ఎందుకో..ఏమో..! | Sakshi
Sakshi News home page

ఎందుకో..ఏమో..!

Published Wed, Apr 18 2018 10:43 AM

Telangana CM  Meets Orissa CM Naveen Patnaik About Third Front - Sakshi

భువనేశ్వర్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,  కల్వకుంట్ల చంద్ర శేఖర రావు ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి, బిజూ జనతా దళ్‌ అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌తో త్వరలో భేటీ కానున్నారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు మే నెల తొలి వారంలో భేటీ అయ్యేందుకు కార్యక్రమం ఖరారైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్ర పర్యటనకు విచ్చేసే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర రావు తొలుత ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథుని దర్శించుకుంటారు. అనంతరం ఆయన నవీన్‌ పట్నాయక్‌తో భేటీ అవుతారు.

2019వ సంవత్సరంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని ప్రాంతీయ పార్టీల వ్యూహాత్మక కార్యాచరణ నేపథ్యంలో వీరిద్దరూ భేటీకి ఉత్సాహం కనబరుస్తున్నారు. ఉభయ బిజూ జనతా దళ్, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల నుంచి దూరంగా ఉంటున్నాయి. భావి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెసేతర వర్గాలు కూటమిగా ఆవిర్భవించి పోటీ చేయాలనే యోచనతో దేశంలోని పలు రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల ప్రముఖులు ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో తరచూ భేటీ అవుతున్నారు.

లోగడ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర రావు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో గత నెలలో భేటీ అయ్యారు. 2019వ సంవత్సరపు సార్వత్రిక ఎన్నికల్లో తృతీయ కూటమి ఆవిష్కరణకు ఈ వర్గాలు కృషి చేస్తున్నట్లు సంకేతాలు లభిస్తున్నాయి. తృతీయ కూటమి ఆవిష్కరణ, మైత్రి వగైరా అంశాలపట్ల సకాలంలో స్పందిస్తామని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తరచూ దాట వేస్తున్నారు.  

Advertisement
Advertisement