ఈశాన్య యువత ఓటు కీలకం | Sakshi
Sakshi News home page

ఈశాన్య యువత ఓటు కీలకం

Published Thu, Mar 13 2014 11:47 PM

north east voters will play key role in lok sabha elections

 తొలిసారిగా ఓటుహక్కు పొందిన ఈశాన్య యువత ఈ ఎన్నికల్లో అత్యంత కీలకపాత్ర పోషించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దేశరాజధానిలో జాతివివక్ష కారణంగా నలిగిపోయిన వీరంతా సంప్రదాయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలను తోసిరాజని తమకు అండదండగా నిలుస్తారని భావించేవారికే మద్దతు పలకాలని నిర్ణయించారు. పార్లమెంటులో తమ వాణిని బలంగా వినిపించగలిగిన నాయకులను ఎన్నుకోవాలనే ఆకాంక్ష వారిలో బలంగా ఉంది.
 

 న్యూఢిల్లీ: ఈసారి ఎన్నికల్లో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువతపాత్ర కీలకం కానుంది. వీరంతా తొలిసారిగా ఓటు వేయనున్నారు.  ఏడాదికిపైగా అందరి దృష్టీ వీరిపైనే ఉంది. ఇందుకు కారణమేదైనప్పటికీ ఈ ఎన్నికల్లో విభిన్నంగా వ్యవహరించాలని వారంతా నిర్ణయించుకున్నారు. అత్యంత విచారం కలిగించే విషయమేమిటంటే అంద రూ తమను ఎంతమాత్రం పట్టించుకోకపోవడమేనని వారంతా భావిస్తున్నారు. అయితే తమ వాణిని గట్టిగా వినిపించాలని, తమ నిరసనను తీవ్రస్థాయిలో తెలియజేయాలని వారంతా దృఢంగా నిర్ణయించుకున్నారు. ఎన్నికల సమయంలో స్వస్థలాలకు వెళ్లి తమ ఓటుహక్కును వినియోగించుకోవడంద్వారా నిరసన తెలియజేయాలనేదే వారి లక్ష్యంగా కనిపిస్తోంది.
 
 కొత్త పార్టీ ఆవిర్భవించాలి

 నగరంలోని హిందూ కళాశాలలో చదువుతున్న కృత్తిక చెట్రి ఈ విషయమై మాట్లాడుతూ తమ వాణిని వినిపించే ఓ పార్టీ ఆవిర్భవించాల్సిన అవసరం ఉందన్నారు. అభ్యర్థులు తమ సాధకబాధకాలను వినిపించేవారై ఉండాలన్నారు. తమకు అన్నివిధాలుగా అండదండగా నిలిచేవారు అవసర మన్నారు. అదేవిధంగా తామంతా ఒకే ఒక పార్టీకి మద్దతు పలకాల్సిన అవసరం కూడా ఉందన్నారు. అయితే దురదృష్టకరమైన విషయమేమిటంటే దేశంలోని రెండు ప్రధాన రాజకీయ పక్షాలు తమను ఎంతమాత్రం పట్టించుకోవడం లేదన్నారు.
 
 గట్టి నేతను ఎన్నుకోవాలి
 నాగాలాండ్‌కు చెందిన కెల్హోయిసిలీ పీయున్యు మా ట్లాడుతూ తమ సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చేంత సామర్థ్యం కలిగిన అభ్యర్థిని ఎన్నుకోవాల్సిన అవసరం తమకు ఉందన్నారు. గత కొంతకాలంగా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థులపై వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. తీవ్ర  జాతి వివక్షకు గురవుతున్నామనే విషయాన్ని ఈశాన్య రాష్ట్రీయులు గుర్తించాల్సిన తరుణమిదేనన్నారు. నిర్లక్ష్యం వహించిన కారణంగానే ఈ పరిస్థితి తలె త్తిందన్నారు. జాతి వివక్ష విషయంలో కఠినచట్టాలు ఉండాలని యువత కోరుకుంటోందన్నారు. ఇందుకోసమే ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువత ఈసా రి పెద్దసంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొననుంద న్నారు. ఎన్నో పర్యాయాలు ఆందోళనకు దిగామన్నారు.
 
 అండగా నిలిచేవారికే ఓటు
 ఇదే విషయమై మణిపూర్‌కు చెందిన కరోలిన్ మానిని మాట్లాడుతూ తమకు అండగా నిలిచావారికే తాను ఓటు వేస్తానని చెప్పింది. సిక్కింకు చెందిన ఉజ్వల్ పాండే మాట్లాడుతూ ఓటు వేయడం తన విద్యుక్త ధర్మమన్నాడు.
 
