తిరిగి విధుల్లోకి తీసుకోండి | Sakshi
Sakshi News home page

తిరిగి విధుల్లోకి తీసుకోండి

Published Sat, May 31 2014 10:58 PM

Smriti Irani Requests Delhi University to Reinstate Officials Suspended for Leaking Her Documents

 సాక్షి, న్యూఢిల్లీ :తన విద్యార్హతలకు సంబంధించిన పత్రాలను లీక్ చేసినందుకు సస్పెండ్‌చేసిన సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) వైస్ చాన్సలర్‌ని కోరారు. కాగా గత సంవత్సరం బీఏ పొలిటికల్ సైన్స్ కోర్సులో స్మృతి ఇరానీ ప్రవేశం పొందారని, అయితే ఇటీవల జరిగిన పరీక్షకు ఆమె హాజరుకాలేదంటూ ఓ హిందీ దినపత్రిక ఆమె హాల్ టికెట్‌తో సహా ప్రచురించింది. ఈ నేపథ్యంలో సదరు హాల్ టికెట్ బయటకు  వచ్చేందుకు దినపత్రికకు సహకరించిన ఐదుగురు సిబ్బందిని డీయూ సస్పెండ్  చేసింది.  వీరిలో బోధనేతర సిబ్బంది, సెక్షన్ అధికారి, ఆ దిగువ హో దా కలిగిన ఉద్యోగులని డీయూ తెలిపింది. కాగా గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని బయటపెట్టింది తామేనంటూవారంతా అంగీకరించారు. అయినప్పటికీ వారి సస్పెన్షన్‌ను ఉపసంహరించుకోవాలని స్మృతి విన్నవించారు. ‘ఢిల్లీ విశ్వవిద్యాలయం ఓ స్వతంత్ర సంస్థ. అందువల్లనే ఉద్యోగుల సస్పెన్షన్‌ను రద్దు చేయాలని యూనివర్సిటీ వైస్‌చాన్సలర్‌ను నేనే వ్యక్తిగతంగా కోరాను’ అని ఆమె ట్వీట్ చేశారు. ప్రజా జీవనంలో ఉన్నవారు ఎలాంటి తనిఖీలు, విమర్శలకైనా సిద్ధంగా ఉండాలన్నారు. అందుకు తాను కూడా సిద్ధమేనన్నారు.
 
 సస్పెన్షన్ ఉత్త్వర్వులు జారీ చేయలేదు
 పత్రాల లీకేజీ పాల్పడిన ఐదుగురు ఉద్యోగులకు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయలేదని ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) వైస్ చాన్సలర్ దినేశ్ సింగ్ స్పష్టం చేశారు. సదరు ఉద్యోగులను సస్పెండ్ చేయొద్దంటూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ట్విటర్‌లో పేర్కొన్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.  
 

Advertisement
Advertisement