ప్రాజెక్టులను అడ్డుకోవడానికే కూటమి | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టులను అడ్డుకోవడానికే కూటమి

Published Thu, Nov 8 2018 11:04 AM

Grand Alliance Is For Blocking Projects - Sakshi

సాక్షి,మిరుదొడ్డి(దుబ్బాక): తెలంగాణలో ఉన్న బీడు భూములను సస్యశ్యామలం చేయడానికి తలపెట్టిన ప్రాజెక్టు నిర్మాణాలను అడ్డుకోవడానికే మహాకూటమి పేరుతో కుట్రలు పన్నుతున్నారని దుబ్బాక టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిధిలోని మల్లుపల్లిలో మంగళవారం ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. డప్పు చప్పుళ్లతో రామలింగారెడ్డికి పలు కుల సంఘాల సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. గొల్ల కురుమ సంఘం సభ్యులు రామలింగాడ్డిని గొంగడి కప్పి గొర్రెపిల్లతో ఘనంగా సన్మానించారు. మహిళలు మంగళహారతులు, విజయ తిలకాలు దిద్ది ఆశిర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాకూటమి పేరుతో వచ్చే నాయకులను గెలిపిస్తే సాగు నీటిని అందించే ప్రాజెక్టు నిర్మాణాలు ఆగిపోతాయని ఆరోపించారు.

దీంతో తెలంగాణలో సాగు నీరు లేక వ్యవసాయం నల్లేరుపై నడకలాగా మారే ప్రమాదం పొంచి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్ని మహాకూటములు ఎదరువచ్చి నిలిచినా ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. వ్యవసాయ రంగంలో నెలకొన్న ఒడిదుడుకులకు గుర్తించిన కేసీఆర్‌ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నాడన్నారు. మరో సారి అధికారంలోకి వస్తే వ్యవసపాయ రంగానికి కావాల్సిన సాగు నీటితో పాటు ఎకరానికి రూ.10 వేలు పంట సాయంగా అందిస్తాడన్నారు. రైతుబంధు, రైతు బీమా దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రజలు మరోసారి తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే దుబ్బాక నియోజకవర్గాన్ని మరింత  అభివృద్ధిబాటలో నిలుపుతామన్నారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు పూర్తయి నీళ్లొస్తే దుబ్బాక రైతాంగం కష్టాలు తీరుతాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కవిత, వైస్‌ ఎంపీపీ తుమ్మల బాల్‌రాజు, ఎంపీటీసీలు సుక్క శ్రీనివాస్, గొట్టం భైరయ్య, ధార స్వామి,  టీఆర్‌ఎస్‌ నాయకులు పంజాల శ్రీనివాస్‌గౌడ్, లింగాల వెంకట్‌రెడ్డి, కాలేరు శ్రీనివాస్, బుర్ర లింగంగౌడ్, వల్లాల సత్యనారాయణ, ఎల్లం, దుబ్బరాజం, లింగం, ఎల్ముల స్వామి, గంగాధర్, అంజిరెడ్డి పాల్గొన్నారు. 

Advertisement
Advertisement