 ఇప్పుడు కనుక సరైన వ్యక్తిని ఎన్నుకోకపోతే వచ్చే ఐదు సంవత్సరాలపాటు తమ ప్రాంతంపై దాని ప్రభావం పడుతుందన్నాడు. ‘ఇది మా హక్కు. అందువల్ల దీనిని మేము కచ్చితంగా వినియోగించుకోవాల్సిందే. ఎందుచేతనంటే ఇది మా భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. జాతివివక్ష వ్యతిరేక చట్టాలను అమలులోకి తీసుకురాగల సత్తా కలిగిన ప్రభుతాన్ని ఎంచుకోవడం అత్యంత ముఖ్యం’ అని అన్నాడు. కేవలం విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించినంతమాత్రాన సరిపోదన్నాడు.
 
  బతుకుదెరువుకోసం ఇక్కడికి వచ్చే మహిళల పరిస్థితి ఏమిటన్నాడు. ఒకవేళ దేశరాజధాని నుంచి విడిచి స్వస్థలాలకు వెళ్లిపోయినా అక్కడ తమకు ఉపాధి అవకాశాలు ఉండబోవన్నాడు. విధిలేకనే ఇక్కడికి రావాల్సి వస్తోందన్నాడు. కాగా తమ సమస్యలను తమంతట తామే పరిష్కరించుకోకతప్పదని కొందరు అనుకుంటుండగా, ఓటుహక్కును వినియోగించుకుంటే పరిస్థితుల్లో కొంతమార్పు రావచ్చని, అదేవిధంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడొచ్చని మరికొందరు అనుకుంటున్నారు. తమ ప్రాంతంలో వైద్యసేవలు బాగా తక్కువని ఇంకొందరు భావిస్తున్నారు. ఇదే విషయమై అసోంకు చెందిన డాక్టర్ కుల్దీప్ స్వర్‌గైరీ మాట్లాడుతూ ‘మా ప్రాంతంలో ఆరోగ్య సేవలు అంతంతమాత్రమే. అందువల్ల దీనిపై మేమంతా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతోపాటు ఉపాధి అవకాశాలు కూడా చెప్పుకోదగ్గస్థాయిలో లేవు. వనరులను వినియోగించుకోగల సత్తా కలిగిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత మాపైనే ఉంది’ అని అన్నాడు.
 
 ఇదే సరైన సమయం
 సిక్కింకు చెందిన సుల్ట్రిమ్ నోర్బు మాట్లాడుతూ ‘ఇదే సరైన సమయం. ఇప్పుడు కనుక చేజారిపోతే మా సమస్యల్ని మేము ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి నెలకొంటుంది. పారదర్శకమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత మాపైనే ఉంది’ అని అన్నాడు. కాగా ఎన్నికల కమిషన్ గణాంకాల ప్రకారం 814 మిలియన్ల మంది 16వ లోక్‌సభకు ఓటువేయనున్నారు. రష్యా, అమెరికా, బ్రెజిల్, బంగ్లాదేశ్ జనాభాతో ఈ సంఖ్య సరిమానం. 2009 నాటి ఎన్నికలతో పోలిస్తే ఈ సంఖ్య ఈ పర్యాయం బాగానే పెరిగింది.
 
 మణిపురి యువతుల్ని వేధించిన ఇద్దరి అరెస్టు
 
 న్యూఢిల్లీ: మణిపురి యువతులను వేధించిన కేసులో ఐదునక్షత్రాల హోటల్ ఉద్యోగిసహా ఇద్దరు అరెస్టయ్యారు. వీరిరువురూ దక్షిణ ఢిల్లీలోని మహిపాల్‌పురి ప్రాంతానికి చెందినవారు. నిందితులను వికాస్ అలియాస్ విక్కీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన జానీగా గుర్తించారు. పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి.
 
  వికాస్...ఐదునక్షత్రాల హోటల్ ఉద్యోగి కాగా జానీ అతని బంధువు. ఇతడు నిరుద్యోగి. ఇద్దరు కలిసి ఓ కిరాయి గదెలో నివసిస్తున్నారు. వీరిరువురూ తరచూ కిటికీలు తెరిచి తమ గదిలోకి తొంగి తొంగి చూస్తుంటారని, అంతేకాకుండా తమను వేధిస్తున్నారని గుర్గావ్‌లోని ఓ షాపింగ్‌మాల్‌లో  పనిచేస్తున్న ఇద్దరు మణిపురి యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా కిటికీ కి ఓ రంధ్రం కూడా పెట్టారని బాధిత మహిళలు తమ ఫిర్యాదులో ఆరోపించారు. అంతేకాకుండా తరచూ తలుపు కొడతారని, తీసేలోగానే అక్కడినుంచి మాయమవుతుంటారని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.  బాధితుల ఫిర్యాదుమేరకు వసంత్‌కుంజ్ స్టేషన్‌కు చెందిన పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా నిందితులు వీడియో కెమెరా ద్వారా అభ్యంతరకర దృశ్యాలను నమోదుచేసి ఉండొచ్చని అనుమానిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
 

Advertisement
Advertisement