ఎఫ్‌వైయూపీని రద్దు చేయండి | Sakshi
Sakshi News home page

ఎఫ్‌వైయూపీని రద్దు చేయండి

Published Sat, Jun 21 2014 10:25 PM

Scrap FYUP immediately, it violates 10+2+3 format: UGC to Delhi University

న్యూఢిల్లీ: నాలుగేళ్ల అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్‌వైయూపీ)ని రద్దు చేయాలంటూ ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ)ను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశించింది. ఈ విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని వీసీ ఇటీవల యూజీసీకి ఓ లేఖ రాసిన సంగతి విదితమే. అయినప్పటికీ అదేమీ పట్టించుకోకుండా యూజీసీ పైవిధంగా ఆదేశించింది. ఈ మేరకు వీసీకి శనివారం ఓ ఇ-మెయిల్ పంపింది. ఈ విషయాన్ని డీయూ అధికారులు తెలియజేశారు. అయితే ఈ కోర్సును వ్యతిరేకిస్తున్న అధ్యాపకులు మాత్రం వైస్ చాన్సలర్ మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా ఎఫ్‌వైయూపీపై త్వరలో జరగనున్న  విద్యామండలి సమావేశానికి హాజరవ్వాలని, ఈ అంశంపై అక్కడ చర్చించాలంటూ సభ్యులను ఆదేశించారన్నారు. తనకు అందిన ఇ-మెయిల్ ప్రతిని సభ్యులకు చూపేందుకు కూడా వీసీ ఇష్టపడలేదని ఆరోపించారు.
 
 కాగా వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా తొందరపడి ఓ నిర్ణయం తీసుకున్నారంటూ యూజీసీతో వీసీ వాదించినట్టు అధ్యాపకులు చెబుతున్నారు. కాగా ఈ నెల 13వ తేదీన జరిగిన సమావేశంలో  నాలుగేళ్ల అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్‌వైయూపీ)ను సమీక్షించాలంటూ డీయూని ఆదేశించిన సంగతి విదితమే. 10+2+3 ప్యాటర్న్‌కు ఇది వ్యతిరేకమని యూజీసీ అభిప్రాయపడింది. ఇందుకు డీయూ స్పందిస్తూ విశ్వవిద్యాలయం ఆర్డినెన్స్‌ను సవరించిన తర్వాతే ఈ కోర్సును అమలు చేశామని తెలియజేసింది. మరోవైపు ఈ కోర్సు రద్దు కోసం ఢిల్లీ విశ్వవిద్యాలయం అధ్యాపకుల సంఘం (డ్యూటా)తోపాటు ఎన్‌ఎస్‌యూఐ, ఏబీవీపీ, ఏఐడీఎస్‌ఓ, ఏఐఎస్‌ఏ, ఏఐఎస్‌ఎఫ్, సీవైఎస్‌ఎస్, డీఎస్‌యూ, ఐఎన్‌ఎస్‌ఓ, కేవైఎస్, ఎన్‌ఈఎఫ్‌ఐఎస్, పచ్చాస్, ఎస్‌ఎఫ్‌ఐ, ఎస్‌వైఎస్ తదితర సంఘాలు ఏడాదికాలంగా అనేక పర్యాయాలు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించిన సంగతి విదితమే.
 
 విద్యార్థులకు గాయాలు: నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్‌వైయూపీ)కు వ్యతిరేకంగా శనివారం ఆందోళనకు ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసులు నీటి ఫిరంగులను ప్రయోగించడంతో వారిలో అనేకమంది గాయపడ్డారు. వైస్‌చాన్స్‌లర్ నివాసాన్ని ముట్టడించేందుకువీరంతా ఆయన నివాసం వద్దకు వచ్చారు. అక్కడ ఉన్న బారికేడ్లను దాటిముందుకు పోయేందుకు యత్నించడంతో పోలీసులు నీటి ఫిరంగులను వారిపై ప్రయోగించారు.
 
 ఏబీవీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో దాదాపు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. బారికేడ్లను దాటుతుండగా పోలీసులు నీటి ఫిరంగులను ప్రయోగించారు. అనంతరం కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై ఏబీవీపీ ఢిల్లీ శాఖ కార్యదర్శి సాకేత్ బహుగుణ మాట్లాడుతూ డీయూ పరిపాలన విభాగం ఆదేశాల మేరకే పోలీసులు ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎఫ్‌వైయూపీని రద్దు చేయాలంటూ వీసీని యూజీసీ ఆదే శించిందని, అయిన ప్పటికీ ఆయన పట్టించుకోకపోవడమేమిటని ప్రశ్నించారు. కాగా ఈ దాడిని ఢిల్లీ విశ్వవిద్యాలయ అధ్యాపకుల సంఘం (డ్యూటా) ఖండించింది. మరోవైపు ఈ కోర్సుకు గతకొంతకాలంగా ఉద్యమిస్తున్న ఎన్‌ఎస్‌యూఐ సభ్యులపైనా శనివారం పోలీసులు దాడిచేశారు. ఈ ఘటనలోనూ కొంతమంది గాయపడ్డారు. ఈ దాడిని ఎన్‌ఎస్‌యూఐ ఖండించింది. దీనిని ఫాసిస్టు చర్యగా అభివర్ణించింది.
 

Advertisement
Advertisement