Sakshi News home page

నేడు రాష్ట్ర అవతరణ దినోత్సవం

Published Thu, Apr 30 2015 10:50 PM

State formation day arrangements being completed

- నేటితో 55 ఏళ్లు పూర్తి.. వేడుకలకు అన్నీ సిద్ధం
- రాష్ట్రవ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలకు ఏర్పాట్లు
- మూడోసారి ఉత్సవాలు జరుపుతున్న కాషాయ కూటమి
సాక్షి, ముంబై:
రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. శుక్రవారం దాదర్ శివాజీ పార్క్‌లో ప్రత్యేక కార్యక్రమాలు, పోలీసు పరేడ్‌లను అధికారులు నిర్వహించనున్నారు. ప్రభుత్వం, రాజకీయపార్టీలు, స్వచ్ఛంద సంస్థలు ఉచిత వైద్య, రక్తదాన శిబిరాలు తదితరాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాయి. 1960లో మహారాష్ట్ర అవతరణ తర్వాత ఉత్సవాలను జరిపే అవకాశం కాషాయ కూటమికి కేవలం రెండు సార్లు మాత్రమే దక్కింది. 1995, 1999లో ముఖ్యమంత్రి మనోహర్ జోషీ, ఉప ముఖ్యమంత్రి, దివంగత గోపీనాథ్ ముండే నేతృత్వంలో ఈ ఉత్సవాలు జరిగాయి. మళ్లీ సుమారు 16 ఏళ్ల తర్వాత ఆ అవకాశం దక్కింది. సంయుక్త మహారాష్ట్ర కోసం ఎంతో మంది స్వాతంత్య్ర సమరయోధులు తమ ప్రాణాలను అర్పించారు. వారి త్యాగఫలంతో 1960 మే ఒకటో తేదీ మహారాష్ట్ర అవతరించింది. నేటితో 55 ఏళ్లు పూర్తి కానున్నాయి. దేశంలో అన్ని రంగాల్లో అగ్రగామిగా రాష్ట్రం నిలుస్తోంది. ఈ సందర్భంగా సంయుక్త మహారాష్ట్ర గురంచి కొన్ని వివరాలు తెలుసుకుందాం..

1938 నుంచి పోరాటం..
సంయుక్త మహారాష్ట్ర పోరాటం 1938లో ప్రారంభమైంది. అయితే ఆంధ్ర రాష్ట్ర అవతరణ అనంతరం 1955 నుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం తీవ్రతరమైంది. బాంబే రాష్ట్రంతో పాటు వర్హాడ్, నాగ్‌పూర్ తదితర ప్రాంతాల్లో మరాఠీ మాట్లాడే ప్రాంతాలన్ని ఒక్కటి చే సి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 105 మంది బలిదానాల తర్వాత ఎట్టకేలకు 1960 మే ఒకటవ తేదీ మహారాష్ట్ర అవతరించింది. ఈ పోరాటంలో ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుగువారి పాత్ర కూడా ఉండడం విశేషం. అమరవీరుల స్మృతి చిహ్నంగా ఫోర్ట్ ప్రాంతంలో స్తూపాన్ని నెలకొల్పారు. ఆ ప్రాంతానికి హుతాత్మ (అమరవీరుల) చౌక్‌గా నామకరణం చేశారు. రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన చాలా మంది అమరుల కుటుంబీకుల వివరాలు రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేవని తెలిసింది.

ముగ్గురు తెలుగు వీరులు...?
సమైక్య మహారాష్ట్ర కోసం ప్రాణాలను అర్పించిన 105 మంది అమరుల్లో ముగ్గురు తెలుగు వ్యక్తులున్నట్లు సమాచారం. వీరిలో ఇద్దరి పేర్లు బాలయ్య, ముత్తన్న అని తెలిసింది. మరో తెలుగు వ్యక్తి కూడా ఉన్నట్లు భావిస్తున్నారు.

తొలి స్పీకర్‌గా తెలుగు వ్యక్తి...
సంయుక్త మహారాష్ట్ర ఏర్పాటు కోసం తెలుగు ప్రజలు కూడా తమ వంతు సహాయ సహకారాలని అందించారు. రాష్ట్ర అవతరించిన అనంతరం 1960 మే ఒకటో తేదీ మధ్యాహ్నం నూతన మంత్రి మండ లి ఏర్పాటైంది. రాష్ట్రానికి తొలి స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టే గౌరవం తెలుగు వ్యక్తి అయిన సీలం సయాజీరావ్‌కు దక్కింది.
 

కొన్ని ముఖ్యమైన వివరాలు...
- రాష్ట్ర విస్తీర్ణం 3,07,670 చదరపు కిలోమీటర్లు.
- రాజధాని ముంబై.
- జిల్లాల సంఖ్య 37.
- పట్టణాలు 378.
- ఙ్ట్చఛగ్రామాలు 43723.
- ప్రముఖ నగరాలు: ముంబై, నాగపూర్, పుణే, ఔరంగాబాద్, థానే, కోల్హాపూర్, షోలాపూర్, నాసిక్.
- ప్రముఖ విమానాశ్రయాలు ముంబై, నాగపూర్, పుణే, ఔరంగాబాద్.
- 2011 లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 11.23 కోట్లు
- 1,10,54,131 మందితో దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన థానే జిల్లాను గత ఏడాది పాల్ఘర్, థానే అనే రెండు జిల్లాలుగా విభజించారు.

Advertisement

What’s your opinion

Advertisement