మనీశ్‌తో మారిన సమీకరణాలు | Sakshi
Sakshi News home page

మనీశ్‌తో మారిన సమీకరణాలు

Published Fri, Nov 22 2013 11:43 PM

Triangular contest in Patparganj

సాక్షి, న్యూఢిల్లీ:  తాజా ఎన్నికలతో రాజకీయరంగ ప్రవేశం చేస్తున్న ఆమ్‌ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా రాకతో పత్పర్‌గంజ్ ఎన్నికల సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్-బీజేపీల మధ్యే ప్రధానంగా పోటీ నెలకొన్నా ఈసారి ఇక్కడ ముక్కోణపు పోటీ తప్పదంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్‌కు చెందిన చౌదరీ అనిల్ కుమార్,  బీజేపీకి చెందిన నకుల్ భరద్వాజ్‌ను ఆరువందల ఓట్లతో ఓడించారు. అనిల్‌కుమార్ ప్రస్తుత విధానసభలో అతి పిన్న వయస్కులైన సభ్యులలో ఒకరు. ఈసారి కూడా కాంగ్రెస్ మళ్లీ అనిల్ కుమార్‌కే టికెట్ ఇచ్చింది. బీజేపీ కూడా నకుల్ భరద్వాజ్‌నే బరిలోకి దింపింది. ఈ ఇరువురు యువనేతలు ఢిల్లీ  విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం రాజకీయాల్లోనూ ప్రత్యర్థులే.  వారి మధ్యనున్న రాజకీయ వైరం 2008 ఎన్నికల్లోనూ కనిపించింది. అయితే ఏఏపీ తరఫున రంగంలోకి దిగిన మనీశ్ సిసోడియాతో ఓట్లు చీలే అవకాశముందంటున్నారు.

మనీష్ సిసోడియా ఆమ్‌ఆద్మీ పార్టీ నేతలలో ప్రముఖుడు. ఈ నియోజకవర్గ ఓటర్లపై ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం కూడా అధికంగా ఉందని రాజ కీయ పండితులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పత్పర్‌గంజ్ ఎన్నికల పోరు ఆసక్తికరం గా మారింది. మొత్తం 11 మంది అభ్యర్థులు ఈ నియోజకవర్గంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
 లక్షా అరవై వేల మంది ఓటర్లున్న ఈ నియోజవర్గంలో ప్రధాన సమస్యలను చెప్పమంటే ముందుగా నీటి నాణ్యత, సీవేజ్, గార్బేజ్ సమస్యలనే చెబుతారు. వినోద్ నగర్, మండావలి, మయూర్ విహార్ ఫేజ్-2, పత్పర్‌గంజ్ వార్డులు ఈ నియోజకవర్గం పరిధి కిందకు వస్తా యి. ఇక్కడి ఓటర్లను మూడు విభాగాలుగా విభజించవచ్చు.  

మొదటి విభాగంలో హౌజింగ్ సొసైటీలు, డీడీఏ ఫ్లాట్లలో నివసించే విద్యావంతులు, ప్రొఫెషనల్స్, ఉద్యోగులు  కాగా రెండవ విభాగంలో వ్యాపారులు, ఇతర ప్రాంతాల నుంచి వలసవచ్చి చిన్నాచితకా ఉద్యోగాలతో, వ్యాపారాలతో పొట్టపోసుకునేవారు. ఇక మురికివాడలు, పునరావాస కాలనీలలో నివసించే రోజుకూలీలు, ఆటోడ్రైవర్లు, ఇళ్లలో పనులు చేసేవారు మూడో విభాగం కిందకు వస్తారు. అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించడంలో అందరిదీ కిలకపాత్రే అని చెప్పవచ్చు.   

Advertisement
Advertisement