స్పీకర్ అభిప్రాయం అమలుపై స్టే | Sakshi
Sakshi News home page

స్పీకర్ అభిప్రాయం అమలుపై స్టే

Published Wed, Feb 19 2014 11:51 PM

stay in high court on speaker decision

 సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బిహ ష్కృతుడైనప్పటికీ వినోద్‌కుమార్ బిన్నీ విధానసభలో ఆ పార్టీ విప్‌కు అనుగుణంగానే ఓటు వేయాలని ఆదేశిస్తూ స్పీకర్ వెలిబుబచ్చిన అభిప్రాయం అమలుపై  ఢిల్లీ హైకోర్టు  బుధవారం స్టే విధించింది. న్యాయమూర్తి మన్మోహన్ 2010లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ వినోద్‌కుమార్ బిన్నీని స్వతంత్ర ఎమ్మెల్యేగా పరిగణించొచ్చని పేర్కొన్నారు. సమాజ్‌వాదీ పార్టీ నుంచి బహిష్కృతులైన  అమర్‌సింగ్, జయప్రద పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయొద్దని, వారిని స్వతంత్ర సభ్యులుగా పరిగణించాలని అత్యున్నత న్యాయస్థానం గతంలో అభిప్రాయపడిన విషయాన్ని ఈ సందర్భంగా న్యాయమూర్తి మన్మోహన్ ప్రస్తావించారు. అసెంబ్లీ స్పీకర్ జారీ చేసిన లేఖ అమలుపై సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగానే స్టే విధిస్తున్నట్లు ప్రకటించారు.
 
 బిన్నీ బహిష్కరణపై న్యాయస్థానం ఆమ్ ఆద్మీ పార్టీతోపాటు అసెంబ్లీ స్పీకర్ ఎం.ఎస్.ధీర్‌కు నోటీసులు జారీచేశారు. ఈ కేసుపై తదుపరి విచారణ వచ్చే నెల నాలుగో తేదీకి వాయిదావేశారు. తనను స్వతంత్ర సభ్యుడిగా ప్రకటించాలని కోరుతూ బిన్నీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విధానసభలో గత నెల 12, 13 తేదీలలో ఆమ్ ఆద్మీ పార్టీ తనకు విప్ జారీచేయడాన్ని కూడా ఆయన సవాలుచేశారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురైనప్పటికీ విప్‌ను పాటించాలంటూ స్పీకర్ తనను ఆదేశించారని అందులో పేర్కొన్నారు. ఇది పక్షపాతంతో కూడిన నిర్ణయమని, స్పీకర్ ఆప్‌తో కుమ్మక్కయ్యారని బిన్నీ ఆరోపించారు.

Advertisement
Advertisement