ఇదంతా ఆయన వల్లే! | Sakshi
Sakshi News home page

ఇదంతా ఆయన వల్లే!

Published Fri, Sep 11 2015 2:50 AM

ఇదంతా  ఆయన వల్లే!

 నటి రాధిక ఆప్తే ఒక్క సారిగా సెలబ్రిటీ నటి అయిపోయారు. కారణం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందరికీ తెలిసిందే. ఈ ఉత్తరాది భామకు సూపర్‌స్టార్‌తో కబాలి చిత్రంలో జతకట్టే అదృష్టం వరించింది. తొలి రోజుల్లో హిందీ, బెంగాలి, మరాఠి చిత్రాల్లో నటించిన రాధిక ఆప్తే ఇప్పుడు కోలీవుడ్ చిత్రాలపైనే అధిక శ్రద్ధ చూపిస్తున్నారు. ఆ మధ్య తెలుగులో బాలక్రిష్ణ సరసన లెజెండ్, లయన్ చిత్రాల్లో నటించారు. రాధిక ఆప్తేకు పెళ్లి అయిన విషయం చాలా మందికి తెలియదు. ఢిల్లీకి చెందిన బెనడిక్ టెయిలర్‌ను ప్రేమించి పెళ్లాడారు.
 
  అయినా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో నటించే అవకాశం కొట్టేయడం టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా మారింది.దక్షిణాదిలో ఎందరో ప్రముఖ నటీమణులు రజనీకాంత్‌తో నటించే అవకాశం కోసం ఆశగా ఎదురు చూస్తుండగా పెళ్లి అయిన రాధిక ఆప్తేకు అలాంటి సూపర్ అవకాశం రావడం నిజంగా ఆమె లక్కే. అయితే దీని కంతటికీ ఒకే ఒక్క వ్యక్తి కారణం అని రాధిక ఆప్తే భావిస్తున్నారు. ఆయనేవరో కాదు ఆమెను కోలీవుడ్‌కు పరిచయం చేసిన నటుడు ప్రకాశ్‌రాజే కారణం అంటున్నారామె.

 అనడమే కాదు ఢిల్లీలో ఉన్న ప్రకాశ్‌రాజ్‌ను స్వయంగా కలిసి నా ఈ స్థాయికి కారణం మీరే అంటూ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఉత్తరాది చిత్రాలతోనే ముగిసిపోతుందనుకున్న నా సినీ జీవితాన్ని దక్షిణాదికి విస్తరింపజేసింది మీరే. ఇప్పుడు రజనీకాంత్ సరసన నటించే స్థాయికి ఎదిగానంటే కారణం మీరే అని రాధిక ఆప్తే అంటుంటే ప్రకాశ్‌రాజ్ మనసు సంతోషంతో పులకరించి పోయిందట. ప్రకాశ్‌రాజ్ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన ధోని చిత్రం ద్వారా రాధిక ఆప్తే తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారన్నది గమనార్హం.

Advertisement
Advertisement