Sakshi News home page

ఘనంగా రాఖీ పౌర్ణమి

Published Thu, Aug 22 2013 3:26 AM

Rakhi gloriously full moon

బళ్లారి అర్బన్/చిత్రదుర్గం, న్యూస్‌లైన్ : అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి వేడుకలు బుధవారం బళ్లారి నగరంలో ఘనంగా  జరిగాయి. పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్లిన చెల్లెళ్లు అన్నలకు, తమ్ముళ్లకు రాఖీలు కట్టి ఈ బంధం జన్మజన్మలు కొనసాగాలని ఆశీర్వాదం పొందారు.  నగరంలోని వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థినీలు విద్యార్థులకు రాఖీలు కట్టి తిలకం దిద్ది మిఠాయిలను ఇచ్చి రాఖీ వేడుకలను జరుపుకున్నారు.

మరికొందరు రాఖీ కట్టిన అక్కాచెల్లెళ్లకు చీరలు ఇచ్చి ఒడి బియ్యం పోసి సంతోషంగా ఉండాలని దీవించారు.   చిన్నారులు కూడా ఒక రికొక్కరు రాఖీని కట్టుకొని తమ అనుబంధాన్ని చాటారు. నగరంలో సంతోషిమాత ఆలయంలో, కోట ప్రాంతంలోనిసంతోషిమాత ఆలయంలో రాఖీపౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ పూజలు చేశారు. పంచామృతాభిషేకం, కుంకుమ అర్చన, మహామంగళ హారతి, అన్నదానం నిర్వహించారు.

సాయంత్రం 108 హారతులు వెలిగించి పూజలు నిర్వహించారు. అనంతరం ఊయల సేవ, రథోత్సవం, భజన, సంగీత కార్యక్రమం తదితర పూజలను నిర్వహించారు. చిత్రదుర్గం నగరంలో పార్శనాథ పాఠశాలలో విద్యార్థులు రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు పరస్పరం రాఖీలు కట్టుకుని సోదర భావాన్ని పెంపొందించుకునే విధంగా అధ్యాపకులు ప్రోత్సహించారు.
 

Advertisement

What’s your opinion

Advertisement