ఒకటిలోగా పోస్టుమార్టం నిర్వహించండి | Sakshi
Sakshi News home page

ఒకటిలోగా పోస్టుమార్టం నిర్వహించండి

Published Sun, Sep 25 2016 2:12 AM

ఒకటిలోగా పోస్టుమార్టం నిర్వహించండి

 టీనగర్: స్వాతి హత్య కేసులో నిందితుడు రామ్‌కుమార్ మృతదేహం పోస్టుమార్టం అక్టోబరు ఒకటవ తేదీలోగా నిర్వహించి, ఈనెల 30వ తేదీ వరకు మృతదేహాన్ని భద్రపరచాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. స్వాతి హత్య కేసులో అరెస్టయి పుళల్ జైల్లో ఉంచిన రామ్‌కుమార్  ఈనెల 18న విద్యుత్ వైరును కొరికి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్న విషయం తెలిసిందే.
 
 అతని మృతదేహానికి ఆరు రోజులుగా పోస్టుమార్టం నిర్వహించకుండా రాయపేట ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. ఇలావుండగా రామ్‌కుమార్ మృతిపై అనుమానం ఉన్నట్లు, పోస్టుమార్టంలో తమ తరఫు వైద్యుని అనుమంతించాలని కోరుతూ రామ్‌కుమార్ తండ్రి పరమశివన్ దాఖలు చేసిన కేసులో ముగ్గురు న్యాయమూర్తులు విభిన్నంగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఉత్తర్వుల్లో పోస్టుమార్టంకు నలుగురు ప్రభుత్వ వైద్యులు, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఒకరిని నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు.
 
  ఇందులో రామ్‌కుమార్ తండ్రి తరఫు కోర్కెను ముగ్గురు న్యాయమూర్తుల తీర్పులో నెరవేరని కారణంగా శుక్రవారం ఐదుగురు న్యాయమూర్తులు ఈ కేసును విచారించాలని కోరుతూ ప్రధాన న్యాయమూర్తికి విన్నవించారు. ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు న్యాయమూర్తుల ఉత్తర్వుల తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సూచించారు. అంతవరకు పోస్టుమార్టంను నిలిపివేయాలని రామ్‌కుమార్ తరఫు వాదనను ముందుంచారు. దీనికి ప్రధాన న్యాయమూర్తి బదులిస్తూ ఇదివరకే కేసులో ఉత్తర్వులు జారీ చేసిన న్యాయమూర్తులను సంప్రదించాల్సిందిగా సూచించారు. దీంతో రామ్‌కుమార్ తండ్రి తరషు లాయర్లు న్యాయమూర్తి కృపాకరన్‌కు అప్పీల్ చేశారు.
 
 ఆ సమయంలో రామ్‌కుమార్ తరఫున ఎయిమ్స్ ఆస్పత్రి వైద్యులపై నమ్మకం లేదని తెలిపారు. అందుకు న్యాయమూర్తి అనేక కేసుల్లో ఎయిమ్స్ వైద్యులు వాస్తవాలను వెలుగులోకి తెచ్చిన విషయం మరువలేమని తెలిపారు. అనంతరం ఆయన జోక్యం చేసుకుంటూ ఈ కేసులో రాజకీయ పక్షాలు తలదూర్చుతున్నాయని, ఇది దురదృష్టకరమని పేర్కొన్నారు. అనంతరం రామ్‌కుమార్ తండ్రి వద్ద అభిప్రాయాన్ని సేకరించేందుకు పిలిపించారు. అందుకు శంకరసుబ్బు తమరు అతని కోసమే వాదిస్తున్నట్లు తెలిపారు. దీనిపై ప్రభుత్వం తరఫున ఏ సమాధానం ఇస్తున్నారని ప్రశ్నించారు.
 
 అందుకు ప్రభుత్వ న్యాయవాది బదులిస్తూ రాయపేట ప్రభుత్వ ఆస్పత్రిలో రామ్‌కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం చేయనందున మిగతా పోస్టుమార్టం పనులు స్తంభించిపోయినట్లు పేర్కొన్నారు. ఇదివరకే రామ్‌కుమార్ తండ్రి తరపు ప్రధాన న్యాయమూర్తిని అభ్యర్థించడాన్ని, అందుకాయన సుప్రీంకోర్టును సంప్రదించాల్సిందిగా సూచించినట్లు పేర్కొన్నారు. దీన్ని విన్న న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తిని కలిసి తన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు తెలిపారు. తర్వాత ఆయన ప్రధాన న్యాయమూర్తితో సమాలోచన జరిపిన రామ్‌కుమార్ మృతదేహాన్ని ఈ నెల 30వ తేదీ వరకు మార్చురీలో భద్రపరచాలని, అక్టోబర్ ఒకటవ తేదీలోగా  పోస్టుమార్టం చేయాలని ఉత్తర్వులిచ్చారు.
 

Advertisement
Advertisement