదే విషయాన్ని తెలియజేశారు. గ్రామసభలో గ్రామ ఆదాయ, వ్యయాలపై చర్చించి అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాల్సి ఉంటుంది. ఏ పనికి ఎంత ఖర్చు పెట్టాలో కూడా సభలో నిర్ణయిస్తారు. జూలైలో నిర్వహించాల్సిన రెండో సభలో గ్రామంలో అభివృద్ది కార్యక్రమాలపై సమీక్షతోపాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు గ్రామ పరిధిలో లబ్ధిదారుల ఎంపికను చేపట్టాలి. అక్టోబరు నెలలో నిర్వహించాల్సిన గ్రామసభలోనూ ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపికతోపాటు గ్రామంలో మంచినీటి సరఫరా, ఇతర అభివృద్ది కార్యక్రమాలపై సమీక్షించాల్సి ఉంటుంది. జనవరి 2న నాలుగో గ్రామసభ నిర్వహించాలి. ఏడాదిపాటు గ్రామంలో చేపట్టిన పనులపై నాలుగో గ్రామసభలో చర్చించాలి. గ్రామ పంచాయతీల్లో గ్రామసభ నిర్వహణ, విధులు, అధికారాలపై 2013 నవంబరు 7న రాష్ట్ర సాధారణ పరిపాలన విభాగం జీవో నంబరు 791 జారీ చేసింది. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే 14వ ఆర్థిక సంఘం నిధులతోపాటు గ్రామానికి కేటాయించిన ఇతర నిధులతో స్థానికంగా ఏయే పనులు చేపట్టాలన్న దానిపై గ్రామసభలో చర్చించి, ఆమోదం పొందాల్సి ఉంటుంది.

Advertisement

What’s your opinion

Advertisement