వాల్యుయేషన్ ఆరంభం | Sakshi
Sakshi News home page

వాల్యుయేషన్ ఆరంభం

Published Tue, Mar 17 2015 12:52 AM

వాల్యుయేషన్ ఆరంభం

 సాక్షి, చెన్నై: ప్లస్ టూ వాల్యుయేషన్(మూల్యాంకనం) సోమవారం ఆరంభమైంది. జవాబు పత్రాల్ని దిద్దడంలో కట్టుదిట్టమైన  ఆంక్షలు విధించారు. దీంతో అవకతవకలకు ఆస్కారం లేదని విద్యా శాఖ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 64 కేంద్రాల్లో ఈ వాల్యుయేషన్ ఈ నెలాఖరు వరకు జరగనుంది. ప్లస్‌టూ పబ్లిక్ పరీక్షలు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. ఈనెల ఐదో తేదీ పరీక్షలు ఆరంభమయ్యాయి. తమిళం ఒకటి, రెండు, ఆంగ్లం ఒకటి, రెండుతోపాటుగా లాంగ్వేజ్ సబ్జెక్టుల పరీక్షలు పూర్తయ్యాయి. కంప్యూటర్ సైన్స్, బయో కెమిస్ట్రీ, కామర్స్, భూగోళ శాస్త్రం పరీక్షలు ముగిశాయి. గణిత శాస్త్రం, ఫిజికల్ సైన్స్, గణాంక శాస్త్రం, కెమిస్ట్రీ, అకౌంటెన్సీ, పొలిటికల్ సైన్స్, అర్థశాస్త్రం, బయాలజీ, చరిత్ర పరీక్షలు జరగాల్సి ఉంది.
 
 అయితే, గతంలో మాదిరి కాకుండా ఈ సారి పరీక్షతోపాటుగా వాల్యుయేషన్ సాగే విధంగా విద్యా శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు ముగిసిన లాంగ్వేజ్ సబ్జెక్టుల మూల్యాంకనం తొలుత ముగించి, తదనంతరం వెనువెంటనే మిగిలిన పేపర్లను దిద్దేందుకు నిర్ణయించారు. సోమవారం నుంచి జవాబు పత్రాలను దిద్దే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వాప్తంగా 67 సెంటర్లను ఇందు కోసం ఏర్పాటు చేశారు. 24 వేల మంది ఉపాధ్యాయులు వాల్యుయేషన్ విధుల్లో దిగారు. ఈ సారి కట్టుదిట్టుమైన ఆంక్షల్ని విధించారు. జవాబు పత్రంలో విద్యార్థి కొట్టి రాయడం, దిద్దడం, తదితర చర్యలకు పాల్పడి ఉంటే, ఆ సమాధానాలను దిద్దే ప్రసక్తే లేదు.
 
  విద్యార్థుల జవాబు పత్రాలకు ప్రత్యేక కోడ్‌లను కేటాయించడంతో, అవి ఎవరివీ అన్నది ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్కరికీ తెలిసే ప్రసక్తే లేదు. ఇలాంటి ఆంక్షలు, నిబంధనలు అమల్లోకి తెచ్చిన దృష్ట్యా, వాల్యుయేషన్‌లో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేదని విద్యా శాఖ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈనెలాఖరులోపు ఇప్పటి వరకు జరిగిన పరీక్షల పేపర్లను పూర్తిగా దిద్దే విధంగా కార్యాచరణను సిద్ధం చేశారు. గత ఏడాది కంటే, ముందుగా ఈ ఏడాది ఏప్రిల్ చివరి వారం లేదా మే మొదటి వారంలో ఫలితాల్ని విడుదల చేయడం లక్ష్యంగా పరుగులు తీస్తున్నారు. చెన్నైలో అయితే, అన్నానగర్, కేకే నగర్, రాయపేట, వన్నార్ పేటల్లో వాల్యుయేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు పూర్తయిన పరీక్షల జవాబు పత్రాల వాల్యుయేషన్ ముగిసిన మరుసటి రోజు నుంచే తదుపరి పరీక్షల జవాబు పత్రాలను దిద్దే రీతిలో చర్యలు తీసుకోవటం విశేషం.
 
 ఉపాధ్యాయులకు శిక్షణ
 పళ్లిపట్టు : ప్లస్‌టూ ప్రశ్నాపత్రాల మూల్యంకనం సోమవారం నుంచి ప్రారంభమైంది. ఉపాధ్యాయులకు షరతులతో మూల్యాంకనం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్లస్‌టూ పబ్లిక్ పరీక్షలు మార్చి 3న ప్రారంభమయ్యాయి. శుక్రవారంతో పరీక్షలు పూర్తి కావడంతో మూల్యంకనం సోమవారం నుంచి ప్రారంభమైంది. కాంచీపురం జిల్లాలోని ఓ మెట్రిక్ పాఠశాలలో నిర్వహిస్తున్న మూల్యాంకనంలో పాల్గొన్న ఉపాధ్యాయులకు జిల్లా ఉన్నత విద్యాధికారి శాంతి అవగాహన కల్పించారు. ప్రధానంగా ఉపాధ్యాయులు మూల్యంకనం గదిలో మొబైల్ ఫోన్లు ఉపయోగించరాదని ఆంక్షలు విధించారు. నెల రోజుల పాటు మూల్యాంకనం చేపట్టనున్నట్లు వివరించారు.
 

Advertisement
Advertisement