ఎం.కృష్ణప్పకు అమాత్య పదవి ! | Sakshi
Sakshi News home page

ఎం.కృష్ణప్పకు అమాత్య పదవి !

Published Mon, Sep 5 2016 1:42 AM

ఎం.కృష్ణప్పకు అమాత్య పదవి !

నేడు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం
వక్కలిగల సంబరాలు


బెంగళూరు : ఎట్టకేలకు విజయనగర నియోజకవర్గ ఎమ్మెల్యే, వక్కలిగ సామాజిక వర్గానికి చెందిన ఎం.కృష్ణప్ప అమాత్య పదవిని అలంకరించబోతున్నారు. రాజ్‌భవన్‌లో  సోమవారం  గవర్నర్ వజుభాయ్ రుడా భాయ్ వాలా ఆయన చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. జూన్ 19న జరిగిన మంత్రి మండలి పునఃవ్యవస్థీకరణలో ఎం.కృష్ణప్పకు అమాత్య పదవి లభిస్తుందని అందరూ భావించారు. అయితే  చివరి క్షణంలో ఆయన పేరును తొలగించడంతో కృష్ణప్ప నియోజక వర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కలిగ సామాజిక వర్గ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో నిరసనలు చెలరేగాయి. చివరికి సీఎం సిద్ధరామయ్య కృష్ణప్పకు సమీప భవిష్యత్తులో మంత్రి పదవి ఇస్తానని మాట ఇవ్వడంతో నిరసనలు సద్దుమణిగాయి. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పదవుల విషయమై హైకమాండ్‌తో చర్చించడానికి ఢిల్లీ వెళ్లిన సిద్ధరామయ్యకు మొదట ఎం.కృష్ణప్పకు అమాత్య పదవి ఇవ్వాలని సూచింది. ఈ నేపథ్యంలో దీంతో నేడు ఎం.కృష్ణప్ప నేడు అమాత్య పదవిని అలంకరించబోతున్నారు. ఇదిలా ఉండగా విషయం తెలిసిన వెంటనే ఆయన మద్దతుదారులు మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకున్నారు.

కాగా, కృష్ణప్పకు గృహ నిర్మాణ, సమాచార శాఖలను కేటాయించనున్నట్లు సమాచారం. డీఎస్పీ గణపతి ఆత్మహత్య కేసులో ప్రథమ నిందితుడుగా ఉన్న కే.జే. జార్జ్ మంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడిన స్థానాన్ని తిరిగి అతనికే కేటాయించనున్నారు. మరోవైపు పశుసంవర్థకశాఖ మంత్రి ఏ.మంజు, గనుల శాఖ మంత్రి వినయ్‌కులకర్ణీకు క్యాబినెట్ హోదా లభించనుంది. ఇదిలా ఉంటే తనకు మంత్రి పదవి కేటాయించడం పట్ల కృష్ణప్ప ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను శనివారం సాయంత్రం కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. 

 
అంబికి నిరాశ : మంత్రి మండలి పునఃవ్యవస్థీకరణలో మంత్రి పదవి కోల్పోయిన అంబరీష్‌కు మంత్రి మండలిలో తిరిగి సభ్యత్వం లభించనుందని వార్తలు వచ్చాయి. కొన్నిసార్లు అంబరీష్ కూడా పరోక్షంగా తనకు మంత్రి పదవి దక్కుతుందని చెప్పుకొంటూ వచ్చారు. అయితే తాజా పరిణామంతో అంబి ఆశలు ఆవిరయ్యాయని ఆయన అనుచరులే చెబుతున్నారు. 

 

 

Advertisement
Advertisement