రూ. 2.32 కోట్ల చోరీ సొత్తు స్వాధీనం | Sakshi
Sakshi News home page

రూ. 2.32 కోట్ల చోరీ సొత్తు స్వాధీనం

Published Sun, Jul 27 2014 2:34 AM

రూ. 2.32 కోట్ల చోరీ సొత్తు స్వాధీనం - Sakshi

  • కార్లు అపహరిస్తున్న తమిళనాడు నివాసి అరెస్టు
  •  దొంగనోట్లు చలామణి కేసులో మరో ఇద్దరు అసోం వాసులు
  •  నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి
  • బెంగళూరు : బెంగళూరు ఆగ్నేయ విభాగం పోలీసులు 46 కేసులు దర్యాప్తు చేసి 18 మంది నిందితులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 2.32 కోట్ల విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నామని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి చెప్పారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తమిళనాడులోని మధురైకి చెందిన పరమేశ్వర్ అలియాస్ స్కార్పియో పరమేశ్వర్ అనే నిందితుడిని అరెస్టు చేసి రూ.1.50 కోట్ల విలువైన 14 మారుతి షిఫ్ట్ కార్లు, నాలుగు మారుతి డిజైర్ కార్లు, ఒక స్కార్పియో కారు స్వాధీనం చేసుకున్నారు.

    నిందితుడు బెంగళూరు చేరుకుని పార్కింగ్ స్థలాల్లో ఉన్న కార్ల వెనుక అద్దాలు పగల గొట్టి వాహనాలను అపహరించుకుని పోయేవాడు. ఈ విధంగా అపహరించిన వాహనాలకు నకిలీ ఆర్సీలు సృష్టించి తమిళనాడులో విక్రయించి వచ్చిన డబ్బుతో జల్సా చేసేవాడు. మరో కేసులో ఇక్కడి బీటీఎం లేఔట్‌లో నివాసం ఉంటున్న పిలాకల్ నజీర్ అనే నిందితుడిని ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు అరెస్టు చేశారు. ఇతని వద్ద నుంచి రూ. 30 లక్షల విలువైన ఆర్డీ-క్యూ అనే విలాసవంతమైన కారు స్వాధీనం చేసుకున్నారు.

    కొన్ని రోజుల క్రితం ఇదే కారులో నిందితుడు వాయువేగంతో ప్రయాణించడంతో పోలీసులు అడ్డుకుని ఆర్సీలు పరిశీలించగా తస్కరించిన కారుగా పోలీసులు గుర్తించారు. ఇక నాగ నాథపురంలో నివాసం ఉంటున్న గురుప్రసాద్, మంజునాథ్, సురేష్ అనే నిందితులను అరెస్టు చేసి టాటా సుమోవాహనం స్వాధీనం చేసుకున్నారు.

    గతనెల 18న నిందితులు ఇక్కడి రేడియెంటల్ క్యాష్ మేనేజ్‌మెంట్‌కు చెందిన వాహనం అపహరించుకుని పోయారు. మరోకేసులో తమిళనాడులోని తిరువుణ్ణామలైకు చెందిన శంకర్ అనే నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి తొమ్మిది ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఇక నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న అసోకు చెందిన అక్బర్ హుస్సేన్, నజీర్ రెహమాన్ అనే నిందితులను ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు అరెస్టు చేశారు.
     
    అదే విధంగా వివిధ కేసుల్లో 24 కార్లతో పాటు ఆరు బైక్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నామని ఎం.ఎన్. రెడ్డి చెప్పారు. సమావేశంలో అడిషనల్ పోలీసు కమిషనర్ శరత్‌చంద్ర, డీసీపీ పవార్ తదితరులు పాల్గొన్నారు.
     

Advertisement
Advertisement