జనానికి బీజేపీ పువ్వు, కాంగ్రెస్ టోపీ! | Sakshi
Sakshi News home page

జనానికి బీజేపీ పువ్వు, కాంగ్రెస్ టోపీ!

Published Mon, Nov 18 2013 2:06 AM

Individuals flower BJP, Congress hat!

సింధనూరు టౌన్, న్యూస్‌లైన్ : రైతులు పండించిన పంటలకు మద్దతు ధర లభించక ఇబ్బందులు పడుతుంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రైతులను ఆదుకోవడం మాని బీజేపీ జనం చెవిలో పువ్వు (కమలం), కాంగ్రెస్ జనం నెత్తిన మక్మల్ టోపీ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ. కుమారస్వామి ఎద్దేవా చేశారు. ఆయన ఆదివారం తాలూకాలోని హంచినాళ క్యాంపులో తెగుళ్ల బారిన పడి నష్టపోయిన వరి పంటను పరిశీలించారు.  సహాయక వ్యవసాయ శాఖ నిర్దేశకులు జయప్రకాష్ నుంచి వివరాలు తెలుసుకుని అనంతరం విలేకరులతోను, ఏర్పాటు చేసిన కార్యక్రమంలోను మాట్లాడారు.

తుఫాన్ ప్రభావంతో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు వరి దిగుబడి 25 శాతం మేరకు తగ్గిపోయిందన్నారు. దీనిపై ఇంతవరకు ప్రభుత్వం సర్వే కూడా చేయలేదన్నారు. వరికి మద్దతు ధర లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం వరికి మద్దతు ధర కల్పించాలని, నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని ఈ నెల 24నే బెళగావిలో జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లో డిమాండ్ చేస్తామన్నారు.

రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించేందుకు ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిందన్నారు. అంతేకాక అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ప్రకటించారని, అయితే ఇంతవరకు కమిషన్ ఏర్పాటు చేయలేదన్నారు. రైతులు వరి ధాన్యానికి మద్దతు ధర లేక దిక్కు తోచని స్థితిలో ఉంటే ప్రభుత్వం అన్నభాగ్య పథకం కోసం 13.5 మెట్రిక్ టన్నుల లెవీని సేకరించడం దారుణమన్నారు. ప్రభుత్వానికి దమ్ముంటే బహిరంగ మార్కెట్‌లో వరిధాన్యం కొనుగోలు చేసి అన్నభాగ్య పథకానికి వినియోగించుకోవాలని సవాల్ విసిరారు.
 
నరేంద్ర మోడీ బెంగళూరులో సమావేశం జరిపినంత మాత్రాన రాజకీయాలేమీ తలకిందులు కావన్నారు. మూడున్నర లక్షల టికెట్లు అమ్ముడు పోయాయని చెబుతున్నారని, అయితే ఆ కార్యక్రమంలో లక్ష మంది కూడా పాల్గొనలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి గెలుపు అసాధ్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన అహింద విద్యార్థులకు టూర్, షాదీ భాగ్య, క్షీరభాగ్య తదితర పథకాలన్నీ అశాస్త్రీయంగా ఉన్నాయన్నారు.

అహింద విద్యార్థులకు టూర్ పథకంలో తొలుత కేవలం తొమ్మిది వేల మందికి నిధులు విడుదల చేసినట్లు సీఎం చెప్పారు. అనంతరం ఈ పరిమితిని 13,500 మందికి పొడిగించారన్నారు. అంటే ప్రతి జిల్లా నుంచి కేవలం 450 మంది మాత్రమే పర్యటనకు వెళ్లేందుకు అవకాశం ఉందన్నారు. అంటే మిగతా విద్యార్థులు పర్యటనకు అనర్హులా? అందువల్ల ఈ పథకం అశాస్త్రీయమన్నారు. రైతులు వరి, పత్తి, కందులు, మొక్కజొన్న తదితర పంటలకు మద్దతు ధర లేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
 
శాంతినగర్‌లో శాంతి నెలకొనాలి


 తాలూకాలోని శాంతినగర్‌లో నెలకొల్పిన నూతన శివలింగం వద్ద కార్తీక మాసం సందర్భంగా అఖండ దీపోత్సవం, ఇతర ధార్మిక కార్యక్రమాలను మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అన్ని వర్గాల వారికి శాంతి సమృద్ధి లభించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బండెప్ప కాశంపూర్, ఎమ్మెల్యేలు మానప్ప వజ్జల్, డాక్టర్ శివరాజ్ పాటిల్, జేడీఎస్ నేత వెంకటరావు నాడగౌడ, జేడీఎస్ జిల్లా అధ్యక్షుడు మహాంతేష్ పాటిల్ అత్తనూరు, బసవరాజ నాడగౌడ, లింగప్ప సాహుకార్, ఎన్.శివశంకర్, పవన్‌కుమార్, ధర్మనగౌడ, మల్లనగౌడ, సుమిత్ తడకల్, చంద్రు భూపాల నాడగౌడ, దాసరి సత్యనారాయణ, తహశీల్దార్ వెంకనగౌడ ఆర్.పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement