14 నుంచి అంతర్జాతీయ వాణిజ్య మేళా | Sakshi
Sakshi News home page

14 నుంచి అంతర్జాతీయ వాణిజ్య మేళా

Published Fri, Nov 7 2014 11:14 PM

14 నుంచి అంతర్జాతీయ వాణిజ్య మేళా - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఈ నెల 14 నుంచి రాజధానిలో రెండువారాల పాటు జరిగే అంతర్జాతీయ వాణిజ్య మేళా కోసం ప్రగతిమైదాన్‌లో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు ఇతివృత్తంగా జరిగే ఈ మేళాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ  నవంబర్ 14న ప్రారంభిస్తారు. 34వ వాణిజ్య మేళాలో దక్షిణాఫ్రికా భాగస్వామ్యదేశంగా, థాయ్‌లాండ ఫోకస్ దేశంగా, ఢిల్లీ ఫోకస్ రాష్ట్రంగా పాల్గోనున్నాయి.

మేళాలో మొదటి ఐదు రోజులను అంటే 14 నుంచి 18 తేదీవరకు వాణిజ్య సందర్శకుల కోసం కేటాయించారు.  నవంబర్ 19 నుంచి సామాన్య ప్రజల కోసం మేళా తలుపులు తెరచుకుంటాయి. వాణిజ్య సందర్శకులను మాత్రమే అనుమతించే రోజులలో టికెట్ వెల 400 రూపాయలు ఉండనుంది. నవంబర్ 19 నుంచి మాత్రం రూ.50 టికెట్ కింద వసూలు చేస్తారు. వారాంత పు సెలవు దినాలు, ప్రభుత్వ సెలవు రోజులలో టికెట్ వెల రూ.80గా ఉండనుంది.

మేళాలో పాకిస్థాన్ సందడి:
దాదాపు 25 దేశాలు ఈ మేళాలో పాల్గోనున్నాయి. ఇటీవలి కాలంలో భారత్ - పాకిస్థాన్‌ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ పాకిస్థాన్ వ్యాపారులు మాత్రం రాజధానిలో జరిగే వాణిజ్య మేళాలో పాల్గొనడానికి ఉత్సాహం చూపుతున్నారు. పాకిస్థాన్‌కు చెందిన 115 కంపెనీలు మేళాలో పాల్గొంటున్నాయి. గత సంవత్సరం 85 కంపెనీలు మేళాలో పాల్గొన్నాయి. ఈ సంవత్సరం పాకిస్థాన్‌కు రెండుహాళ్లలో స్థలం కేటాయించనున్నారు. హాల్ నంబర్ 6, హాల్ నంబర్ 20లలో పాకిస్థాన్ కంపెనీలు స్టాల్స్ ఏర్పాటు చేసుకోనున్నాయి. పాకిస్థాన్ ఉత్పత్తులలో ఓనిక్స్ స్టోన్, సిల్క్, ఉత్పత్తులు, దుస్తులు, మసాలాలకు అధిక డిమాండ్ ఉంటుంది.

ప్రతి సంవత్సరం వాణిజ్య మేళాలో భారీ స్థాయిలో స్టాల్స్ ఏర్పాటుచేసే చైనా ఈసారి మేళా పట్ల అంత ఉత్సాహం చూపడం లేదు.  మేళాలో పాల్గొనే కంపెనీల సంఖ్యను బట్టి చూస్తే పాకిస్థాన్ అగ్రస్థానంలో ఉండగా దక్షిణాఫ్రికా, థాయ్‌లాండ్, కొరియా, అఫ్గానిస్తాన్ తరువాతి స్థానాలలో ఉన్నాయి. అంటే చైనా మొదటి ఐదు దేశాలలో కూడా లేదు. చైనా ఈసారి ఏడవ స్థానంలో ఉందని మేళా నిర్వహించే ఐఐటీఎఫ్ అధికారులు చెబుతున్నారు.

Advertisement
Advertisement