మరో ఏడాదిలో మెట్రో ఫేజ్1 పూర్తి | Sakshi
Sakshi News home page

మరో ఏడాదిలో మెట్రో ఫేజ్1 పూర్తి

Published Sat, Jun 21 2014 2:25 AM

Metro Phase 1 completion of another year

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
 
సాక్షి, బెంగళూరు : రానున్న ఏడాది సెప్టెంబర్ 15 లోపు నమ్మ మెట్రో ఫేజ్ 1 పనులు పూర్తి అవుతాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. 42.3 కిలోమీటర్ల పొడవైన ఈ నిర్మాణం కోసం మొత్తం రూ. 11,609 కోట్లు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. రాష్ర్ట రవాణ శాఖ మంత్రి రామలింగారెడ్డితో కలిసి విధానసౌధ, హైకోర్టు మధ్య జరుగుతున్న మెట్రో పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు.

అనంతరం కుమార కృప గెస్ట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ... ఇప్పటికే ఫేజ్ 1 పనులు పూర్తి కావాల్సి ఉందని, అయితే సొరంగ మార్గాల తవ్వకంలో ఏర్పడుతున్న ఇబ్బందుల వల్ల పనుల్లో జాప్యం చోటుచేసుకుంటోదని వివరించారు.72.05 కిలోమీటర్ల పొడవైన మెట్రో పేజ్ 2 పనులకు ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రం నుంచి అనుమతి లభించిందని గుర్తు చేశారు. పనులు ప్రారంభించిన ఐదేళ్లలోపు పూర్తి అవుతుందని తెలిపారు.

ఇందుకు మొత్తం రూ. 26,105 కోట్లు అవసరమవుతాయని అన్నారు. రాష్ర్టంలోని అన్ని అభివృద్ధి పనులకు స్థానిక ప్రభుత్వానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. ఇందులో ఎలాంటి రాజకీయాలకూ తావుండదని స్పష్టంచేశారు. ఎలక్ట్రానిక్ సిటీ వరకూ మెట్రో విస్తరణ వల్ల ట్రాఫిక్ సమస్య తీరుతుందని అన్నారు. అనంతరం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని భేటీ అయ్యేందుకు ఆయన వెళ్లారు.

ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ... మెట్రో ఫేజ్ 2 పనులకు అవసరమైన నిధుల కోసం పన్ను రహిత బాండ్‌లను వితరణ చేయాలని కేంద్ర ఆర్థిక శాఖను కోరనున్నట్లు చెప్పారు. ఈ విషయంగా తన వంతు సహకారం ఉంటుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు భరోసా ఇచ్చారని తెలిపారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement