ఉప్పూరులో థర్మల్ కేంద్రం | Sakshi
Sakshi News home page

ఉప్పూరులో థర్మల్ కేంద్రం

Published Tue, Mar 1 2016 3:52 AM

Uppuru in Thermal Center

సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి మెరుగుపడ్డ విషయం తెలిసిందే. కొత్త ప్రాజెక్టుల ద్వారా ఫలాలు దక్కడంతో విద్యుత్ కొరతను అదిగమిస్తున్నారు. ఇక, మరిన్ని కొత్త ప్రాజెక్టుల దిశగా అడుగులు వేస్తున్న సీఎం జయలలిత రాష్ట్రంలో మిగులు విద్యుత్ లక్ష్యంగా కంకణం కట్టుకుని ఉన్నారు. ఇందులో భాగంగా పలు కొత్త ప్రాజెక్టులకు చర్యలు చేపట్టారు. రామనాథపురం ఉప్పూరులో 995 ఎకరాల విస్తీర్ణంలో తలా 800 మెగావాట్లు చొప్పున రెండు యూనిట్లతో నేల బొగ్గు సాయంతో ఉత్పత్తయ్యే థర్మల్ విద్యుత్ కేంద్రానికి నిర్ణయించారు. ఇందుకు గాను రూ. 12,778 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.

ఈ పనులకు తగ్గ అన్ని కసరత్తులు పూర్తయ్యాయి. దీంతో ఉప్పూరు థర్మల్ విద్యుత్ కేంద్రం పనులకు సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జయలలిత శంకుస్థాపన చేశారు. అలాగే, పనులకు గాను తొలి విడతగా రూ.5,580 కోట్లను కేటాయించారు. ఇందుకు తగ్గ ఒప్పంద పత్రాల్ని బిహెచ్‌ఈఎల్ చైర్మన్ అతుల్ సోబ్తికి అందజేశారు.

ఇక, విల్లుపురం జిల్లా ఉలందూరు పేటలో, చెన్నై వ్యాసార్పాడిలో, కృష్ణగిరి గురుపర పల్లిలో, కంచి కున్నం పట్టులో 230-110 కేవి, తిరువళ్లూరు అలమాడి, మదురై నాడార్ మంగలం, పుదుకోట్టై పూ కొడి, వేలూరు పున్నం, కడలూరు అదరిలో 110-33 కేవీ, తిరుప్పూర్ వేదనూర్, పుదూర్, ఈరోడ్ మొండియం పాళయంలలో 110-22, తిరువణ్ణామలై అత్తిమూరు, అంబట్టూల్లో 33-11 కేవిలతో రూ. 42 కోట్లతో నెలకొల్పిన విద్యుత్ సబ్ స్టేషన్లను ప్రారంభించారు.
 
రెవెన్యూ డివిజన్లు
రెవున్యూశాఖ నేతృత్వంలో పుదుకోట్టై ఇలుప్పూర్‌లో కోటి 64 లక్షలతో నిర్మించిన రెవెన్యూ కార్యాలయం, అధికారుల క్వార్టర్స్‌ను ప్రారంభించారు. అలాగే, ఆ శాఖ పరిధిలో వివిధ ప్రాంతాల్లో రూ. 42 కోట్ల 81 లక్షలతో నిర్మించిన భవనాలు, అతిథి గృహాలు, క్వార్టర్స్‌లను కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఇక, చెన్నై ఎగ్మూర్, మదురై మేలూరు, కోయంబత్తూరు ఉత్తరం, విరుదునగర్ సాత్తూరుల్ని రెవెన్యూ డివిజన్లుగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో పాటుగా సోమవారం నుంచి ఆ నాలుగు ప్రాంతాలు రెవెన్యూ డివిజన్లుగా అమల్లోకి తీసుకొచ్చారు.

అలాగే, కీల్ పెన్నాత్తూరు, మేల్ మలయనూర్, కొండాచ్చిపురం, చూలగిరి, కరిమంగం, న ల్లవల్లి, కడయం, పల్లారం,పేర్నాంబట్టు, మానూరు, చెర్మింగాదేవి, కోరమ పాళయం, తలవాడి తదితర 16 రెవిన్యూ తాలుకాల్ని ప్రకటిస్తూ, అమల్లోకి తెచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నత్తం విశ్వనాథన్, ఆర్‌బీ.ఉదయకుమార్, విజయభాస్కర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జ్ఞాన దేశికన్, సలహదారు షీలా బాలకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. కాగా, వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవాల అనంతరం సీఎం జయలలిత రాష్ట్రంలో వివిధ ప్రమాదాల్లో మరణించిన పలు కుటుంబాల్ని ఆదుకుంటూ తలా రూ.మూడు లక్షలు ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

Advertisement
Advertisement