ప్రగతి మైదాన్‌కు భారీ భద్రత | Sakshi
Sakshi News home page

ప్రగతి మైదాన్‌కు భారీ భద్రత

Published Fri, Aug 16 2013 3:44 AM

Pragati maidan to get armed commando security

న్యూఢిల్లీ: అనునిత్యం ప్రదర్శనలు, ప్రత్యేక కార్యక్రమాలతో రద్దీగా కనిపించే ప్రగతి మైదాన్ భద్రత కోసం కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం (సీఐఎస్‌ఎఫ్) ప్రత్యేక చర్యలు మొదలుపెట్టింది. ఇక్కడ పటిష్ట భద్రత కోసం 125 మంది జవాన్ల బృందాన్ని నియమించనుంది. ప్రగతి మైదాన్‌లో నిర్వహించే కార్యక్రమాలకు భద్రతాపరమైన ముప్పు ఉందనే హెచ్చరికలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ భద్రత కల్పన కోసం కేంద్ర హోంశాఖ విధివిధానాలను రూపొందిస్తున్నప్పటికీ.. వేదికల వద్ద విధుల నిర్వహణ కోసం ఢిల్లీ పోలీసులతో సమన్వయం నెరుపుతామని సీఐఎస్‌ఎఫ్ ఉన్నతాధికారి ఒకరు అన్నారు. ప్రగతి మైదాన్‌కు సాయుధ భద్రత కల్పించడం ఇదే తొలిసారి. 
 
 వచ్చే నెల వరకు 125 మంది సీఐఎస్‌ఎఫ్ జవాన్ల బృందాన్ని పంపిస్తామని ఈ శాఖ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల అధీనంలో పనిచేసే భారత వాణిజ్య ప్రోత్సాహక సంస్థ సూచన మేరకు హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రదర్శనలు, ప్రత్యేక కార్యక్రమాల ద్వారా మనదేశ వాణిజ్య సంస్థల సత్తాను అంతర్జాతీయంగా చాటిచెప్పడానికి ఈ సంస్థ కృషి చేస్తుంది. 124 ఎకరాల్లో విస్తరించి ఉన్న ప్రగతి మైదాన్‌లో 61,290 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 16 హాళ్లు ఉన్నాయి. మరో 10 వేల చదరపు మీటర్ల సువిశాల ప్రదర్శనప్రాంతం కూడా ఉంది. దీనికి సీఐఎస్‌ఎఫ్ 24 గంటల భద్రత కల్పిస్తోంది. ఏవైనా సంక్షోభ పరిస్థితులు తలెత్తితే దీనికి కూడా ఇబ్బందులు ఏర్పడుతాయి కాబట్టి గట్టి భద్రతను ఏర్పాటు చేయాలని భారత వాణిజ్య ప్రోత్సాహక సంస్థ సీఎండీ రీటా మీనన్ గతంలోనే ప్రభుత్వాన్ని కోరారు. 
 
 ‘వ్యాపారులు, విక్రేతలు, సందర్శకుల భద్రతకు మాకు అత్యంత కీలకం. విపత్కర పరిస్థితుల నుంచి కాపాడగల పూర్తిస్థాయి భద్రత వ్యవస్థ మాకు అవసరం’ అని ఆమె అన్నారు. ఆటో, పుస్తకాలు, వాణిజ్య ప్రదర్శనల సమయంలో ఇక్కడికి వేల సంఖ్యలో సందర్శకులు వస్తుండడం తెలిసిందే. ప్రతినిత్యం ఇక్కడ ఏదో ఓ కార్యక్రమం జరుగుతుండడంతో భద్రత కల్పన కీలకంగా మారింది. ఉగ్రవాదుల నుంచి ఏదైనా ముప్పు ఎదురైతే సమర్థంగా ఎదుర్కోవడానికి వీలుగా సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది బృందానికి అత్యాధునిక ఆయుధాలతో కూడిన వాహనాన్ని కూడా అందజేస్తారు. మరో బృందం నిరంతరం ఇక్కడి భద్రతా పరిస్థితిని పరిశీలిస్తుంది. ఎక్స్‌రే బ్యాగేజ్ స్కానర్లు, మెటల్ డిటెక్టర్లు అమర్చాల్సిన ప్రాంతాలు, సిబ్బంది బ్యారక్‌లు నిర్మించాల్సిన స్థలాలను అధికారులు ఇప్పటికే గుర్తించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement