రూ.40 కోట్లు ఎగనామం | Sakshi
Sakshi News home page

రూ.40 కోట్లు ఎగనామం

Published Sun, Jan 29 2017 5:09 AM

Huge Scandal

  • వాణిజ్య పన్నులశాఖలో భారీ కుంభకోణం..
  • ఫోర్జరీ సంతకాలు, నకిలీ స్టాంపులు.. బోగస్‌ చలానాలు..
  • సాక్షి, నిజామాబాద్‌: తెల్గీ స్టాంపుల కుంభకోణానికి ఏ మాత్రం తీసిపోని విధంగా జిల్లాలో వాణిజ్య పన్నుల శాఖలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. ఫోర్జరీ సంతకాలు, బోగస్‌ స్టాంపులతో ట్రెజరీ నకిలీ చలానాలు సృష్టించి సర్కారుకు చెల్లించాల్సిన వ్యాట్‌ను రూ.కోట్లలో ఎగనామం పెట్టారు. కేవలం 2012–13, 2013–14 ఆర్థిక సంవత్సరాల్లో బోధన్‌ సీటీవో కార్యాలయం పరిధిలో ఏకంగా రూ.40 కోట్లు పన్ను ఎగవేసినట్లు ఆ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఉన్నతాధికారులు చేపట్టిన ప్రాథమిక విచారణలో తేలింది. రైస్‌మిల్లర్లు, జిన్నింగ్‌ మిల్లుల యజమానులు, జిల్లాలోని కొన్ని బడా వాణిజ్య సంస్థలు యథేచ్ఛగా ప్రభుత్వానికి పంగనామం పెట్టాయి.

    ఓ ట్యాక్స్‌ కన్సల్టెంట్‌ ఈ కుంభకోణానికి సూత్రధారి అని విచారణలో తేలింది. ఈ శాఖలో చాలా ఏళ్లుగా పాతుకుపోయిన అధికారులే ఈ దందాకు సహకరించినట్లు గుర్తించారు. వాణిజ్య పన్నుల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అదనపు కమిషనర్‌ సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలోని అధికారుల బృందం 3 నెలలు గా విచారణ చేపడుతోంది. ఈ బృందం ఇటీవల బోధన్‌కు వచ్చి రికార్డులను స్వాధీనం చేసుకుంది. ఈ భారీ కుంభకోణానికి సూత్రధారి అయిన ఓ ట్యాక్స్‌ కన్సల్టెంట్‌ నివాసంలోనూ సోదాలు నిర్వహించి, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

    ప్రస్తుతానికి నలుగురిపై వేటు..: ఈ భారీ కుంభకోణంలో ప్రస్తుతానికి కింది స్థాయి సిబ్బందిపై వేటు వేశారు. బోధన్‌ సీటీవో కార్యాలయంలో ఏసీటీవోగా పనిచేస్తున్న ఆర్‌.డి.విజయ్‌కృష్ణ, సీనియర్‌ అసిస్టెంట్లు వేణుగోపాలస్వామి, కె.నాగరాజు, జూని యర్‌ అసిస్టెంట్‌ హనుమాన్‌సింగ్‌లను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు నిజా మాబాద్‌ డిప్యూటీ కమిషనర్‌ లావణ్య ‘సాక్షి’తో చెప్పారు. శాఖాపరమైన విచారణ కొనసాగుతోందని, బాధ్యులు ఎంతటివారైనా చర్యలుంటాయని ఆమె పేర్కొన్నారు.

    అసలేం జరిగింది..?
    కొందరు రైస్‌మిల్లర్లు, జిన్నింగ్‌ వ్యాపారులు, ఇతర వ్యాపార సంస్థల వారు తమ లావాదేవీలకు సంబంధించిన వ్యాట్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఆయా సరుకులను బట్టి పన్ను ఉంటుంది. ఈ మొత్తాన్ని ట్రెజరీ ద్వారా, చలానాల ద్వారా చెల్లిస్తుంటారు. ఈ చలానా కాపీలను వాణిజ్య పన్నుల శాఖలో సమర్పిస్తే వారు ఆ నెలలో జరిపిన లావాదేవీలకు సంబంధించిన ట్యాక్స్‌ చెల్లించినట్లు రికార్డుల్లో పేర్కొంటారు. ఇక్కడ బోగస్‌ చలానాలు సృష్టించారు. ఏకంగా అధికారుల సంతకాలను ఫోర్జరీ చేశారు. నకిలీ స్టాంపు (ముద్ర)లను కూడా తయారు చేసి, బోగస్‌ చలానాలను తయారు చేసి సర్కారుకు ఎగనామం పెట్టారు. అధికారులు ఈ చలానాలు సరైనవేనా అని పరిశీలిం చాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడ అధికారులు, సిబ్బంది సంబంధిత డీలర్లతో కుమ్మక్కుకావడంతో ఈ తతంగమంతా కొనసాగింది.

    ఫిప్టీ.. ఫిఫ్టీ పంచుకున్నారు..
    సర్కారుకు చెల్లించాల్సిన వ్యాట్‌ మొత్తాన్ని అధికారులు, సదరు ట్యాక్స్‌ కన్సల్టెంట్‌ కలిసి పంచుకున్నారు. ఈ క్రమంలో వ్యాపారులకు కూడా బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. ఆయా వ్యాపారులు ఆ నెలలో చెల్లించాల్సిన పన్నులో 50 నుంచి 60 శాతం మొత్తాన్ని ట్యాక్స్‌ కన్సల్టెంట్‌కు ఇస్తే సరిపోతుంది. ఉదాహరణకు ఒక రైస్‌మిల్లరు రూ.లక్ష వ్యాట్‌ చెల్లించాల్సి ఉంటే కేవలం రూ.50 వేలు ఇస్తే సరి.. ఆ నెలలో వ్యాట్‌ చెల్లించినట్లు రికార్డులు సృష్టిస్తారు. బోగస్‌ చలానాలు తయారు చేసి ఈ మొత్తాన్ని అధికారులు, ట్యాక్స్‌ కన్సల్టెంట్లు కలిసి పంచుకున్నారు.

    ఏడాది క్రితమే ఫిర్యాదులు..
    జిల్లాలో జరిగిన ఈ అక్రమాల బాగోతంపై ఏడాది క్రితమే వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. విచారణ ఎప్పుడో కొనసాగాల్సి ఉండేది. కానీ తన ‘పరపతి’ని ఉపయోగించి ఏడాది కాలంగా విచారణ నిలిపివేయించినట్లు ఆ శాఖ వర్గాలు భావిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా సీఎం కేసీఆర్‌ స్వయంగా ఈ వాణిజ్యపన్నుల శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఆ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంతో పకడ్బందీ విచారణ చేపట్టారు.

Advertisement
Advertisement