‘మోనో’కు మరిన్ని పరీక్షలు! | Sakshi
Sakshi News home page

‘మోనో’కు మరిన్ని పరీక్షలు!

Published Wed, Aug 21 2013 2:29 AM

mono will face more problems in future

సాక్షి, ముంబై: మోనో రైలు మార్గం ప్రారంభమైతే ప్రయాణికులకు ఎదురయ్యే ఇబ్బందులను స్వయంగా తెలుసుకునేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మొదట మోనోరైలులో కొన్ని రోజుల పాటు రైల్వే సిబ్బందిని మాత్రమే అనుమతిస్తారు. వారు మామూలు ప్రయాణికుల మాదిరి స్టేషన్‌కు వస్తారు... భద్రతాపరమైన తనిఖీలు పూర్తిచేసుకుని ముందుకు వెళతారు... టికెట్లు తీసుకొని ప్లాట్‌ఫారంపైకి వెళతారు... రైలు రాగానే ఎక్కి తమకు ఇష్టమున్నచోట దిగుతారు... అక్కడ అందుబాటులో ఉన్న ఎస్కలేటర్‌ను వినియోగించి స్టేషన్ నుంచి బయటపడతారు. చెంబూర్-వడాల (9.8 కి.మీ.) మోనోరైలు మార్గంలో సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ దృశ్యం దర్శనమివ్వనుంది. మోనోైరె ళ్లు ప్రారంభమైన తర్వాత నిజంగా ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడతారు.. వాటిని వీరు స్వయంగా ప్రయాణించి అనుభవించి చూస్తారు. అనంతరం పరిష్కరించేందుకు కృషి చేస్తారు.
 
  అంతా సవ్యంగా జరిగితే అప్పడు ముంబైకర్ల కోసం ప్రారంభిస్తారు. ప్రస్తుతం మోనోరైళ్లకు అనేక రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. భద్రతాపరమైన (సేఫ్టీ సర్టిఫికెట్) పత్రం లభించేంతవరకు ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు వీలులేదు. దీంతో మోనోరైళ్లలో అమర్చిన వివిధ విద్యుత్ పరికరాలు ఎలా పనిచేస్తున్నాయి..? ఆటోమేటిక్ డోర్ల పనితీరు, అత్యవసర సమయంలో ప్రయాణికులను సురక్షితంగా బయటకు ఎలా పంపించాలి..? తదితరాలపై సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి ‘కమర్షియల్ ఆఫ్ ట్రయల్’ జరగనుంది. మోనోకు చెందిన ఎనిమిది స్టేషన్ల మీదుగా సంబంధిత రైల్వే సిబ్బంది, అధికారులు ఒక సాధారణ ప్రయాణికులుగా రాకపోకలు సాగించనున్నారు. ప్రయాణికుల దృష్ట్యా ఈ సదుపాయాలు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని ఈ అధికారులు పరిశీలిస్తారని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) ప్రతినిధి దిలీప్ కవట్కర్ చెప్పారు.
 
 ‘మోనోరైళ్లు ప్రారంభమైన తర్వాత ప్రయాణికులు రైలు ఎక్కుతారు.. దిగిపోతారు.. కాని హడావుడిలో సదుపాయాలు, ఎదురవుతున్న ఇబ్బందుల గురించి అంతగా ఎవరూ పట్టించుకోరు. దీంతో ప్రారంభానికి ముందే రైల్వే అధికారులు, సిబ్బంది స్వయంగా సమస్యలను గుర్తించి,  వెంటనే పరిష్కరించి ఆ తర్వాత ముహూర్తం ఖరారుచేసి ప్రజలకు అనుమతి కల్పిస్తార’ని కవట్కర్ అభిప్రాయపడ్డారు.
 

Advertisement
Advertisement